సాక్షి,తాడేపల్లి: డీఎస్సీ అభ్యర్థి, నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ దుర్గయ్య స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAAP) అధికారులకు సవాల్ విసిరారు. ‘నేను గోల్డ్ మెడల్ సాధించాను. ఎవరైనా వచ్చి నిరూపించమంటే నిరూపిస్తాను. నేను డీఎస్సీకి గోల్డ్ మెడల్ సర్టిఫికెట్లతో అప్లై చేశాను. కానీ ఎస్‌ఏఏపీ ఎండీ అబద్ధం చెబుతూ నేను సిల్వర్ మెడల్ పెట్టానని అన్నారు’ అని దుర్గయ్య మండిపడ్డారు.
డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌లో జరిగిన కుంభకోణంపై గురువారం వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో దుర్గయ్య కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. దుర్గయ్య నేషనల్ మెడలిస్ట్ (పక్కనే ఉన్నారు). డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో 1:1 రేషియోలో దుర్గయ్యకు కాల్ లెటర్ వచ్చింది. సర్టిఫికెట్లు సరిగా ఉన్నా ఉద్యోగం రాలేదు. స్పోర్ట్స్ కోటా అనేది పెద్ద స్కాం. స్పోర్ట్స్‌మెన్‌కు అన్యాయం చేశారు. చంద్రబాబు లోకేష్ కలిసి స్కీమ్‌ను స్కామ్ చేశారు..
చరిత్రలో లేని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాయనక్కర్లేదని జీవో ఇచ్చారు. జీవో నెంబర్ 74 చూస్తే స్పోర్ట్ కోటా పోస్టుల అంశం తెలుస్తుంది. స్పోర్ట్స్ కోటా వాళ్లు డీఎస్సీకి ఉత్తీర్ణత సాధించాల్సిందే. స్పోర్ట్స్ సర్టిఫికెట్ చూపించి సబ్జెక్ట్ టీచర్లుగా ఉద్యోగాలిచ్చేందుకు జీవోలు తెచ్చారు. కొన్ని పోస్టులకు డీఎస్సీ పరీక్ష లేదు. డిగ్రీ కూడా అక్కర్లేదట. ఉద్యోగం వచ్చిన ఐదేళ్లలో డిగ్రీ పాస్ కావొచ్చట. క్రీడాప్రతిభతో సంబంధం లేదు.. జస్ట్ ఆటలో పాల్గొంటే చాలట. నేషనల్ గోల్డ్‌మెడలిస్ట్ అయిన దుర్గయ్యకు ఉద్యోగం ఎందుకు రాలేదు. నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరిగింది’ అన్నారు.


