దారి ఘటనలో రాజకీయం లేదు

No Politics On Magistrage Brother Attack Case In Chittoor - Sakshi

బాధితుడు రామచంద్ర వాంగ్మూలం 

పండ్ల వ్యాపారి దారికి అడ్డు ఉన్నాడనే గొడవ 

డీఎస్పీ రవిమనోహరాచారి

మదనపల్లె టౌన్‌ : సస్పెన్షన్‌లో ఉన్న మేజిస్ట్రేట్‌ రామకృష్ణ తమ్ముడు రామచంద్ర(45)పై ఆదివారం సాయంత్రం బి.కొత్తకోటలో జరిగిన దాడిలో రాజకీయ నాయకుల ప్రమేయం లేదని డీఎస్పీ రవిమనోహరాచారి స్పష్టం చేశారు. ఆయన ఆదివారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. పీటీఎం మండలం నారాయణపల్లెకు చెందిన భాస్కర్‌రెడ్డి కుమారుడు ప్రతాప్‌రెడ్డి దగ్గర బంధువు ఈ నెల 16న సూరపువారిపల్లెలో మృతిచెందాడని తెలిపారు. అతని కర్మక్రియలకు ప్రతాప్‌రెడ్డి వెళ్లాడన్నారు.

తిరిగి వస్తుండగా స్నేహితుడు కుమార్‌రెడ్డి తనతోపాటు వస్తానని కోరాడని పేర్కొన్నారు. దీంతో ప్రతాప్‌రెడ్డి, కుమార్‌రెడ్డి, మరో ఇద్దరు కారులో సూరపువారిపల్లెకు బయలుదేరారన్నారు. వారు బి.కొత్తకోటకు చేరుకున్నారని పేర్కొన్నారు. అదే సమయంలో మేజిస్ట్రేట్‌ రామకృష్ణ తమ్ముడు రామచంద్ర బి.కొత్తకోట బస్టాండు వద్ద పండ్ల వ్యాపారి శ్రీనివాసులు వద్దకు వచ్చాడని తెలిపారు. తోపుడు బండి రోడ్డుకు అడ్డంగా ఉండడంతో దారి వదలాలని కారులో ఉన్న ప్రతాప్‌రెడ్డి కోరాడని వివరించారు.

ఈ క్రమంలో రామచంద్ర పండ్ల వ్యాపారికి వత్తాసు పలకడంతో గొడవ జరిగిందన్నారు. ఇందులో రామచంద్రకు గాయాలయ్యాయన్నారు. అప్పటికే టీవీల్లో మేజిస్ట్రేట్‌ తమ్ముడిపై రాజకీయ నాయకుల దాడి అంటూ అసత్య ప్రచారం జరిగిందని తెలిపారు. ఈ దాడిని రాజకీయ కోణంలో చూడకండని తెలిపారు. దాడిచేసిన ప్రతాప్‌రెడ్డి గతంలో టీడీపీ తరఫున ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీకి దిగిన శివమ్మ కొడుకుగా తేలిందన్నారు. (ఆమె తర్వాత నామినేషన్‌ ఉపసంహరించుకుంది.) దాడిపై బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేస్తామన్నారు. 

బాధితుని వాంగ్మూలం ఇదే.. 
సంఘటనలో బాధితుడు రామచంద్ర బి.కొత్తకోట ఎస్‌ఐ సునీల్‌ కుమార్‌కు వాంగ్మూలం ఇచ్చారు. తనపై జరిగిన దాడిలో రాజకీయ ప్రమేయం లేదన్నారు. నల్ల కారులో వచ్చిన వ్యక్తులు హైస్కూల్‌ సందులోకి వెళ్లేందుకు తోపుడు బండి తీయాలని వ్యాపారికి చెప్పారని తెలిపారు. తనకు పండ్లు విక్రయించి తీస్తానని వ్యాపారి శ్రీనివాసులు చెప్పాడన్నారు. ఆ వెంటనే కారులో నుంచి నలుగురు వ్యక్తులు దిగి పండ్ల వ్యాపారితో వాదించగా తాను కల్పించుకున్నాని పేర్కొన్నారు. దీంతో వారు రాడ్లతో ముక్కు, తలపై, భుజాలు, శరీరంపై కొట్టి గాయపరిచారని తెలిపారు. ఈ మేరకు బి.కొత్తకోట ఎస్‌ఐ సునీల్‌కుమార్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top