
గోదావరికి ఎర్రనీరు వచ్చిందంటే చాలు సముద్రం నుంచి పులసలు ఎర్రెక్కుతాయి.
పెనుగొండ(పశ్చిమ గోదావరి జిల్లా): గోదావరికి ఎర్రనీరు వచ్చిందంటే చాలు సముద్రం నుంచి పులసలు ఎర్రెక్కుతాయి. వారం రోజులుగా గోదావరిలో ఎర్రటి నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పులసలు లభ్యమయ్యే కాలం ఆసన్నమైంది. ఇప్పటికే గోదావరి పరీవాహక ప్రాంతాల్లో పులసల జాడ కనిపిస్తోంది. సముద్రంలో జీవించే ఇలస చేప గోదావరికి వరద నీరు రాగానే ఎర్రదనంలోని తీపిని ఆస్వాదిస్తూ బంగాళాఖాతం నుంచి ఎదురీతుకుంటూ నదిలోకి వస్తుంది.
ముఖ్యంగా వశిష్ట గోదావరిలో సిద్ధాంతం నుంచి ప్రారంభమై మల్లేశ్వరం, ఖండవల్లి, తీపర్రు, పెండ్యాల, గౌతమి గోదావరిలో జొన్నాడ, ఆలమూరు, చెముడులంక, కేదారిలంక ప్రాంతాల్లో జాలర్లకు చిక్కుతుంటాయి. ధవళేశ్వరం ఆనకట్ట వరకూ పులసల జాడ కనిపిస్తుంటుంది. వారం రోజులుగా గోదావరి వరద నీరు ఉధృతంగా సముద్రంలో కలుస్తుండటంతో పులసలు సమృద్ధిగా దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అ‘ధర’హో..
‘పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి’ ఇది గోదావరి ప్రాంతంలో నానుడి. ఏడాదికి ఓసారి మాత్రమే లభించే పులసల కోసం మాంసప్రియులు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ధర ఎంతైనా కొనేందుకు వెనుకాడరు. దీంతో వీటికి డిమాండ్ అధికంగానే ఉంటుంది. బరువును బట్టి చేప ఒకటి రూ.1,500 నుంచి రూ.6 వేల వరకు ధర పలుకుతుంది.
ఇలసలను పులసలుగా..
పులసల డిమాండ్ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో ఇలసలను పులసలుగా చెబుతూ విక్రయిస్తుంటారు. ఒడిషా సముద్ర తీరంలో విరివిగా లభించే ఇలసలను తక్కువ ధరలకు తీసుకొచ్చి జిల్లాలో పులసలుగా అమ్ముతుంటారు. వీటి మధ్య తేడా గుర్తించడం కూడా కష్టమే. ఎర్రనీటిలో ప్రయాణించడం వల్ల పులసలు ఎరుపు, గోధుమ వర్ణంలో కనిపిస్తుంటాయి. ఇలసలు తెలు పు రంగులోనే ఉంటాయని జాలర్లు అంటున్నారు.