
సాక్షి, వైఎస్సార్ కడప: ఆంధ్రప్రదేశ్‌లో గత మూడు రోజుల నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో రాయలసీమ అతలాకుతలమవుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు కట్టలు తెంచుకొని ప్రవహిస్తుండటంతో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలతో కడప జిల్లా పాపాగ్ని నది ఉధృతికి కమలాపురం వంతెన కుంగిపోయింది. వెలిగల్లు ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తడంతో నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలిపెడుతున్నారు. దీంతో రెండు రోజులుగా భారీగా వరద నీరు వంతెనపై అంచు వరకు ప్రవహిస్తోంది. వరద ధాటికి చీలిపోయిన బ్రిడ్జి క్రమ క్రమంగా కూలిపోయింది.
చదవండి: ‘ఐఎన్‌ఎస్ విశాఖపట్నం’ యుద్ధ నౌక జల ప్రవేశం
బ్రిడ్జి మధ్య భాగంలోని దాదాపు ఆరు స్లాబ్స్ చీలిపోయి లోపలికి కుంగిపోయాయి. దీంతో కమలాపురం- కడప మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కుంగిన బ్రిడ్జిమీదుగా వాహనాలు, పాదచారులు వెళ్లకుండా బ్యారికేడ్లు పెట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. నంతపురం నుంచి కడపకు వెళ్లే జాతీయ రహదారి కావడంతో కడప నుంచి తాడిపత్రి వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలను ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, మైదుకూరు మీదుగా దారి మళ్లిస్తున్నారు.
చదవండి: సీఎం చొరవతోనే మీరు ప్రాణాలతో బయటపడ్డారు
పాపాగ్ని నది బ్రిడ్జిని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పరిశీలించారు. కొత్త బ్రిడ్జి నిర్మాణానికి సీఎం అంగీకరించారని, సోమవారం నిపుణుల బృందం వస్తోందని పేర్కొన్నారు. త్వరితగతిన కొత్త బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. కడప- బళ్లారి రహదారి పునరుద్ధరణకు చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. పాగేరు వంకపై కొత్త బ్రిడ్జి నిర్మాణానికి కూడా సీఎం అంగీకరించారని తెలిపారు. పంట నష్టంపై నివేదిక ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించినట్లు చెప్పారు.