
సాక్షి, కృష్ణా జిల్లా: పెన్షన్ తొలగింపుతో తీవ్ర మనోవేదనకు గురైన ఓ దివ్యాంగురాలు.. గుండెపోటుతో మృతి చెందింది. మొవ్వ మండలం పెదపూడి సచివాలయం పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇటీవల పెన్షన్ల సర్వేలో దివ్యాంగురాలైన మేడం లక్ష్మి పెన్షన్‌ను తొలగించారు. పెన్షన్ తొలగించడంతో తీవ్ర మనోవేదనతో గత రాత్రి లక్ష్మికి గుండెపోటుకు గురైంంది.
పెదపూడి సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ మాట్లాడుతూ.. ‘‘మా సచివాలయ పరిధిలో 113 పెన్షనర్లు ఉన్నారు. వారందరి పెన్షన్లను రీ వెరిఫికేషన్‌కు పంపించాం. 8 పక్షవాతం వచ్చిన వారి పెన్షన్లు ఉన్నాయి. వాటిని 6 వేల రూపాయల పెన్షన్‌లోకి మార్చారు. 34 మంది పెన్షన్ దారులను రిజెక్ట్ చేశారు. లక్ష్మి ఇంటికి పెన్షన్ రిజెక్ట్ చేసిన లెటర్ ఇవ్వడానికి వెళ్లాను. పెన్షన్ రిజెక్షన్ లెటర్ ఇవ్వగానే కన్నీరు పెట్టుకున్నారు. నేను లక్ష్మి సోదరుడికి ఫోన్ చేసి విషయం తెలియజేశాను. ఉదయం లక్ష్మి చనిపోయారని తెలిసింది’’ అని ఆమె తెలిపారు.
డోన్ ప్రభుత్వ ఆసుపత్రి ముందు వికలాంగుల నిరసన
నంద్యాల జిల్లా: పెన్షన్ల తొలగింపుపై డోన్ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర వికలాంగులు ఆందోళన చేశారు. అంగ వైకల్య శాతం తక్కువగా ఉందని నోటీసులు అందడంతో పింఛన్ లబ్ధిదారులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. తమకు ఎటువంటి పరీక్షలు చేయకుండానే నోటీసులు ఇవ్వడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్య పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు.