AP: ఖర్చుకు వెనకాడొద్దు

Peddireddy Ramachandra Reddy Mandate For power companies - Sakshi

విద్యుత్‌ ప్రమాదాల నివారణకు పటిష్ట వ్యవస్థను రూపొందించండి

అభివృద్ధి చెందిన దేశాల్లోని విధానాలను అధ్యయనం చేయాలి 

సబ్‌స్టేషన్ల కమిటీలతో విద్యుత్‌ ప్రమాదాలపై అవగాహనా సదస్సులు నిర్వహించండి  

విద్యుత్‌ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లను తరచూ తనిఖీ చేయాలి 

విద్యుత్‌ సంస్థలకు మంత్రి పెద్దిరెడ్డి ఆదేశం

సాక్షి, అమరావతి: విద్యుత్‌ ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను రూపొందించాల్సిందిగా రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఇంధన శాఖ అధికారులతో ఆయన ఆదివారం టెలీకాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇటీవల అనంతపురం జిల్లాలో విద్యుత్‌ ప్రమాదం జరిగిన వెంటనే సీఎం వైఎస్‌ జగన్‌ తక్షణమే స్పందించి బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలను పరిహారంగా అందజేశారని, అయితే మున్ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారన్నారు.

విద్యుత్‌ సంస్థల బలోపేతానికి ఇప్పటికే రూ.40వేల కోట్లు ఇచ్చిన  ప్రభుత్వం ప్రజలకు విద్యుత్‌ భద్రత కల్పించే విషయంలో ఎంత వ్యయం చేసేందుకైనా వెనుకాడదని పెద్దిరెడ్డి స్పష్టంచేశారు.  అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యుత్‌ భద్రతకు అనుసరిస్తున్న సాంకేతిక పద్ధతులను అధ్యయనంచేసి తగిన  కార్యాచరణ రూపొందించాలని ఆయన సూచించారు.  

ప్రమాదాల నివారణకు సూచనలు.. 
ఇక విద్యుత్‌ ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన క  ల్పించేందుకు విద్యుత్‌ సబ్‌స్టేషన్ల కమిటీల సమావేశాలు నిర్వహించడంతోపాటు పత్రికలు, వివిధ  మీడియాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, పోస్టర్లు, కరపత్రాలు పంపిణీ వంటి చర్యలు చేపట్టాలన్నారు. అలాగే.. మంత్రి ఇంకా ఏం చెప్పారంటే.. 
► క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి ప్రజలను  విద్యుత్‌ ప్రమాదాల  నుంచి  కాపాడే వివిధ అంశాలపై శిక్షణనివ్వాలి. 
► విద్యుత్‌ ప్రమాదాలకు ఆస్కారం ఉన్నచోట్ల హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయాలి. ఆపరేషన్, మెయింటెనెన్స్‌ సిబ్బంది, కాంట్రాక్టు ఏజెన్సీలు వీటిని కచ్చితంగా పాటించాలి. 
► విద్యుత్‌ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు వంటి వాటిని క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. ఈ పనులు నిర్వహించే చోట ప్రమాదాల  నివారణకు లోకల్‌ ఎర్తింగ్‌ ఏర్పాటు చేయాలి. 
► హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్ల  సమీపంలో గృహాలు,  ఇతర నిర్మాణాలను చేపట్టకూడదు. 
► ఏడువేల మంది ఎనర్జీ అసిస్టెంట్లకు విద్యుత్‌ భద్రతా అంశాలపై శిక్షణనిచ్చి  వారి సేవలను వినియోగించుకోవాలి. 
► 1912 టోల్‌ ఫ్రీ నంబర్లపై అవగాహన కల్పించాలి.  ఫిర్యాదులను  డిస్కంలు  పరిష్కరించాలి. 
► ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ  బి. శ్రీధర్, డిస్కంల సీఎండీలు కె. సంతోషరావు, జె. పద్మ జనార్థనరెడ్డి, ఏపీఎస్‌ఈసీఎం సీఈఓ ఎ. చంద్రశేఖరరెడ్డి, వివిధ జిల్లాల నుంచి అధికారులు పాల్గొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top