● పెదగుడబ గ్రామస్తుల ఆవేదన
పార్వతీపురం రూరల్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) అర్జీల వెల్లువతో హోరెత్తింది. ఓ వైపు కాలుష్య కోరల్లో చిక్కుకున్న జనం కన్నీటి పర్యంతమవగా.. మరోవైపు సాగునీరు లేక అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. జిల్లా నలుమూలల నుంచి పలు సమస్యలపై కలెక్టరెట్‌కు వచ్చిన బాధిత ప్రజలు తమ గోడును కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి, జిల్లా ఉన్నతాధికారులకు విన్నవించారు.
ఊరు విడిచి పొమ్మంటారా?
గరుగుబిల్లి మండలం పెదగుడబ సమీపంలో సాగుతున్న అక్రమ మైనింగ్‌తో బతకలేక పోతున్నామని గ్రామస్తులు కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కలెక్టర్ ఎదుట వాపోయారు. డీసీసీ అధ్యక్షుడు వంగల దాలినాయుడు ఆధ్వర్యంలో రైతులు వినతిపత్రం అందజేశారు. క్వారీలో రిగ్గుల పేలుళ్ల ధాటికి ఇళ్లు బీటలు వారుతున్నాయని, రాత్రింబవళ్లు భారీ వాహనాల రాకపోకలతో కంటిమీద కునుకు కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ధూళి కాలుష్యంతో ప్రాణాంతక రోగాల బారిన పడుతున్నామని, జంఝావతి కాలువను సైతం కబ్జా చేశారని ఆరోపించారు.
కన్నీరు పెట్టిస్తున్న కాలువలు..
తోటపల్లి ఎడమ ప్రధాన కాలువ కింద ఏడు, ఎనిమిదో బ్రాంచ్‌లకు సాగునీరందక వరి నారుమళ్లు ఎండల ధాటికి మాడిపోతున్నాయని పాలకొండ మండలం లంబూరు రైతులు ఆందోళన చేపట్టారు. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.అప్పలనాయుడు ఆధ్వర్యంలో కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. హుస్సేనున్‌పురం వద్ద నామమాత్రంగా నీరు వదిలి చేతులు దులుపుకుంటున్న అధికారులు..చివరి ఆయకట్టును గాలికొదిలేశారని మండిపడ్డారు. తక్షణం నీరు విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని ప్రాధేయపడ్డారు.
విద్యార్థులకు ‘బడి బస్సు’ వేయాలి
పార్వతీపురం నుంచి ఎమ్మార్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలకు ప్రత్యేక బడి బస్సు సౌకర్యం కల్పించాలని పీడీఎస్‌ఓ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు.


