నిర్లక్ష్యపు డ్రైవింగే కొంప ముంచింది

Nine People Deceased In Bhakarapeta Bus Accident - Sakshi

భాకరాపేట బస్సు బోల్తా ఘటనలో తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య

స్విమ్స్, రుయా, బర్డ్‌ ఆస్పత్రుల్లో 43 మంది క్షతగాత్రులకు చికిత్స

మృతి చెందిన కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల సాయం

గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలన్న సీఎం 

క్షతగాత్రులకు మంత్రులు, ఎమ్మెల్యేల పరామర్శ

తిరుపతి రూరల్‌: చిత్తూరు జిల్లా మదనపల్లి–తిరుపతి జాతీయ రహదారిపై శనివారం రాత్రి భాకరాపేట ఘాట్‌లో పెళ్లి నిశ్చితార్థం కోసం వస్తున్న బస్సు లోయలో పడిన ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. 300 అడుగులకు పైగా ఉన్న లోయలో బస్సు ఐదు పల్టీలు కొట్టి, పెద్ద పెద్ద బండ రాళ్లను ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు తోడు అతి వేగం వల్లే బస్సు నియంత్రణ కోల్పోయి లోయలోకి దూసుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన డ్రైవర్‌ రసూల్‌బాషా (47), క్లీనర్‌ షకీల్‌ (25), మలిశెట్టి గణేష్‌ (40), మలిశెట్టి మురళి (45), మలిశెట్టి వెంగప్ప (60), లక్ష్మీకాంతమ్మ (40) ఘటన స్థలిలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన యశస్విని (8) ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయింది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ జర్నలిస్ట్‌ ఆదినారాయణరెడ్డి (45), నాగలక్ష్మి (60) ఆదివారం మృతి చెందారు. మరో 43 మంది క్షతగాత్రులకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఎముకలు విరిగిన 22 మందికి బర్డ్‌ ఆస్పత్రిలో, శస్త్రచికిత్సలు అవసరం అయిన 12 మంది స్విమ్స్‌లో, మరో 9 మందికి రుయాలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. 

ఆస్పత్రి వద్ద ఆర్తనాదాలు
బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 45 మందిని (మొత్తం 52 మంది) శనివారం అర్ధరాత్రి తిరుపతిలోని రుయా జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. కాలు విరిగి ఒకరు, ముఖంపై రాడ్‌లు గుచ్చుకుని రక్తం ధారలు కారుతూ మరొకరు, రెండు చేతులూ విరిగి, కాలు తెగి అల్లాడిపోతూ ఇంకొకరు.. బాధతో చేస్తున్న ఆర్తనాదాలు చూపరుల కంట నీరు తెప్పిస్తున్నాయి. చికిత్స పొందుతూ ఆదివారం వీరిలో ఇద్దరు మృతి చెందారు. పెళ్లికొడుకు వేణు తీవ్ర గాయాలతో తల్లిదండ్రులు, బంధువుల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకునేందుకు పడుతున్న ఆరాటం అయ్యో.. అనిపిస్తోంది. 

డిప్యూటీ సీఎం, మంత్రి, ఎమ్మెల్యేల పరామర్శ 
ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆదివారం డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రగిరి, ధర్మవరం ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డీఎంహెచ్‌ఓ శ్రీహరి, వైద్యాధికారులను ఆదేశించారు. క్షతగాత్రులతో నేరుగా మాట్లాడారు. వైద్యం అందుతున్న తీరుపై ఆరా తీశారు. ప్రమాద ఘటనపై  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. జిల్లా మంత్రులు, అధికారులతో మాట్లాడారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. గాయపడిన వారిలో అత్యధికులు చేనేత కుటుంబాలకు చెందిన వారని, వారికి అండగా ఉంటామని సీఎం ప్రకటించారని మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి తెలిపారు. మృతి చెందిన వారికి ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున ప్రభుత్వం సాయం అందించనున్నట్లు చెప్పారు. కాగా, గాయపడిన వారి అభ్యర్థన మేరకు మరింత ఆర్థిక సాయం కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లి ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తెలిపారు. మృతదేహాలకు తిరుపతి ఎస్వీ మెడికల్‌ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. 
రుయాలో క్షతగాత్రులను పరామర్శిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 

బస్సు కండిషన్‌ ఓకే.. అతివేగమే కారణం
భాకరాపేట ఘాట్‌ వద్ద లోయలో పడిన బస్సు ప్రమాదంపై లోతైన విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌ బసిరెడ్డి, తిరుపతి వెస్ట్‌ డీఎస్పీ నరసప్ప, ప్రాంతీయ రవాణా శాఖాధికారి సీతారామిరెడ్డి, ఆర్‌అండ్‌బీ (జాతీయ రహదారులు) డీఈ సత్యమూర్తి ఆధ్వర్యంలోని బృందం ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. బస్సు కండీషన్‌ బాగానే ఉందని, డ్రైవర్‌ నిర్లక్ష్యం, అతివేగం వల్ల స్టీరింగ్‌ కంట్రోల్‌ తప్పడంతో మలుపు వద్ద లోయలో పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని అధికారులు తెలిపారు. 

ధర్మవరం కన్నీటి సంద్రం
అంత్యక్రియలకు భారీగా తరలివచ్చిన జనం
ధర్మవరం టౌన్‌/అర్బన్‌ : చిత్తూరు జిల్లా భాకరాపేట వద్ద బస్సు బోల్తా ఘటనతో అనంతపురం జిల్లా ధర్మవరంలో తీవ్ర విషాదం నెలకొంది. పట్టణంలోని నేసే పేటకు చెందిన సిల్క్‌ హౌస్‌ యజమాని మలిశెట్టి మురళి, తమ్ముడు గణేష్‌ (పట్టు చీరల వ్యాపారి), మరో తమ్ముడు శివ భార్య కాంతమ్మ ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో పాటు మురళి కుమారుడు వేణు (పెళ్లి కొడుకు) గాయపడడంతో ఆ ఇంట తీవ్ర విషాదం అలముకుంది. మలిశెట్టి మురళి బంధువైన మలిశెట్టి వెంగప్ప (పెళ్లిళ్ల పేరయ్య), అతని భార్య నాగలక్ష్మి కూడా చనిపోయారు. మరో బంధువు జింకా చంద్ర కుమార్తె చందన (నాలుగవ తరగతి) మృతి చెందింది. పట్టణంలోని మారుతీనగర్‌లో నివసించే బస్సు డ్రైవర్‌ నబీరసూల్, శాంతినగర్‌లో ఉండే బస్సు క్లీనర్‌ షకీల్‌ (ఇంకా వివాహం కాలేదు) చనిపోయారు. ఇదే ప్రమాదంలో సీనియర్‌ జర్నలిస్టు ఆదినారాయణరెడ్డి సైతం మృత్యువాత పడ్డారు. ఈయన స్వగ్రామం బుక్కపట్నం మండలం మారాల. మలిశెట్టి మురళి స్నేహితుడు కావడంతో అతని కుమారుడి నిశ్చితార్థానికి వెళుతూ ప్రమాదంలో చనిపోయాడు. ఆదివారం వీరి మృతదేహాలు స్వస్థలాలకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారి అంత్యక్రియలకు జనం భారీగా తరలివచ్చారు.  

మృతుల కుటుంబాలకు ప్రధాని సానుభూతి
చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని భాకారాపేట వద్ద ప్రైవేట్‌ బస్సు బోల్తా పడిన ఘటనపై ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ.. ‘ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నారు. మృతుల బంధువులకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌) నుంచి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు అందజేస్తామని తెలిపారు.  

మెరుగైన వైద్యం అందించాలి : గవర్నర్‌
బస్సు ప్రమాదంపై రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని చిత్తూరు జిల్లా అధికార యాంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం రాజ్‌భవన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.   

బస్సు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి
తిరుపతి సమీపంలో ప్రైవేట్‌ బస్సు బోల్తా ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని, వారు కోలుకునేంతవరకూ అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను, సహాయక చర్యలను ఆదివారం ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీలు సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారని తెలిపారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారని చెప్పారు. తిరుపతిలోని స్విమ్స్, రుయా, బర్డ్‌ ఆస్పత్రుల్లో గాయపడ్డ వారికి చికిత్స అందిస్తున్నామన్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌లు ఈ ఘటనపై వేర్వేరు ప్రకటనల ద్వారా సానుభూతి తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని, బస్సులకు వేగ పరిమితి విధించాలని పవన్‌ కల్యాణ్‌ సూచించారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top