వందలాది మందికి ఉపాధి కేంద్రంగా రామభద్రపురం అంతరరాష్ట్ర కూరగాయల మార్కెట్
ఇక్కడ నుంచి ఉత్తరాంధ్ర సహా నాలుగు రాష్ట్రాలకు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి
రోజూ రూ.15లక్షల నుంచి రూ.20 లక్షల మేర పంట క్రయవిక్రయాలు
రామభద్రపురం అంతరరాష్ట్ర మార్కెట్... ఉత్తరాంధ్రాలోనే పెద్దది. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి చూపుతోంది. ఆకలి తీర్చుతూ ఆనందం కలిగిస్తోంది. అంతులేని సంతృప్తినిస్తోంది. అమ్మలా ఆదుకుంటోంది. నాలుగు రాష్ట్రాలకు నిరంతరం కూరగాయలు ఎగుమతికి కేరాఫ్‌గా నిలుస్తోంది. ప్రతిరోజూ రూ.35 లక్షల నుంచి రూ.45లక్షల మధ్య కూరగాయలు, పండ్ల వ్యాపారానికి కేంద్రంగా... అటు రైతులు, ఇటు వ్యాపారులు, కలాసీలు, రవాణా వాహనదారులు, టీ షాపుల వారు ఇలా పలువర్గాల ప్రజల జీవనానికి దిక్సూచీగా నిలుస్తోంది. ఏడాది పొడవునా శ్రమైక జీవన సౌందర్యాన్ని ప్రతిబింబించే మార్కెట్‌పై ‘సాక్షి’ అక్షర రూపం.
రామభద్రపురం: రామభద్రపురం అంతర రాష్ట్ర మార్కెట్‌లో రాత్రి 2 గంటలైతే చాలు... జన సందడి ఆరంభమవుతుంది. వాహన రాకపోకలు, కూరగాయలు, పండ్లను తీసుకొచ్చే వాహనాల రాకపోకలు కనిపిస్తాయి. ఛాయ్‌వాలా నుంచి చిరువ్యాపారుల వరకు ఎవరి పనిలో వారు నిమగ్నమవుతారు. ఉదయం 10 గంటల వరకు వ్యాపారాలను చక్కబెడుతూ తమ జీవనమార్గాన్ని వెతుక్కుంటారు.

రైతులే మూలం..
మార్కెట్‌కు రైతులే మూలం. రైతులకు మార్కెట్టే ఆధారం. ఈ ప్రాంతంలో 25 సెంట్లు నుంచి 2 ఎకరాల భూమి ఉన్న ఆసామీ వరకు నిరంతరం శ్రమిస్తారు. భూమిని సారవంతంగా మలచి బంగారు పంటలు పండిస్తారు. ధరలు బాగుంటే ఆనందిస్తారు. ధరలు పడిపోయిన సమయంలో దిగులు చెందుతారు. వ్యవసాయం ఓ వ్యాపకంగా ముందుకు సాగుతారు.

అందుకే... ఈ మార్కెట్‌లో 365 రోజులూ కూరగాయలు, సీజన్‌వారీ పండ్ల వ్యాపారం సాగుతుంది. వ్యాపారులు, కలాసీలు, వాహనదారులకు ఉపాధి లభిస్తోంది. ఇక్కడ కూరగాయల ధరలు కూడా ఇతర ప్రాంతాల కంటే తక్కువ ధరకే లభించడంతో ఉత్తరాంధ్రతో పాటు నాలుగు రాష్ట్రాల వ్యాపారులు మార్కెట్‌కు వచ్చి క్రయవిక్రయలు జరుపుతారు. తమ జీవనానికి మార్కెట్టే ఆధారమని చెబుతారు.
» రామభద్రపురం మార్కెట్ రామభద్రపురం, బాడంగి, దత్తిరాజేరు, గజపతినగరం, మెంటాడ, సాలూరు, బొబ్బిలి మండలాల రైతులు సాగుచేసిన కూరగాయలు, పండ్ల విక్రయాలకు ఆధారం. రోజూ 3 వేల మంది వరకు రైతులు కూరగాయలు, పండ్లను ఇక్కడకు తెస్తుంటారు.
» ఈ మార్కెట్ నుంచి రోజూ ఒడిశా రాష్ట్రంలోని రాయగడ, సుంకి, పొట్టంగి, జగదల్‌పూర్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్నాటక, మహారాష్ట్రలకు కూరగాయలు తరలిస్తారు. ఉదయాన్నే కోసిన కాయగూరలను నేరుగా మార్కెట్‌లోకి రైతులు తేవడంతో కొనుగోలుకు వ్యాపారులు మొగ్గుచూపుతారు.
» శుభకార్యాలకు కూరగాయలు కొనుగోలు చేయాలంటే గుర్తొచ్చేది రామభద్రపురం మార్కెట్.
»ఈ మార్కెట్‌పై ఆధారపడి పరిసర గ్రామాలకు చెందిన చిరువ్యాపారులు, కార్మికులు వందల సంఖ్యలో జీవనం సాగిస్తుంటారు.
» ఈ మార్కెట్ వల్ల ఏటా సుమారు రూ.35 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూరుతుంది.
కార్మికులకు ఉపాధి భరోసా..
రామభద్రపురం కూరగాయల మార్కెట్ మా లాంటి పలువురు కార్మికులకు ఉపాధినిస్తోంది. కూరగాయలు, పండ్ల మూటలను లారీలకు లోడ్‌చేయడం వల్ల రోజూ రూ.400 నుంచి రూ.500 వరకు కూలి వస్తుంది. ఆ డబ్బులతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నా. రైతులు కష్టపడి పంట పండిస్తేనే మా లాంటి వారికి ఉపాధి. – సవరాల శ్రీనివాసరావు, కార్మికుడు, రామభద్రపురం

జీవనాధారం ఇదే..
మా తాతదండ్రులనుంచి కూరగాయల సాగే మాకు జీవనాధారం. సీజన్‌లో అయితే రెండు మూడు రకాల కూరగాయలు పండిస్తాం. అన్‌సీజన్‌లో ఒకటి రెండు రకాలే పండిస్తాం. నిత్యం ఏదో ఒక రకం కూరగాయ పంటలు పండిస్తాం. ఈ ఏడాది ఎకరా విస్తీర్ణంలో వంగ, మిరప, చిక్కుడు తదితర కూరగాయలు వేశాను. దిగుబడి బాగా వచ్చింది. రామభద్రపురం మార్కెట్‌కు తెచ్చి విక్రయిస్తున్నాం. – తూముల సింహాచలం, రైతు, రామభద్రపురం
మూటలు కట్టుకుని జీవనం..
ఈ ప్రాంత రైతులు అధికంగా కూరగాయల పంటలు సాగుచేయడం వల్లే రామభద్రపురం మార్కెట్‌కు మంచి పేరువచ్చింది. రైతు, మార్కెట్ లేకుంటే మా లాంటి వారి జీవనం దుర్భరంగా ఉండేది. పదేళ్లుగా ఇక్కడే కలాసీగా పనిచేస్తున్నాను. కాలువిరిగిపోవడంతో మూటలు కట్టుకుని బతుకుతున్నాను. – బోను అప్పలనాయుడు, రామభద్రపురం


