పాలకొండ: మండలంలోని టీడీపారాపురం గ్రామంలో కర్నేన యోగిత పెరట్లో బ్రహ్మకమలం పూలు వికసించాయి. అరుదుగా కనిపించే ఈ పూల మొక్కలను కొంతకాలగా పెంచుతున్నామని యోగిత తెలిపారు. సాధారణంగా రాత్రి సమయంలో ఈ పూలు సాక్షాత్తు దేవుని రూపంగా భావిస్తారు. ఒకే సారి 9 పూలు పూయడంతో మహిళలు పసుపు, కుంకుమలతో పూజలు చేస్తున్నారు.
వాట్సాప్‌లో 1,000కి పైగా ప్రభుత్వ సేవలు
● కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి
పార్వతీపురం: ప్రజలకు ప్రభుత్వ సేవలను వేగంగా, పారదర్శకంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మన మిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్‌న సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర్ రెడ్డి కోరారు. వాట్సాప్ 9552300009 నంబర్‌కు సందేశం పంపడం ద్వారా రెవెన్యూ, విద్య, వ్యవసాయం, విద్యుత్, రవాణా, మున్సిపాలిటీ, పీజీఆర్‌ఎస్ తదితర శాఖలకు చెందిన 1,000కి పైగా సేవలను తెలుగు, ఆంగ్ల భాషల్లో 24 గంటల పాటు పొందవచ్చని తెలిపారు. దరఖాస్తుల స్థితి, ఫిర్యాదుల పురోగతి, ‘తల్లికి వందనం’, ‘అన్నదాత సుఖీభవ’ వంటి సంక్షేమ పథకాల స్టేటస్‌ను కూడా తెలుసుకోవచ్చన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 92,527 మందికి ఈ సేవలపై అవగాహన కల్పించినట్లు వెల్లడించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్. వైశాలి, డీఆర్వో కె. హేమలత, డీఆర్డీఏ పీడీ ప్రభావతి తదితర అధికారులు పాల్గొన్నారు.
రీ–సర్వే పనులు వేగవంతం చేయాలి
● జేసీ వైశాలి
పార్వతీపురం: జిల్లాలో భూముల రీ–సర్వే పనులను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్. వైశాలి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో పాలకొండ సబ్ కలెక్టర్, పార్వతీపురం ఆర్డీఓ, తహసీల్దార్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. రీ–సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా క్షేత్రస్థాయిలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని, రైతుల హక్కులకు భంగం కలగకుండా సర్వే నిర్వహించాలని సూచించారు. సమావేశంలో పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఆర్డీఓ కె. మాధురి, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
క్రీడలతో ఆరోగ్యం
పార్వతీపురం: ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో ఎదురయ్యే మానసిక ఒత్తిడిని అధిగమించి నిరంతరం ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు దోహదపడతాయని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పలు శాఖల అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉద్యోగులందరూ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనాలని, హెచ్‌ఓడీలు తమ సిబ్బందిని ముందుండి నడిపించాలని సూచించారు. వంద శాతం ఈ–ఆఫీస్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. ఉద్యోగుల కోసం ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
11 రోజులకు రూ.59,490 ఆదాయం
పాలకొండ: పట్టణంలో నిర్వహించిన జగన్నాథ స్వామి రథయాత్ర వేడుకకు ఆదాయం రూ.59,490 సమకూరినట్లు ఆలయ ఈఓ పరమేశ్వరి తెలిపారు. ఈ నెల 16 నుంచి 26 వరకు ఉత్సవాలు నిర్వహించినట్లు వివరించారు. ఈ సందర్భంగా స్వామి వారికి 11 రోజులపాటు భక్తులు అందించిన కానుకలను సోమవారం లెక్కించామని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు మఠం విశ్వనాథం దాస్, మఠం చక్రిదాస్, దేవాదాయ శాఖ సీఐ రామారావు, సిబ్బంది పాల్గొన్నారు.


