ఏలూరు ఎస్పీ కార్యాలయం వద్ద నిర్మాణంలో ఉన్న మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఉంచిన మావోయిస్టులు
రాష్ట్రవ్యాప్తంగా 50 మంది అరెస్టు చూపిన పోలీసులు
ఎక్కడికక్కడ న్యాయస్థానాల్లో హాజరు
రిమాండ్ విధించిన న్యాయమూర్తులు
విజయవాడలీగల్/ఏలూరు టౌన్/కాకినాడ లీగల్: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం పట్టుబడిన మావోయిస్టులను బుధవారం పోలీసులు కోర్టుల్లో హాజరుపరిచారు. వీరిలో 46 మందికి న్యాయమూర్తులు రిమాండ్ విధించారు. విజయవాడ కానూరులోని న్యూఆటోనగర్‌లో 28 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్టు ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్హా తెలిపారు.
ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి(దేవ్‌జీ)కి చెందిన బృంద సభ్యులు, హిడ్మా బృంద సభ్యులు న్యూఆటోనగర్‌లో మకాం వేసినట్లు తెలిపారు. వీరిని బుధవారం ఉదయం 11 గంటల సమయంలో విజయవాడలోని న్యాయస్ధానాలలో పోలీసులు హాజరుపరిచారు. వీరిలో నలుగురి వయస్సు ధ్రువీకరణ పత్రాలు లేనందున, వారి వయస్సును ధ్రువీకరించాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు.
మిగిలిన 20 మంది మహిళలు, నలుగురు పురుషులకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. వీరిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ ప్రసాదంపాడులో పట్టుబడిన నలుగురు మావోయిస్టులకు న్యాయమూర్తి 3వ తేదీ వరకు రిమాండ్ విధించారు. వారిని నెల్లూరు జైలుకు తరలించారు.
కాకినాడ జిల్లాలో ఇద్దరు మహిళా మావోయిస్టులకు..
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం కొప్పవరంలో పట్టుబడ్డ ఇద్దరు మహిళా మావోయిస్టులకు బుధవారం కోర్టు రిమాండ్ విధించింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా, పోటకపల్లి ప్రాంతానికి చెందిన మాధవి కొసి అలియాస్ అనూష, పొటెం క్రాంతి అలియాస్ అంకితను కాకినాడ ఐదో అదనపు జ్యుడీíÙయల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా డిసెంబర్ 3వ తేదీ వరకు రిమాండ్ విధించారు. వారిని కాకినాడ స్పెషల్ సబ్‌జైలుకు తీసుకువెళ్లాలని మేజిస్ట్రేట్ షేక్ షిరిన్ ఆదేశాలు ఇచ్చారు.
అయితే కాకినాడ స్పెషల్ సబ్‌జైలులో మహిళ మావోయిస్టులు ఉండడానికి ప్రత్యేక గది లేకపోవడంతో రాజమõßహేంద్రవరం సెంట్రల్ జైలుకు పంపించారు. కోనసీమ జిల్లా రావులపాలెంలో పట్టుబడిన సరోజ్ మడవిని కొత్తపేట కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైల్‌కి తరలించారు.
ఏలూరులో 15 మందికి
ఏలూరు గ్రీన్ సిటీలోని ఒక ఇంట్లో మంగళవారం పట్టుబడిన 15మంది మావోయిస్టులను ఏలూరు జిల్లాకోర్టు ప్రాంగణంలోని స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం మావోయిస్టులను పోలీస్ బలగాలతో కట్టుదిట్టమైన భద్రతతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
తొలుత బుధవారం ఉదయం 15 మంది మావోయిస్టులను ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్ పర్యవేక్షణలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య పోలీస్ ఉన్నతాధికారులు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశానికి విజయవాడ తరలించారు. అనంతరం విజయవాడ నుంచి పోలీస్ భద్రత నడుమ ఏలూరు మహిళా పోలీస్‌స్టేషన్‌కు ఉదయం 10.30 గంటలకు తీసుకువచ్చారు.
భద్రతా కారణాల దృష్ట్యా ఏలూరు జీజీహెచ్ వైద్య నిపుణులను మహిళాస్టేషన్‌కు తీసుకువచ్చి అక్కడే మావోయిస్టులకు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
హిడ్మా గ్రూపులోని కీలక నేతలే
ఏలూరు జిల్లా పోలీసులకు పట్టుబడిన 15 మంది మావోయిస్టులు చత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందినవారు. వీరంతా సుఖ్మా, బీజాపూర్ జిల్లాలకు చెందినవారు. మోస్ట్‌వాంటెడ్ హిడ్మా గ్రూప్‌లో కీలక నేతలుగా పోలీస్ అధికారులు పేర్కొంటున్నారు.
లచ్చు.. పాత్ర హెచ్చు..
చత్తీస్‌ఘడ్ సుఖ్మా జిల్లాకు చెందిన లచ్చు అలియాస్ గోపాల్‌ను మావోయిస్ట్ కీలక నాయకుడిగా పోలీస్ అధికారులు చెబుతున్నారు. లచ్చు మావోయిస్ట్ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడుగా, సౌత్ బస్తర్ డీవీసీలో పనిచేస్తాడనీ, ఆయుధాల తయారీ, వినియోగంలో నిపుణుడని సమాచారం. హిడ్మా చేసిన అనేక కీలకమైన దాడుల్లో లచ్చు కీలక పాత్ర పోషించేవాడని తెలిసింది.
పలు భాషలు సైతం మాట్లాడే నైపుణ్యం అతడి సొంతం. పట్టుబడిన మావోయిస్టుల్లో వెట్టి వెంకట్ అనే వ్యక్తి గోపాల్‌కు అసిస్టెంట్‌గా ఉండేవారు. డీవీసీ సభ్యుడు మడకం వగ ప్రెస్‌కమిటీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. జాగరకొండ ఏరియా దళ సభ్యుడు బడిస రాజు లక్మాకు గార్డ్‌గా పనిచేస్తున్నారు.
భారీగా ఆయుధాలు
ఏలూరులో మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలు, నగదును ఏలూరు జిల్లా పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. రివాల్వర్స్–2, డబుల్ బ్యారెల్ బోర్ గన్–1, కంట్రీమేడ్ సింగిల్ బ్యారెల్ గన్స్–11, తపంచా –1, 132 రౌండ్ల బుల్లెట్స్, రూ.2.80 లక్షల నగదును పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.


