నా యాత్రను అడ్డుకున్నారంటే కూటమి ప్రభుత్వం నిందితుల పక్షాన ఉందని అర్థం
కర్నూలులో సుగాలి ప్రీతిబాయి తల్లి పార్వతీబాయి ఆవేదన
పోలీసులు అడ్డుకోవడంతో వీల్‌చైర్ యాత్రను విరమించుకున్న పార్వతీబాయి
కర్నూలు (సెంట్రల్): సుగాలి ప్రీతిబాయి తల్లి పార్వతీబాయి కర్నూలు నుంచి విజయవాడ వరకు తలపెట్టిన వీల్‌చైర్ యాత్రపై చంద్రబాబు కూటమి సర్కారు ఉక్కుపాదం మోపింది. యాత్ర ప్రారంభం కాగానే.. అనుమతుల్లేవంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఎంతో క్రూరంగా, కర్కశంగా వ్యవహరించిన పోలీసులు ఆమెను ఒక్క అంగుళం కూడా ముందుకు కదలనీయలేదు. తాను న్యాయం కోసం ఈ యాత్ర చేపట్టానంటూ కన్నీళ్లతో వేడుకున్నా పోలీసులు ససేమిరా అన్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె వీల్‌చైర్ యాత్రను విరమిస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు.
ఈ సందర్భంగా ఆమె కూటమి ప్రభుత్వం, పోలీసుల తీరుపై మండిపడ్డారు. తన కుమార్తె సుగాలి ప్రీతిపై అత్యాచారం చేసి హత్యచేసిన వారిని శిక్షించాలని కోరుతున్నా పట్టించుకోని ప్రభుత్వం.. తన యాత్రను ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు. నిందితులు విదేశాల్లో తిరిగేందుకు అనుమతించిన ప్రభుత్వం.. తాను న్యాయం కోసం వీల్‌చైర్ యాత్ర చేపడితే పోలీసుల సాయంతో ఎందుకు అడ్డుకుంటోందని నిలదీశారు. అవిటి మహిళను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించారు. రాజ్యాంగం ఆరి్టకల్ 19 ప్రకారం శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించుకునే హక్కును ప్రసాదించిందని, అయితే కూటమి ప్రభుత్వం మాత్రం క్రూరత్వంతో పౌరుల స్వేచ్ఛను హరిస్తోందని దుయ్యబట్టారు.
ఉదయం నుంచే కాపుకాసిన పోలీసులు
సుగాలి ప్రీతిబాయి 9వ వర్ధంతిని పురస్కరించుకుని కర్నూలు నుంచి విజయవాడలోని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఆఫీసు వరకు ఈ నెల 19న వీల్‌చైర్ యాత్ర చేపడతానని పార్వతీబాయి గతంలోనే ప్రకటించారు. ఆమె యాత్రకు అనుమతి లేదంటూ ఎస్పీ విక్రాంత్‌పాటిల్ మంగళవారం చెప్పారు. ఇందుకు సంబంధించిన నోటీసులను పోలీసులు ఆమె ఇంటికి అతికించారు. పార్వతీబాయి బుధవారం ఉ.8 గంటలకే సుంకేశుల రోడ్డులోని క్రిస్టియన్ శ్మశానవాటికలో ప్రీతిబాయి సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
అనంతరం మ«.ఒంటిగంట వరకు ప్రీతిభాయి సంస్మరణ సభను నిర్వహించి, వీల్‌చైర్ యాత్ర మొదలుపెట్టారు. ఉదయం నుంచే అక్కడ కాపేసిన పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. కుటుంబసభ్యులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నేతల ప్రోద్బలంతో దాదాపు 80 మీటర్ల వరకు వీల్‌చైర్ యాత్ర అతికష్టం మీద పోలీసుల తోపులాటల మధ్య కొనసాగింది. చివరికి పోలీసులు రోప్‌ల సాయంతో యాత్రను అడ్డుకున్నారు. తన కుమార్తెను హత్యచేసిన వారిని శిక్షించాలని తొమ్మిదేళ్లుగా కోరుతున్నానని, వీల్‌చైర్ యాత్ర చేసుకుంటానని ఆమె ఆవేదనతో అర్థించినా పోలీసులు ససేమిరా అన్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె యాత్రను విరమిస్తున్నట్లు ప్రకటించారు.
అప్పటి ప్రభుత్వం అడ్డుకుని ఉంటే లోకేశ్, పవన్ యాత్రలు చేసేవారా?
అనంతరం పార్వతీబాయి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం నిందితులను కాపాడటానికి ప్రయత్నిస్తోం దని, అందుకే తన యాత్రను అడ్డుకుందని విమర్శించారు. తన కుమార్తెపై అత్యాచారం చేసి హత్యచేసిన సమయంలో టీడీపీ ప్రభుత్వమే ఉందని చెప్పారు. తరువాత వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును పరిగణనలోకి తీసుకుని ఇల్లు, పొలం, ఉద్యోగం, డబ్బులు ఇచ్చి ఆదుకుందన్నారు. ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రీతిబాయికి న్యాయం చేసేందుకు తనపక్షాన ఉంటానని ప్రకటించారని గుర్తుచేశారు.
ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక 11 సార్లు కలవడానికి ప్రయత్నిస్తే అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని చెప్పారు. తన కుమార్తె కేసును ఆయన ఎన్నికల కోసమే వాడుకున్నారని అర్థమైందన్నారు. ఎన్నికలకు ముందు పవన్‌కళ్యాణ్, లోకేశ్ చేసిన వారాహి, యువగళం యాత్రలకు అప్పటి ప్రభుత్వం అనుమతిచ్చి రక్షణ కల్పించిందని గుర్తుచేశారు. అప్పటి ప్రభుత్వం అడ్డుకుని ఉంటే వారు యాత్రలు చేసేవారా.. అని ప్రశ్నించారు.
విజయకుమార్, రజని, పలువురు నేతల మద్దతు
సుగాలి పార్వతీబాయి వీల్‌చైర్ యాత్రకు లిబరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయకుమార్, జనసేన మాజీ నేత రజని, అనంతపురం, గుంటూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల నుంచి వచ్చిన పలు ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా విజయకుమార్ మాట్లాడుతూ పవన్‌కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక అసలు రంగు బయటపడిందని విమర్శించారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన పోరాటాలన్నీ స్వార్థం కోసమే చేశారని తేలిందని చెప్పారు. జనసేన మాజీ నేత రజని మాట్లాడుతూ కేవలం పవన్‌కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవడం కోసమే అప్పట్లో ప్రీతి కేసు గురించి మాట్లాడారని విమర్శించారు.
ఇవిగో ఆధారాలు
తమ కుమార్తెపై అత్యాచారం, హత్య జరిగినట్లు నిరూపించేందుకు అనేక ఆధారాలున్నాయని చెప్పారు. పోస్టుమార్టం ఎగ్జామినేషన్, పెథాలజీ, సైటాలజీ, సీడీఎఫ్‌డీ సెంట్రల్ ల్యాబ్ (హైదరాబాద్) రిపోర్టులు, కర్నూలు జిల్లా కలెక్టర్ నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ నివేదిక, ప్రిన్సిపల్ సెక్రటరీ మెడికల్ అండ్ హెల్త్ సిఫారసు మేరకు కలెక్టర్ నియమించిన త్రిసభ్య కమిటీ నివేదిక ఉన్నాయని తెలిపారు. వీటన్నింటితో నిందితులెవరో చెప్పవచ్చన్నారు. కేసును సీబీఐ విచారిస్తే పెద్ద తలకాయలు బయటకు వస్తాయని చెప్పారు. నిందితులు ఎవరో తేలేవరకు తన పోరాటం ఆగదని ఆమె స్పష్టం చేశారు.


