అరిస్తే నేను బెదిరేవాడిని కాను.. నేను బెదరను! | prathipadu people fire on mla Burla Ramanjaneyulu | Sakshi
Sakshi News home page

అరిస్తే నేను బెదిరేవాడిని కాను.. నేను బెదరను!

Jul 14 2025 12:34 PM | Updated on Jul 14 2025 1:57 PM

prathipadu people fire on mla Burla Ramanjaneyulu

తొలి అడుగులో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులును

నిలదీసిన టీడీపీ మహిళలు

గుంటూరు: ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులుకు తొలి అడుగులోనే చేదు అనుభవం ఎదురైంది. ‘‘అసలు మేము పార్టీ వాళ్లమా.. కాదా? ఇతర పార్టీల నుంచి వచ్చినోళ్లకి విలువ ఉంది గానీ మీ గెలుపు కోసం, తెలుగుదేశం కోసం కష్టపడిన మాకు విలువ ఉందా ? మీ చుట్టూ పిచ్చికుక్కల్లా తిరుగుతున్నాం.. పార్టీ గెలిచిన నుంచి మమ్మల్ని ఆలకించినోళ్లు లేరు’’ అంటూ తీవ్రస్థాయిలో ఎమ్మెల్యే బూర్లపై టీడీపీ మహిళా నేతలు మండిపడ్డారు. పెదనందిపాడు మండలం పాలపర్రులో ఆదివారం స్థానిక శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఈ సందర్భంగా గ్రామంలో పర్యటిస్తున్న ఆయనకు మహిళలు మాటల తూటాలతో చుక్కలు చూపించారు. వీవోఏ అక్రమాలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అవినీతికి పాల్పడిన వారికి సహకరించడం ఏమిటని ఆయన్ను ప్రశ్నించారు. కార్యాలయానికి ఎన్నిసార్లు వచ్చినా పట్టించుకునే వారు గానీ ఆలకించే వారు గానీ లేరని ఆగ్రహించారు. తాము పార్టీలో వాళ్లమా కాదా అనేది ఇప్పుడు ఊర్లో అందరి మధ్యా చెప్పాలని డిమాండ్‌ చేశారు. పార్టీని గెలిపించుకుని సంవత్సరం అవుతుందని, ఏరోజైనా తమను పట్టించుకున్నారా ? అని ఫైర్‌ అయ్యారు.

అరిస్తే నేను బెదిరే వాడిని కాదు
దీనికి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ‘‘అది మీ ఊరి సమస్య మీరే తేల్చుకోవాలంటూ సమాధానం ఇవ్వగా.. మరి మా ఊరు సమస్య అన్నప్పుడు నువ్వు ఓట్లకి ఎందుకొచ్చావ్‌ అప్పుడు ?’’ అంటూ మహిళలు ఎదురు ప్రశ్నించారు. ఒక దశలో తీవ్ర అసహనానికి గురైన ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ‘‘నాకు చాలా ఓర్పు ఉంది.. సాయంత్రం వరకు ఉండే ఓపిక ఉందని, వచ్చినప్పుడు అరిస్తే నేను బెదిరేవాడిని కాను.. నేను బెదరను !’’ అంటూ మహిళలకు వేలు చూపిస్తూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిమ్మల్ని బెదిరించాల్సిన అవసరనం తమకు లేదని మహిళలు తెలిపారు. అనంతరం వారితో మాట్లాడి అవినీతికి పాల్పడిన వీవోఏ వివరాలను నమోదు చేసుకున్నారు. వారం రోజుల్లో విచారణ చేయించి, అవినీతి నిరూపణ అయితే చర్యలు తీసుకుంటామని చెప్పడంతో మహిళలు శాంతించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement