వందనం పేరుతో నిరాశ! | - | Sakshi
Sakshi News home page

వందనం పేరుతో నిరాశ!

Jul 28 2026 1:06 AM | Updated on Jul 28 2026 1:06 AM

వందనం పేరుతో నిరాశ! రూ.13 వేలుకు.. వచ్చింది రూ.3 వేలే.. ఇద్దరు పిల్లలకూ లేదు.. పాస్‌ పుస్తకాలు ఉన్నా.. యూరియా ఇవ్వరంట!

అర్హులకు అందని ‘తల్లికి వందనం’ పీజీఆర్‌ఎస్‌కు తరలివస్తున్న బాధితులు

సాక్షి, పార్వతీపురం మన్యం: అన్ని అర్హతలూ ఉన్నా.. తల్లికి వందనం పథకం అందకపోవడంతో జిల్లాలో వేలాది మంది తల్లులు తల్లడిల్లుతున్నారు. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉంటే.. ఎవరికీ అందకపోవడం, ఒకరికే అందడం.. రూ.13 వేలుకు రూ.3 వేలే జమ కావడం.. ఆదాయపు పన్ను చెల్లించిన ఇంకెవరిదో పేరు.. మ్యాపింగ్‌ సమయంలో కలిసి పోవడం.. ఇలా సమస్యలు కోకొల్లలుగా వస్తున్నాయి. బాధితులు పెద్ద ఎత్తున సోమవారం కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌కు తరలివచ్చారు. వీటితో పాటు.. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌ ప్రభాకరరెడ్డికి వినతి పత్రాలు అందజేశారు.

కురుపాం ప్రాంతానికి చెందిన లక్కోజు తన్మయి నాలుగో తరగతి చదువుతోంది. తల్లికి వందనం పథకం కింద గత ఏడాది రూ.13 వేలు తల్లి వాణి ఖాతాలో జమ కాగా.. ప్రస్తుత ఏడాది రూ.3 వేలు జమ అయింది. మరో పాఠశాల ఖాతాలో నిధులు జమ అయినట్లు చూపుతున్నారని.. అక్కడికి వెళ్లి అడిగితే, తమ పాఠశాలను ఎప్పుడో మూసి వేశామని అంటున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. పథకం నిధులు మొత్తం వచ్చేలా చూడాలని కోరుతున్నారు.

ఈ చిత్రంలోని మహిళ పేరు ఎస్‌.భవానీ. సాలూరు పట్టణం. ఈమెకు ఇంటర్‌, పదో తరగతి చదువుతున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ, రెండేళ్లుగా తల్లికి వందనం పథకం లబ్ధి కలగడం లేదు. వాస్తవంగా వినియోగించిన మొత్తం కంటే, కరెంట్‌ బిల్లు అధికంగా వస్తున్నట్లు చూపుతోంది. అందుకు తగిన ఆధారాలు కూడా ఆమె చూపించారు. దీనికితోడు ఈ ఏడాది ఆదాయపు పన్ను చెల్లిస్తున్న శీలా కుమారి అనే మహిళ వివరాలు మ్యాపింగ్‌ సమయంలో వీరి దాంట్లో కలిసిపోయింది. దీంతో పథకానికి అనర్హులుగా మిగిలిపోయారు. తప్పులు సరి చేసి, తమకు న్యాయం చేయాలని ఆ తల్లి కోరుతున్నారు.

కొమరాడ మండలం నయా కుంతేసు, మసిమండ, కూడేసు, చినకేర్జిల, వనకబడి తదితర గిరిజన ప్రాంతాల రైతులకు పట్టాలు, పాస్‌ పుస్తకాలు ఉన్నప్పటికీ ఎరువులు ఇవ్వడం లేదు. పోడు భూములు కావడం వల్ల ఆన్‌లైన్‌లో లేక, యూరియా అందడం లేదు. తమకు మాన్యువల్‌గా అయినా ఇప్పించాలని వారంతా కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement