కోవిడ్‌కు బహుదూరం.. బవురువాక 

Not Single Corona Positive Case Was Registered In Bavuruvaka Village - Sakshi

స్వీయ నియంత్రణతో కోవిడ్‌ నిబంధనలు పాటిస్తున్న గ్రామస్తులు

కీలకపాత్ర పోషిస్తున్న సచివాలయ సిబ్బంది, గ్రామ వలంటీర్లు

దీంతో ఒక్క పాజిటివ్‌ కేసూ నమోదు కాని వైనం

తూర్పుగోదావరి జిల్లా బవురువాక విజయగాథ 

ప్రత్తిపాడు రూరల్‌: పల్లె, పట్నం అనే తేడా లేకుండా అన్నిటినీ చుట్టేస్తున్న కోవిడ్‌ మహమ్మారి ఆ గ్రామంలోకి మాత్రం అడుగుపెట్టలేకపోయింది. కోవిడ్‌ రెండో వేవ్‌ ప్రారంభం నుంచే గ్రామస్తులు కట్టడి చర్యలు అమలు చేయడం.. స్వీయ నియంత్రణతో కోవిడ్‌ నిబంధనలు పాటించడం.. మరోవైపు సచివాలయ, ఆరోగ్య సిబ్బంది, గ్రామ వలంటీర్లు కీలక భూమిక పోషించడంతో ఆ గ్రామంలో ఇంతవరకు ఒక్క కోవిడ్‌ కేసు కూడా నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది.. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలోని బవురువాక.

గ్రామస్తులంతా ఒక్కతాటిపై నిలిచి.. 
బవురువాక గ్రామ పంచాయతీ పరిధిలో కొత్త బవురువాక, పాత బవురువాక, తాడువాయి, దోపర్తి గ్రామాలున్నాయి. 1,200 జనాభా ఉన్న ఈ గ్రామాల్లో గతేడాది కోవిడ్‌ మొదటి దశలో మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆ పరిస్థితి తిరిగి తలెత్తకూడదని రెండో దశ ప్రారంభంలోనే గ్రామ సర్పంచ్‌ దొడ్డి సత్తిబాబు ఆధ్వర్యంలో సచివాలయ, ఆరోగ్య సిబ్బంది, గ్రామ వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో అందరూ మాస్కు ధరించేలా, కోవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నారు. గ్రామంలో ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు మాత్రమే దుకాణాలకు అనుమతి ఇచ్చారు. అత్యవసరమైతే తప్ప ఊరు విడిచి బయటకు వెళ్లకుండా గ్రామస్తులు స్వీయ నియంత్రణ పాటించారు. ఫలితంగా బవురువాకలోకి కోవిడ్‌ అడుగు పెట్టలేక పోయింది. ఫీవర్‌ సర్వేలో భాగంగా గ్రామస్తులకు కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా ఒక్క కేçసూ లేకపోవడం వారి స్వీయ నియంత్రణకు అద్దం పడుతోంది.  

 అన్ని చర్యలూ తీసుకున్నాం.. 
కోవిడ్‌ రెండో దశలో ఈ మహమ్మారి కట్టడికి అన్ని చర్యలూ తీసుకున్నాం. గ్రామం విడిచి ఎవరూ బయటకు వెళ్లకుండా, ఇతర గ్రామాల నుంచి వచ్చేవారికి దూరంగా ఉండేలా చర్యలు చేపట్టాం. నిత్యం పారిశుధ్య పనులు చేయించడంతోపాటు వారానికోసారి సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ చేస్తున్నాం. 
– దొడ్డి సత్తిబాబు, సర్పంచ్, బవురువాక 

స్వీయ నియంత్రణ వల్లే.. 
ప్రారంభంలోనే సర్పంచ్, సచివాలయ సిబ్బందితో గ్రామంలో పర్యటించి కోవిడ్‌పై  అవగాహన కల్పించారు. గ్రామస్తులు స్వీయ నియంత్రణ పాటించడం వల్లే కోవిడ్‌ కేసులు నమోదు కాలేదు. 
– అడబాల కిరణ్, గ్రామ కార్యదర్శి, బవురువాక

చదవండి: మళ్లీ రహస్య ప్రాంతానికి ఆనందయ్య 
ముగ్గురు చిన్నారులకు ‘రూ.10 లక్షల’ పరిహారం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top