‘సేవ్‌ పునర్విక’ సక్సెస్‌ | One year old child treated with Rs 16 crore injection | Sakshi
Sakshi News home page

‘సేవ్‌ పునర్విక’ సక్సెస్‌

Apr 19 2026 5:43 AM | Updated on Apr 19 2026 5:43 AM

One year old child treated with Rs 16 crore injection

రూ.16 కోట్ల ఇంజెక్షన్‌తో ఏడాది చిన్నారికి చికిత్స 

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఆపన్నహస్తాలు

వెల్దుర్తి: కదలలేని స్థితిలో ఉన్న చిన్నారి పునర్వికను బతికించేందుకు ‘సేవ్‌ పునర్విక’ పేరుతో మానవతావాదులు చేసిన ప్రయత్నం ఫలించింది. శనివారం పునర్వికకు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని రెయిన్‌­బో ఆస్పత్రిలో డాక్టర్‌ రమేశ్‌ కోనంకి ఆధ్వర్యంలో యూఎస్‌ఏ నుంచి దిగుమతి చేసుకున్న రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ను విజయవంతంగా అందించారు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన మంగళి సురేశ్, పుష్పావతి దంపతుల కుమార్తె పునర్వికశ్రీ. 

సురేష్‌ బార్బర్‌ షాపు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతడి కుమార్తె పుట్టుకతోనే జన్యు సంబంధిత స్పైనల్‌ మస్క్యులర్‌ ఆట్రోఫీ టైప్‌–1 వ్యాధికి గురైంది. కదలలేని స్థితిలో ఉన్న చిన్నారికి రెండేళ్లలోపు రూ.16 కోట్ల విలువైన జోల్‌ జెన్‌స్మా ఇంజెక్షన్‌ ఇస్తే గాని సాధారణ స్థితికి చేరుకునే అవకాశం లేదని వైద్యులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్‌లో పునర్విక తండ్రి తన పాపను కాపాడమంటూ అభ్యర్థించాడు.  

‘సాక్షి’లో కథనం.. మానవతావాదుల స్పందన 
గత ఏడాది డిసెంబర్‌ 8న ‘పసిమొగ్గకు రూ.16 కోట్ల కష్టం’ శీర్షికన పునర్విక దయనీయ స్థితిని ‘సాక్షి’ పత్రిక వెలుగులోకి తెచ్చింది. నాటి నుంచి పత్రికలు, సోషల్‌ మీడియాలో ‘సేవ్‌ పునర్విక’ పేరుతో ఓ ఉద్యమమే నడిచింది. కేవలం మూడు నెలల్లోనే మానవతావాదుల నుంచి దాదాపు రూ.10 కోట్లు సమకూరాయి. ఈ దశలో ప్రభుత్వాలు స్పందించవా అన్న ప్రశ్నలతో సోషల్‌ మీడియా ఉక్కిరిబిక్కిరి చేసింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం ప్రకటించాయి. 

దిగుమతి సుంకం మినహాయించిన కేంద్రం 
క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా పోగైన రూ.10 కోట్లను మార్చి నెలాఖరున చిన్నారి తల్లిదండ్రులు రెయిన్‌బో ఆస్పత్రికి అందించారు. యూఎస్‌ఏ నుంచి తెప్పించాల్సిన రూ.16 కోట్ల ఇంజెక్షన్‌కు దాదాపు రూ.6 కోట్ల దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం మినహాయించింది. దీంతో రెండ్రోజుల క్రితం ఇంజెక్షన్‌ ఆస్పత్రికి చేరింది. శనివారం పునర్వికకు ఇంజెక్షన్‌ చేశారు. మరికొన్ని రోజులు చిన్నారికి చికిత్స కొనసాగనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement