యువతి దారుణ హత్య.. కాళ్లు, చేతులు కట్టి చెరువులో పడేశారు! | Parvathipuram Tribal Girl Incident | Sakshi
Sakshi News home page

గిరిజన యువతి దారుణ హత్య.. కాళ్లు, చేతులు కట్టి చెరువులో పడేశారు!

Jun 11 2026 9:23 AM | Updated on Jun 11 2026 11:24 AM

Parvathipuram Tribal Girl Incident

    కాళ్లు.. చేతులు వెనక్కి విరిచికట్టి చెరువులో పడేసిన వైనం  

   గత ప్రభుత్వంలో వలంటీర్‌గా సేవలు 

   కూటమి సర్కారులో మహిళలకు రక్షణ కరువు 

   దోషులను కఠినంగా శిక్షించాలన్న విక్రాంత్, కళావతి  

ప్రశాంతతకు మారుపేరైన పాలకొండలో ఓ గిరిజన యువతి అనుమానాస్పద మృతి ఈ ప్రాంత వాసులను ఉలిక్కిపడేలా చేసింది. ఓ గిరిజన యువతిని అత్యంత కిరాతకంగా కాళ్లు, చేతులు వెనక్కి విరిచికట్టి చెరువులో పడేసిన ఘటన బుధవారం సాయంత్రం వెలుగు చూడటంతో సర్వత్రా భయాందోళనలు నెలకున్నాయి. ఇందుకు సంబంధించి పోలీసులు, స్థానికులు అందించిన వివరాలు.. పాలకొండ మండలం తుమరాడ వయా చింతాడ గ్రామం మధ్య గల చెరువులో యువతి మృతదేహం తేలుతున్నట్లు పోలీసులకు బుధవారం సమాచారం అందింది. 

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. కాళ్లు, చేతులు వెనక్కి విరిచికట్టి చెరువులో పడేసినట్లు గుర్తించారు. అప్పటికే మండల పరిధిలో బర్నసీతంపేట గ్రామానికి చెందిన బిడ్డిక ఉషారాణి (32) కనిపించటం లేదని ఆమె తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 6వ తేదీన ఇంటి నుంచి వెళ్లిన తమ కుమార్తె తిరిగి ఇంటికి చేరకపోవటంతో తల్లిదండ్రులు చిన్నారావు, కామమ్మ పోలీసులకు బుధవారం ఉదయం తెలియజేశారు. చెరువులో యువతి మృతదేహాం ఉండటంతో పోలీసులు చిన్నారావుకు సమాచారం అందించారు.

 దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం పూర్తిగా నీటిలో నాని రూపు కోల్పోవటంతో దుస్తుల ఆధారంగా మృతురాలు తమ కుమార్తె అని నిర్ధారించారు. ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడాలనే తపనతో బీఈడీ పూర్తి చేసిన కుమార్తె ఇలా ఘోరమైన స్థితిలో శవంగా మారటంతో మృతురాలి తల్లిదండ్రులు, అన్నదమ్ములు సతీష్ సురేష్, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఆస్పత్రికి తరలించారు. 

వలంటీరుగా సేవలు  
గత ప్రభుత్వంలో గ్రామ వలంటీర్‌గా సేవలు అందించి మంచి పేరు తెచ్చుకున్న ఉషారాణి ఇలా చెరువులో దారుణమైన స్థితిలో శవమై కనిపించటం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలె శ్రీకాకుళంలో బీఈడీ పూర్తి చేసిన ఉషారాణి ఈ నెల 6వ తేదీన చదువుకు సంబంధించి అప్లికేషన్‌ పెట్టేందుకు ఇంట్లో చెప్పి పాలకొండ వెళ్లాలని తండ్రి వద్ద రూ.500 తీసుకుని వెళ్లినట్లు బంధువులు చెబుతున్నారు. తిరిగి ఇంటికి రాకపోవటంతో స్నేహితులు, బంధువుల ఇళ్లకు వెళ్లి ఉంటుందని భావించామన్నారు. శనివారం రాత్రి నుంచి తన సెల్‌ కూడా అందుబాట్లోకి రాలేదన్నారు.

  ఘటనా స్థలానికి, మృతురాలి స్వగ్రామానికి దాదాపు 15 కిలోమీటర్లు దూరం ఉంటుంది.  ఉషారాణి మృతి తీరు అనుమానాలకు తావిస్తుంది. ఏం జరిగిందోగాని కాళ్లు చేతులు వెనక్కి విరిచి, తాళ్లతో కట్టి చెరువులోకి తోసేయటం వెనుక కారణాలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇది ఒక్కరి పనేనా.. లేక ఎంతమంది ఉన్నారు... ఈ ఘటనకు కారణమేమన్న కోణాల్లో దర్యాప్తు చేపడతామని ఎస్‌ఐ డోల వెంకన్న తెలిపారు.  

మహిళలకు రక్షణ కరువు  
 కూటమి అధికారం చేపట్టిన తరువాత మహిళలకు రక్షణకు కరువైందని మాజీ ఎమ్మెల్యే విశ్వాçసరాయి కళావతి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌  ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. రాష్ట్రంలో ప్రతి రోజు ఏదో ఒకచోట మహిళలపై అత్యాచారాలు, హత్యలు, లైంగిక వేధింపులు, దాడులు జరుగుతున్నాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గిరిజన యువతి అత్యంత దారుణంగా హత్యకు గురవడం అమానుషం అన్నారు. ఈ ప్రభుత్వం మహిళలపై దాడులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించకపోవటంతో ఈ తరహా ఘటనలు తరచూ జరుగుతున్నాయన్నారు. ఉషారాణిని హత్య చేసిన వారిని త్వరితగతిన గుర్తించాలన్నారు. వారిని కఠినంగా శిక్షించి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్సార్‌ సీపీ నాయకులతో పాటు గిరిజన సంఘాలు డిమాండ్‌ చేశాయి. భవిష్యత్‌లో ఈ తరహా ఘటనలు జరగకుండా చూడాలని కోరారు.

పాలకొండ రూరల్‌/పాలకొండ: 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement