ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ
● జిల్లాలో ప్రశ్నార్థకంగా 75 వేల ఓట్లు
● ప్రతిపక్ష ఓటర్లపై అధికార పార్టీ కత్తెర పెట్టిందన్న ఆరోపణలు
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై సందేహాలు రేకెత్తుతున్నాయి. దాదాపు 75 వేల వరకు ఓట్లు గల్లంతు కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ, ఇతర పార్టీలకు చెందిన వారి ఓట్లే ప్రమాదంలో పడ్డాయన్న వాదన వినిపిస్తోంది. అధికార పార్టీకి చెందిన నాయకులు..తమ పార్టీ కార్యక్రమంలా దగ్గరుండి, ఈ ప్రక్రియను వారి కనుసన్నల్లో నిర్వహించడం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. తమ పార్టీకి బలం ఉన్న గ్రామాలు, మండలాల్లోనే పెద్ద సంఖ్యలో ఓట్లను జాబితా నుంచి తొలగించారని వైఎస్సార్‌సీపీ నాయకులు చెబుతున్నారు. ఆచూకీ లేని ఓటర్లు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్లతో పాటు, అర్హులైన పలువురి ఓట్లు కూడా తొలగించే ప్రయత్నం సాగిందని ఆరోపిస్తున్నారు. ఎన్నికల సంఘం దీనిపై ప్రత్యేకంగా స్పందించి, ప్రతి అభ్యంతరాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. మృతి చెందినవారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారినవారు, ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన ఓట్లు, ఆచూకీ లేని నమోదులను మాత్రమే నిబంధనల ప్రకారం తొలగిస్తున్నామని అధికారులు తెలియజేస్తున్నారు. అర్హులైన ఓటర్ల హక్కులకు ఎలాంటి భంగమూ కలగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని చెబుతున్నారు.
‘సర్’ ముగిసే నాటికి ఆచూకీ లేని 75,112 ఫారాలు
సర్ ప్రక్రియ ఈ నెల 24వ తేదీతో ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 7,90,562 మంది ఓటర్లు ఉండగా.. అందులో 7,15,450 మంది ఓటర్ల ఎలక్ట్రోరల్ ఫారాలను (90.50 శాతం) డిజిటలైజ్ చేశారు. మిగిలిన 75,112 ఫారాలు (9.50 శాతం) మరణాలు, చిరునామా మార్పులు, ఇతర కారణాల వల్ల సేకరించడానికి వీల్లేనివిగా నమోదు చేశారు. ఇందులో 36,003 మంది ఓటర్లు మరణించినట్లు చెబుతున్నారు. 17,278 మంది శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లారని..11,279 మంది అందుబాటులో లేకపోవడం లేదా చిరునామా లభించకపోవడం వల్ల సేకరించలేకపోయారన్నది అధికారుల మాట. 10,462 మంది ఇప్పటికే ఓటరుగా(డబుల్) నమోదై ఉండగా.. మరో 90 మంది ఇతర కారణాల వల్ల ఈ జాబితాలో చేరారని అంటున్నారు.
అధికార పార్టీ కనుసన్నల్లోనే..
సర్ ప్రక్రియ మొత్తం అధికార పార్టీకి చెందిన వారి కనుసన్నల్లోనే జరిగింది. ఆ పార్టీకి చెందిన బీఎల్వోలు దగ్గరుండి మరీ..తమకు అనుకూలంగా లేని వారి ఓట్లు తొలగించారన్న విమర్శలు ఉన్నాయి. మిగతా పార్టీలు ఈ ప్రక్రియపై పెద్దగా దృష్టి సారించకపోవడం వారికి కలిసొచ్చింది. 2002 నాటి జాబితా ప్రకారం చిరునామాలు దొరక్కపోవడం కూడా సమస్యగా మారింది. కోడళ్ల ఓట్లు కూడా గల్లంతయ్యాయి. వైఎస్సార్‌సీపీకి బాగా పట్టు ఉన్న సాలూరు, కురుపాం నియోజక వర్గాల్లో ఎక్కువ ఓట్లు గల్లంతయ్యాయి. పార్వతీపురం, పాలకొండ నియోజక వర్గాల్లోనూ వేల ఓట్ల తొలగింపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 31వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించనున్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ అనంతరం జాబితాపై అభ్యంతరాలు తెలుపడానికి, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తులు సమర్పించడానికి జూలై 31 నుంచి ఆగస్టు వరకు అవకాశం కల్పించారు. అర్హులైన పౌరులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఓటరు జాబితాలో తమ వివరాలను సరిచూసుకోవాలి. ఓటు లేకుంటే అవసరమైన దరఖాస్తులు సమర్పించాలి. –డా.ఎన్.ప్రభాకర రెడ్డి, కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి


