ఆహా ఏమి రుచి.. తేగలు తినడం వల్ల లాభాలివే..

Preparation And Benefits Of Palmyra Sprout - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: శీతాకాలంలో లభించే తేగలకు మంచి డిమాండ్‌ ఉంటుంది. అందులోనూ ఉండ్రాజవరం మండలంలో పలు గ్రామాల్లో తేగల రుచి బావుంటుందని ప్రజలు భావిస్తారు. ఉండ్రాజవరం మండలంలో పాలంగి, చివటం, ఉండ్రాజవరం, దమ్మెన్ను, వేలివెన్నుతో పాటు పెరవలి మండలం కానూరు, ముక్కమల, పెరవలి, అన్నవరప్పాడు తదితర గ్రామాల్లో తేగల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సీజన్‌లో తేగలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

తేగ బాగా ఊరటంతో పాటు రుచిగా ఉండటం ఇక్కడ ప్రత్యేకత. నిడదవోలు నియోజకవర్గంలో సుమారు 100 కుటుంబాలు ఏటా ఈసీజన్‌లో తేగల విక్రయాలతో ఉపాధి పొందుతున్నారు. సెప్టెంబర్‌ నుంచి జనవరి వరకు తేగల విక్రయాలు జోరుగా సాగుతాయి. పెద్ద సైజు తేగల కట్ట రూ.50 నుంచి రూ.100, చిన్న సైజు తేగల కట్ట రూ.20 వ్యాపారులు విక్రయిస్తున్నారు. తేగల ధర అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండటంతో ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. 

తేగలను కుండల్లో పెట్టి కాలుస్తున్న దృశ్యం 

తేగల తయారీ విధానం  
మండలంలోని పలు గ్రామాల్లోని పొలాల్లో తాటిచెట్లు నుంచి తాటికాయలు తయారైన తరువాత వాటిని సేకరించి నేలలో గుంతలు తీసి పాతర వేస్తారు. అవి మొలకలు వచ్చి తేగలు తయారువు తాయి. ఇవి ఏటా నవంబర్‌ నాటికి సిద్ధమవుతాయి. ఆతరువాత పాతర నుంచి తేగలను నుంచి తాటి బుర్రలను వేరే చేస్తారు. తేగలను మట్టి కుండల్లో పెట్టి కాలుస్తారు. తరువాత వాటిని కట్టలు కడతారు. వీటిని స్థానిక దుకాణాల్లో, హోల్‌సేల్‌ వ్యాపారులకు విక్రయిస్తారు. ఈఏడాది తేగల వ్యాపారం మార్కెట్‌ ఆశాజనకంగా ఉందని విక్రయదారులు అంటున్నారు.  

లాభాలు
తాటి కాయల నుంచి మనకు లభించే ఈ తేగల్లో మానవ శరీరానికి మేలు చేసే పీచు పదార్థంతో పాటు పిండి పదార్థం కూడా పుష్కలంగా లభిస్తుంది. జీర్ణశక్తి మెరుగ య్యేందుకు తేగలు దోహదపడతాయని కొనుగోలుదారుల నమ్మకం. తేగలను బాగా ఉడికించి.. మిరియాలు, ఉప్పు రాసుకుని తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. తేగలు తింటే బరువు తగ్గడంతో పాటు క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top