
రాష్ట్రవాప్తంగా కలెక్టరేట్‌ల ఎదుట ధర్నాలు
కర్నూలులో గాడిదల్ని తీసుకొచ్చి నిరసన
పలుచోట్ల దుస్తులు ఉతికి ఆందోళన
ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు కూటమి నేతలు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ రాష్ట్రంలోని రజక వృత్తిదారులు సోమవారం చాకిరేవు పేరిట నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఏపీ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో 11 జిల్లాల్లో కలెక్టరేట్‌ల ఎదుట ధర్నాలు చేసి, కూటమి హామీలు తక్షణం అమలు చేయాలని వినతిపత్రాలు సమర్పించారు. మరో మూడు జిల్లాల్లో నేరుగా కలెక్టర్‌లను కలిసి వినతిపత్రాలు సమర్పించారు.
పలుచోట్ల కలెక్టరేట్‌ల వద్ద దుస్తులు ఉతికి ఆరేసి నిరసన తెలిపారు. కర్నూలు కలెక్టరేట్‌కు గాడిదల్ని తీసుకొచ్చి ధర్నా చేశారు. విజయవాడ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాను ఉద్దేశించి ఏపీ రజక వృత్తిదారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నూరు భాస్కరయ్య మాట్లాడుతూ.. రజకులకు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 14 నెలలైనా వాటి అమలును పట్టించుకోలేదని మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక రజకులపై దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు పెరిగాయన్నారు. వాటి నివారణ కోసం రజకులకు సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేస్తానని చెప్పిన మాట మంత్రుల సబ్ కమిటీతో సరిపెట్టారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు చిక్కవరపు వెంకటరెడ్డయ్య, లింగాల నిర్మలమ్మ, పి.జగన్, దుర్గాభవాని, లింగాల శివపార్వతి, బేబీ సరోజిని, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ప్రధాన డిమాండ్లు ఇవీ..
⇒ రజక వృత్తిదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాలి.
⇒ 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్న హామీ నిలబెట్టుకోవాలి.
⇒ రజక వృత్తికి సౌకర్యాలు కల్పించాలి.
⇒ నీటి వనరులు అందుబాటులో లేనిచోట నీటి వసతి కల్పించాలి.
⇒ తెలంగాణ తరహాలో మోడ్రన్ దోబీఘాట్లు నిరి్మంచాలి.
⇒ వృత్తి చెరువులపై రజకులకే పూర్తి హక్కులు కల్పించాలి.
⇒ ఇల్లులేని రజకులకు స్థలం ఇచ్చిఇళ్లు నిర్మించాలి.
⇒ జీవో నంబర్–27 ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వేలాది దోబీ పోస్టుల్ని భర్తీ చేయాలి.
⇒ జీవో–26 ప్రకారం రజక సంక్షేమ కమిటీలు ఏర్పాటు చేసి కలెక్టర్ల అధ్యక్షతన ప్రతి మూడు నెలలకు ఒకసారి రజకుల సమస్యలపై చర్చించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలి.