సా‘ఫీ’గా చెల్లించకుంటే రద్దు చేయండి | Private Degree Colleges Association is angry over the implementation of fee reimbursement | Sakshi
Sakshi News home page

సా‘ఫీ’గా చెల్లించకుంటే రద్దు చేయండి

Apr 22 2026 3:14 AM | Updated on Apr 22 2026 3:14 AM

Private Degree Colleges Association is angry over the implementation of fee reimbursement

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలుపై ప్రైవేటు డిగ్రీ కళాశాలల అసోసియేషన్‌ ఆగ్రహం 

విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకునే అవకాశం ఇవ్వండి 

జీవోలు తప్ప బకాయిలు పైసా విదల్చట్లేదు 

రెండేళ్లుగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి సతమతమవుతున్నాం 

సర్కారు  తీరును దుయ్యబట్టిన యాజమాన్యాలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు కొండలా పేరుకుపోవడంతో ఉన్నత విద్యా రంగం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్‌ ఆక్షేపించింది. ప్రభుత్వం ఫీజు రీయి­ంబర్స్‌మెంట్‌ పథకాన్ని కొనసాగించలేకపోతే రద్దు చేయడమో, పునఃపరిశీలించడమో చేయాలని సూ­చి­ంచింది. మంగళవారం గుంటూరు జిల్లా చినకాకానిలో అసోసియేషన్‌ సమావేశం జరిగింది. యా­జ­­మాన్యాల ప్రతినిధులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలుపై సుదీర్ఘంగా చర్చించారు. 

అనంతరం అసోసియేషన్‌ అధ్యక్షుడు రమణాజీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఫీజుల భారా­న్ని మో­య­­లేకుంటే వచ్చే విద్యా సంవత్సరంలో విద్యా­ర్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకునే వెసులుబా­టు కళాశాలలకు కల్పించాలని కోరారు. బకాయి­ల విడుదలపై ప్రభుత్వం జీవోలు విడుదల చేస్తుంది తప్ప పైసా విదల్చడం లేదని విమర్శించారు. 

ఇప్పటి వరకు డిగ్రీ కళాశాలలకు దాదాపు 90శాతం ఫీజులు పెండింగ్‌లో ఉన్నట్టు చెప్పారు. గత రెండేళ్లుగా కళాశాలలు నిర్వహణ కుంటుపడి దివాళా తీసే పరిస్థితి వచ్చిందన్నారు. సీఎంకు, మంత్రులకు, ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విజ్ఞ­ప్తి చేసినా పరిస్థితిలో మార్పు రావట్లేదని, ఈ ప్రభుత్వంలో ఉన్నత విద్యకు ప్రాధాన్యం లేదనే సందేహం కలు­గుతోందన్నారు.  

సింగిల్‌ మేజర్‌ వల్ల నష్టమే  
2025–26 విద్యా సంవత్సరంలో తీసుకొచ్చిన సింగిల్‌ మేజర్‌ విధానంతో నష్టం వాటిల్లుతోందని, విద్యాప్రమాణాలపై ప్రభావం పడుతోందని రమణాజీ ఆందోళన వ్యక్తం చేశారు. సంప్రదాయ డిగ్రీ కోర్సులు తగ్గిపోతుండగా వర్సిటీల్లో పీజీ కోర్సుల్లో 60–70శాతం సీట్లు ఖాళీగా ఉంటున్నాయన్నారు. రాష్ట్రంలో 1100 డిగ్రీ, 250 ఇంజనీరింగ్, 800పైగా ఇతర విద్యా సంస్థలు సేవలందిస్తున్నాయని, వీటి యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు జరిపి ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆమోదయోగ్య నిర్ణయానికి రావాలని హితవుపలికారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement