పొదిలి: గుప్త నిధుల తవ్వకాల కేసులో ఏడుగురు అరెస్టు

Police Arrested Seven Secret Treasure Hunters In Podili - Sakshi

పొదిలి(ప్రకాశం జిల్లా): గుప్త నిధుల కోసం చెరువులో తవ్వకానికి పాల్పడిన ఘటనలో ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పొదిలి సీఐ సుధాకర్‌ తెలిపారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం సాయంత్రం నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. తర్లుపాడు మండలం పోతలపాడు దశబంధు చెరువులో ఆదివారం అర్ధరాత్రి గుప్త నిధుల కోసం కొందరు వ్యక్తులు తవ్వకాలు చేపట్టారు. రాత్రి వేళ గస్తీ తిరుగుతున్న గ్రామ రక్షక దళానికి గుప్త నిధుల ముఠా పట్టుబడింది. మొత్తం తొమ్మిది మందిలో ఏడుగురు చిక్కగా మరో ఇద్దరు పరారయ్యారు.

పట్టుబడిన వారిని సోమవారం అరెస్ట్‌ చేశామని, నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. అరెస్టు అయిన వారిలో నరసరావుపేటకు చెందిన సయ్యద్‌ ఖరీం, డీకే మీరావలి, ఎస్‌కే సుభాని, బత్తుల శ్రీనివాసరావు, తమ్మిశెట్టి మణి, గురజాలకు చెందిన మన్నం శ్రీనివాస్, నామనకొల్లు గ్రామానికి చెందిన సయ్యద్‌బాజీ ఉన్నారని సీఐ పేర్కొన్నారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. నిందితుల నుంచి 7 సెల్‌ఫోన్లు, 2 కార్లు, 2 గడ్డపారలు, 2 చలకపారలు, ఒక బొచ్చె, ఒక పెద్ద సుత్తి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సమావేశంలో తర్లుపాడు ఎస్‌ఐ సువర్ణ, ఎస్‌బీ సంజయ్, హెడ్‌ కానిస్టేబుల్‌ రమేష్, కాశిరెడ్డి పాల్గొన్నారు.

చదవండి: ఒక్క రోజులోనే 663 ఒమిక్రాన్‌ కేసులు.. ‘ఏప్రిల్‌ నాటికి వేల సంఖ్యలో మరణాలు’!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top