గోబర్‌ గ్యాస్‌, సేంద్రియ ఎరువుల ఉత్పత్తికి ప్లాంట్ల ఏర్పాటు: పెద్దిరెడ్డి

  Peddireddy Ramachandra Reddy Attends Gobar Dhan Scheme Video Conference At Amravati - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాల్లో పశు, వ్యవసాయ వ్యర్థాల నుంచి సంప్రదాయేతర ఇంధన వనరులు, సేంద్రియ ఎరువుల ఉత్పత్తి కోసం కేంద్రప్రభుత్వం నిర్ధేశించిన గోబర్‌-ధన్ పథకంను పైలెట్ ప్రాజెక్ట్ గా నాలుగు జిల్లాల్లో అమలు చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో అగ్రో రిసోర్స్‌ (గోబర్) ధన్ పథకంపై కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ అధికారులతో కలిసి కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్  వివిధ రాష్ట్రాలకు చెందిన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రులతో వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు.

క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫెరెన్స్‌లో పాల్గొన్న మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో గోబర్ ధన్ పథకం కింద పశు వ్యర్థాలు, వ్యవసాయ వ్యర్థాలను కూడా సరైన పద్దతుల్లో వినియోగించుకునేందుకు ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం ఒక కార్యచరణను రూపొందించినట్లు వెల్లడించారు. కృష్ణ, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్ట్ గా ఈ పథకంను అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు.

గోబర్ ధన్ పథకం అమలులో భాగంగా రాష్ట్ర స్థాయిలో అపెక్స్, అడ్వయిజరీ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, జిల్లా స్థాయిలో కలెక్టర్ల నేతృత్వంలో వ్యవసాయ, పశుసంవర్థక, పాల ఉత్పత్తిదారుల సంఘాలు, స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యంతో ఈ పథకంను ముందుకు తీసుకువెళ్ళేందుకు కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కమిటీలను పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యుఎస్‌ విభాగాలు సమన్వయం చేస్తాయని వివరించారు. గోబర్‌ ధన్‌ కోసం ప్రతి జిల్లాకు రూ.50 లక్షలు కేటాయించినట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top