వీడిన పిఠాపురం యువతి అదృశ్యం కేసు మిస్టరీ.. అసలేం జరిగిందంటే..

Police Solved Pithapuram Degree Student Missing Case In 24 Hours - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: పిఠాపురం పట్టణంలో కలకలం రేపిన యువతి అదృశ్యం కేసును 24 గంటల్లో ఛేదించినట్టు, ఆమెను తల్లిదండ్రులకు అప్పగించినట్టు కాకినాడ డీఎస్పీ భీమారావు తెలిపారు. యువతి మానసిక స్థితి బాగోలేక విజయవాడ స్నేహితుల దగ్గరకు వెళ్లి పోగా సాంకేతిక పరిజ్ఞానంతో ఆమె ఆచూకీ తెలుసుకుని అదుపులోకి తీసుకుని తల్లిదండ్రులకు అప్పగించామని ఆయన తెలిపారు. ఆమె ఆటో ఎక్కినట్టు తప్పుడు సమాచారం ఇచ్చిందన్నారు. సోషల్‌ మీడియాలో వచ్చిన కథనాలన్నీ అభూతకల్పనలుగా ఆయన కొట్టిపారేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.  

కేసులో అనేక మలుపులు 
పరీక్షల హాల్‌ టిక్కెట్‌ తెచ్చుకోవడానికి వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన ఒక యువతి అదృశ్యమైన ఈ ఘటన జిల్లా పోలీసులకు సవాల్‌గా మారింది. ఆటో ఎక్కితే డ్రైవరు ఏడిపిస్తున్నాడు అంటూ ఆమె మెసేజ్‌ పంపినట్టు సోషల్‌ మీడియాలో వచ్చినవన్నీ అబద్దాలని (ఆ సమయంలో ఆమె కాకినాడ ఆర్టీసీ బస్టాండ్‌లో కనిపించింది) సీసీ పుటేజీల ఆధారంగా పోలీసులు నిర్ధారించారు.  

అసలేం జరిగిందంటే.. 
డిగ్రీ విద్యార్థిని అయిన ఆమె కొన్ని రోజులుగా ఇంటి వద్దే చదువుకుంటోంది. సోమవారం మధ్యాహ్నం కాకినాడలో తాను చదువుకుంటున్న కాలేజీ నుంచి హాల్‌ టిక్కెట్‌ తెచ్చుకుంటానని వెళ్లింది. పిఠాపురంలో ఉప్పాడ బస్టాండ్‌కు వెళ్లి కాకినాడ వెళ్లేందుకు ప్రైవేటు బస్‌ ఎక్కింది. కొంత సేపటికే సెల్‌ స్విచ్‌ ఆఫ్‌ అయ్యింది. తరువాత ఆమె కాకినాడ భానుగుడి సెంటర్లో బస్‌ దిగి, అక్కడి నుంచి ఆటోలో బస్టాండ్‌కు వెళ్లి ఉంటుందని పోలీసులు అనుకున్నారు. 
చదవండి: టీడీపీ: పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున బట్టబయలైన విభేదాలు

కట్టు కథేనా? 
సోమవారం రాత్రి 10–30 గంటల సమయంలో ఒకసారి ఆమె ఫోన్‌ ఆన్‌ అయినట్టు ఒక కాల్‌ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. మంగళవారం తెల్లవారుజామున ఆమె తన స్నేహితుల సోషల్‌ మీడియా గ్రూపుల నుంచి తప్పుకోవడం సెల్‌ సిగ్నల్‌ ఆధారంగా పోలీసులు గుర్తించారు. దీంతో సోషల్‌ మీడియాలో వచ్చిన కథనాలు కట్టు కథగా పోలీసులు భావించారు. అసలు ఆమె అలా ఎందుకు వెళ్లింది..? ఎక్కడకు వెళ్లింది అని దర్యాప్తు చేశారు. ఆమె సెల్‌ నుంచి సిమ్‌ తీసేయడంతో పోలీసులు దర్యాప్యులో ఇబ్బంది పడ్డారు. పోలీసులు వారికి కనీస సమాచారం ఇవ్వకుండా తన స్పేహితురాలు ఆపదలో ఉందంటూ సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టడం పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె ఫొటోలతో సహా పోస్టింగ్‌లు పెట్టడం నేరమంటున్నారు పోలీసులు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top