Counterfeit Banknote Racket: రూ. 40 వేల అసలు నోట్లకు రూ. లక్ష నకిలీ కరెన్సీ నోట్లు అమ్మకం.. పోలీసుల ఎంట్రీ!

Pedana Police Busts Fake Currency Printing Gang 8 Arrested - Sakshi

యూట్యూబ్‌లో చూసి ఇంట్లోనే ముద్రణ 

ప్రధాన సూత్రధారి ఇంటర్‌ చదివే విద్యార్థి, అతని తండ్రి 

మొత్తం ఎనిమిది మందిని మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు 

రూ. 4లక్షల నకిలీ కరెన్సీ.. రూ. 32,700 నగదు స్వాధీనం 

పెడన: ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో నకిలీ కరెన్సీ ముద్రించి.. వాటిని చెలామణి చేసేందుకు ప్రయత్నించిన ముఠాను పెడన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూ ట్యూబ్‌ ద్వారా నకిలీ కరెన్సీని ఎలా తయారు చేయాలి.. వాటిని ఎలా చెలామణి చేయాలి అనే అంశాలపై మూడు నెలలపాటు క్షుణ్ణంగా నేర్చుకుని.. పక్కాగా అమలు చేయాలనుకున్న వారికి పోలీసులు ఆదిలోనే చెక్‌ పెట్టారు. పెడన పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు మచిలీ పట్నం డీఎస్పీ షేక్‌ మసూంబాషా సోమవారం విలేకరులకు వెల్లడించారు. సూత్రధారితో పాటు కేసుతో సంబంధం ఉన్న మొత్తం ఎనిమిది మందిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. 

అసలు ఎలా తెలిసిందంటే.. 
పట్టణంలోని దక్షిణ తెలుగుపాలెంకు చెందిన ముచ్చు శివ తన తల్లి వైద్యఖర్చుల నిమిత్తం రామలక్ష్మీవీవర్స్‌కాలనీకి చెందిన వాసా వెంకటేశ్వరరావు దగ్గర అప్పుగా రూ.2వేలు తీసుకున్నాడు. వీటితో శివ స్థానికంగా మెడికల్‌ దుకాణంలో మందులు కొనుగోలు చేసేందుకు నగదు ఇచ్చాడు. మెడికల్‌ షాపులో ఉన్న వ్యక్తి ఆ నోట్లలో తేడాను గమనించి.. ఇవి దొంగనోట్లు అని చెప్పడంతో శివ తిరిగి వాసా వెంకటేశ్వరరావు వద్దకు వెళ్లాడు. వెంకటేశ్వరరావు అవి దొంగనోట్లు కాదని, తనకు వీరభద్రపురంలోని కాసా నాగరాజు, అతని కుమారుడు ఇచ్చారని చెప్పి వెళ్లిపోయాడు. అనుమానం వచ్చిన శివ పెడన పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

ఇంట్లోనే ముద్రణ.. 
దీంతో పోలీసులు తొలుత వెంకటేశ్వరరావును విచారించి, ఆపై కాసా నాగరాజు ఇంటికి వెళ్లి శనివారం అర్ధరాత్రి సోదాలు చేశారు. ఈ సోదాల్లో కలర్‌ జిరాక్స్‌ మిషన్‌తో పాటు ల్యాప్‌టాప్, కటింగ్‌ మిషన్, రూ.4లక్షలు విలువ గల నకిలీ కరెన్సీ నోట్లు, రూ.32,700 అసలు నగదు దొరికింది. దీంతో నాగరాజును పూర్తిస్థాయిలో విచారించగా.. అసలు విషయాలు బయటకొచ్చాయి. నాగరాజు, ఇంటర్‌ చదివే తన కుమారుడు ఇద్దరూ కలిసి ఇంట్లోనే నకిలీ నోట్లు ముద్రిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. యూట్యూబ్‌లో నకిలీ నోట్లకు సంబంధించిన వీడియో చూసి, మూడు నెలలుగా ముద్రణపై ప్రాక్టీస్‌ చేసినట్లు చెప్పాడు.  

చెలామణి చేసేందుకు మరికొందరు.. 
నకిలీ నోట్లు ఎవరెవరికి.. ఎంతెంత ఇచ్చిన దానిపై పోలీసులు విచారణ చేయగా రూ.40వేలు లేదా రూ.35వేలు అసలు నగదు తీసుకుని రూ.లక్ష నకిలీ కరెన్సీ నోట్లు ఇస్తున్నట్లు వారు వివరించారు. ఇలా నకిలీ కరెన్సీ నోట్లు తీసుకుని చెలామణి చేసేందుకు సిద్ధమైన వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బొప్పి సాయికుమార్, తాళ్ల నాగేశ్వరరావు, కాసా శివరాజు, వీణం వెంకన్న, వాసా రాజశేఖర్, బట్ట పైడేశ్వరరావు, సిద్ధాని పెద్దిరాజులు ద్వారా చెలామణి చేసేందుకు ప్రయత్నించారు. వీరందరినీ పోలీసులు అరెస్ట్‌ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఒక్క పెద్దిరాజులు మాత్రం పరారీలో ఉన్నాడు. నాగరాజు కుమారుడు మైనర్‌ కావడంతో మీడియా ముందు ప్రవేశపెట్టలేదు. కేసును త్వరితగతిన కొలిక్కి తీసుకువచ్చిన ఏఎస్‌ఐ టి. సురేష్‌కుమార్, పీసీలు జి. కోటేశ్వరరావు, కె. కృష్ణమూర్తిలతో పాటు ఎస్‌ఐ మురళీలను డీఎస్పీ షేక్‌ మసూంబాషా, సీఐ ఎన్‌ కొండయ్య ప్రత్యేకంగా అభినందించారు.  

చదవండి: సీఎం జగన్‌ ఎవరితో పోరాడాలి పవన్‌?: ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top