పాలకొండ: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పాలకొండ కోటదుర్గమ్మకు ఆషాడమాస సారె కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. వేలాదిగా మహిళలు చీర, పసుపు, కుంకుమలతో ర్యాలీగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ మాట్లాడుతూ అమ్మవారికి ఆషాడ మాసంలో సారె పండగ నిర్వహించడం ద్వారా కరువు కాటకాల నుంచి ప్రజలను అమ్మవారు కాపాడుతుందన్నారు. అమ్మవారికి భక్తులు అందించిన కూరగాయలు, పండ్లుతో మంగళవారం నుంచి అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తామని తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి వీవీ సూర్యనారాయణ తెలిపారు.


