బాబు సర్కారులో 'డిస్కం' లు ఢమాల్‌ | The performance of electricity distribution companies in the state is dismal | Sakshi
Sakshi News home page

బాబు సర్కారులో 'డిస్కం' లు ఢమాల్‌

Apr 25 2026 4:31 AM | Updated on Apr 25 2026 4:31 AM

The performance of electricity distribution companies in the state is dismal

రాష్ట్రంలో విద్యుత్‌ పంపిణీ సంస్థల పనితీరు ఘోరం

భారీగా పడిపోయిన పారిశ్రామిక విద్యుత్‌ వినియోగం 

‘సెకీ’తో సహా విద్యుత్‌ ప్రాజెక్టులు తీవ్ర ఆలస్యం 

మూలధన వ్యయం అమలులోనూ వైఫల్యం  

పునరుత్పాదక విద్యుత్‌ లక్ష్యాల్లో లోపాలు 

‘ఏపీఈఆర్‌సీ’ నివేదికలో బయటపడ్డ వాస్తవాలు 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జాతీయ స్థాయిలో ‘ఏ’ గ్రేడ్‌లో నిలిచేవి. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో వాటి ర్యాంకింగ్‌ దారుణంగా పడిపోతోంది. ఇటీవల విడుదలైన జాతీయ ర్యాంకింగ్‌లలోనూ వెనుకబడి ‘బీ’ గ్రేడుతో సరిపెట్టుకున్నాయి. 

తాజాగా ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) శుక్రవారం విడుదల చేసిన 2024–25 డిస్కంల పనితీరు నివేదిక రాష్ట్ర విద్యుత్‌ రంగంలోని లోపాలను స్పష్టంగా బయటపెట్టింది. రాష్ట్ర విద్యుత్‌ రంగం తిరోగమనంలో ఉందనడానికి ఈ నివేదికలోని చాలా అంశాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2026–27లో చేయాల్సిన మార్పులపై ‘భవిష్యత్‌ వనరుల ప్రణాళిక’ ద్వారా ఏపీఈఆర్‌సీ సూచనలు చేసింది. 

ఇవీ ప్రధాన లోపాలు.. 
» విద్యుత్‌ వినియోగంలో తగ్గుదల, ప్రాజెక్టుల అమలులో ఆలస్యం, పెట్టుబడుల వినియోగంలో వైఫల్యం వంటి అంశాలు డిస్కంల వైఫల్యాలను ప్రతిబింబిస్తున్నాయి.  
»  ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ (సెకీ) నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను తీసుకోవడానికి చేసుకున్న ఒప్పందం ఇంకా పూర్తిస్థాయిలో అమలు కాలేదు. అలాగే, కడపలోని 750 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టు ఇంత వరకూ పూర్తి కాలేదు. 
»  రాష్ట్రంలో పరిశ్రమల విద్యుత్‌ వినియోగం గణనీయంగా పడిపోయింది. ముఖ్యంగా హెచ్‌టీ ఇండస్ట్రీ విభాగంలో ఏపీఎస్‌పీడీసీఎల్‌లో 17 శాతం, ఏపీఈపీడీసీఎల్‌లో 21 శాతం తగ్గుదల నమోదవ్వడం రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాల మందగమనానికి సంకేతం. పరిశ్రమలు మూతపడటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.  
» డిస్కంల పరిధిలో మొత్తం విద్యుత్‌ అమ్మకాలు కూడా తగ్గాయి. అంటే ఆ మేరకు విద్యుత్‌ వినియోగం తగ్గింది. ఏపీఈపీడీసీఎల్‌ పరిధిలో 9.82 శాతం వరకు విద్యుత్‌ వినియోగం తగ్గుదల నమోదవడం గమనార్హం. విశాఖపట్నం వంటి ఆర్థిక రాజధాని ఈ డిస్కం పరిధిలోనే ఉంది. అయినప్పటికీ ఇక్కడ విద్యుత్‌ అమ్మకాలు పడిపోవడం రాష్ట్ర అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది.  
» డిస్కంలు పునరుత్పాదక విద్యుత్‌ కొనుగోలు లక్ష్యాలను మించి సాధించినప్పటికీ, వినియోగ లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించలేకపోయాయి. ఆ లోటును రెన్యూవబుల్‌ ఎనర్జీ సర్టిఫికెట్ల (ఆర్‌ఈసీ) కొనుగోలుతో భర్తీ చేయడం వ్యవస్థలో లోపాలను సూచిస్తోంది. 
» ఆమోదించిన మూలధన వ్యయం ప్రణాళికల ప్రకారం డిస్కంలు ఖర్చు చేయడంలో విఫలమయ్యాయి. ఏపీఈపీడీసీఎల్‌లో రూ.3,293 కోట్లకు బదులు కేవలం రూ.1,058 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఏపీసీపీడీసీఎల్‌లో రూ.2813 కోట్లలో సగానికి తక్కువే వెచ్చించారు. 
» విద్యుత్‌ మిగులు, ఖర్చుల వివరాలు, ప్రాజెక్టుల పురోగతి వంటి అంశాల్లో డిస్కంలు పూర్తి పారదర్శకత పాటించడం లేదని వివిధ వర్గాల ప్రజలు ప్రజాభిప్రాయ సేకరణలో ఆరోపించారు. దీంతో భవిష్యత్‌లో ఖర్చుల వివరాలను మరింత స్పష్టంగా ఇవ్వాలని డిస్కంలను ఏపీఈఆర్‌సీ ఆదేశించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement