సాక్షి, అన్నవరం: పూరీ నుండి తిరుపతి వెళ్తున్న 17479 ఎక్స్‌ప్రెస్ రైలుకు ఈరోజు (గురువారం) ఉదయం పెను ప్రమాదం తప్పింది. రైలు ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా పరిధిలోని తుని - అన్నవరం రైల్వే స్టేషన్ల మధ్య ప్రయాణిస్తున్న సమయంలో, ఉదయం 6 గంటల ప్రాంతంలో ఒక బోగీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.
రైలులోని బీ5 ఏసీ బోగీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బోగీలోని ప్యానెల్ బోర్డు వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు చెలరేగాయి. అవి పక్కనే ఉన్న దుప్పట్లకు అంటుకోవడంతో బోగీ అంతటా పొగలు కమ్ముకున్నాయి. దీనిని గమనించిన ప్రయాణికులు భయాందోళనతో కేకలు వేయడంతో రైలులో కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది.
ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే రైల్వే సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించారు. రైలులోని అగ్నిమాపక పరికరాలను ఉపయోగించి, మంటలు ఇతర బోగీలకు వ్యాపించకుండా అదుపు చేశారు. సిబ్బంది అప్రమత్తత వల్ల భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం తప్పాయి. ఈ ప్రమాదం దరిమిలా ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు ధృవీకరించారు.
మంటలను అదుపు చేసిన తర్వాత రైలును రాజమహేంద్రవరం స్టేషన్‌కు తరలించారు. అక్కడ రైల్వే సాంకేతిక నిపుణులు, ఉన్నతాధికారులు ప్రమాదానికి గురైన బీ5 బోగీని నిశితంగా పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై విచారణ చేపట్టారు. తనిఖీల అనంతరం రైలు తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించింది.


