ఆరోగ్యశ్రీ పరిధిలోకి మిస్‌–సి

Multisystem Inflammatory Syndrome in Children into Aarogyasri Scheme - Sakshi

చిన్నారుల్లో వచ్చే ఈ వ్యాధి మొత్తం నాలుగు రకాలు

ఒక్కో రకాన్ని బట్టి రేట్లు నిర్ధారణ

గరిష్టంగా రూ.77,533లు.. కనిష్టంగా రూ.42,183లు

పేదలకు, మధ్యతరగతికి మేలుచేసేలా సర్కారు మరో నిర్ణయం

సాక్షి, అమరావతి: కరోనాతోపాటు బ్లాక్‌ ఫంగస్‌ వంటి రోగాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ కోవకే చెందిన మరో కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న పిల్లల్లో ఎదురవుతున్న మిస్‌–సి (మల్టీసిస్టం ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ ఇన్‌ చిల్డ్రన్‌) జబ్బును కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి పేదలకు మేలుచేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. పీడియాట్రిక్‌ కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సూచనల మేరకు పేదలు, మధ్యతరగతి వర్గాలపై భారం పడకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మిస్‌–సిలో నాలుగు రకాల జబ్బులుంటాయి. వీటన్నింటినీ ఇందులో చేర్చారు.

కేటగిరీలు.. వాటి రేట్లు ఇలా..
► మిస్‌–సి విత్‌ షాక్, లేదా విత్‌ఔట్‌ రెస్పిరేటరీ (సివియర్‌): రూ.77,533తో పాటు ఎన్‌ఐవీ/వెంటిలేటర్‌కు అదనంగా రూ.25వేలు. దీంతో పాటు ఇమ్యునోగ్లోబులిన్‌ మందులకు అదనంగా ఉంటుంది. ఐదు రోజులు ఐసీయూ, ఐదు రోజులు నాన్‌ ఐసీయూలో ఉండాలి.
► మిస్‌–సి విత్‌ఔట్‌ షాక్‌ (మోడరేట్‌) : దీనికి రూ.42,233లు (మందులతో కలిపి). ఐదు రోజులు ఐసీయూ, ఐదు రోజులు నాన్‌ ఐసీయూలో ఉండాలి.
► మిస్‌–సి కవాసాకి లేదా సివియర్‌ : రూ.62,533లు (మందులతో కలిపి). దీనికీ ఐదు రోజులు ఐసీయూలోనూ మరో ఐదు రోజులు నాన్‌ క్రిటికల్‌ వార్డులో ఉండాలి.
► ఫిబ్రిల్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ (మైల్డ్‌) : దీనికి రూ.42,183గా నిర్ణయించారు. ఒకరోజు ఐసీయూలో, ఏడు రోజులు నాన్‌ ఐసీయూలో ఉండాలి.

మందులు, వెంటిలేటర్‌ కోసం..
పైన పేర్కొన్నవి కాకుండా అదనంగా ఐవీ–ఐజీ డ్రగ్స్‌ అవసరమైతే ప్రతీ ఐదు గ్రాముల వయెల్‌కు రూ.8వేలు, 10 గ్రాముల వయెల్‌కు రూ.13,500 చెల్లిస్తారు. ఇది చిన్నారి శరీర బరువును బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వయెల్‌ ఫొటోలు, బిల్లులు, బ్యాచ్‌ నంబర్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, కేస్‌షీట్‌ను చూపించాల్సి ఉంటుంది.
ఎన్‌ఐవీ లేదా వెంటిలేటర్‌కు ఒక్కరోజుకు రూ.5వేల వరకూ క్లెయిమ్‌ చేసుకోవచ్చు. అలా గరిష్టంగా 5 రోజులకు రూ.25వేల వరకూ చెల్లిస్తారు. దీనికి కూడా వెంటిలేటర్‌ ద్వారా చికిత్స అందించినట్లు కేస్‌షీట్, ఫొటోలను ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు సమర్పించాల్సి ఉంటుంది. ఏవైనా అదనంగా శస్త్రచికిత్సలు చేసినప్పుడు ప్రత్యేక ప్రీ ఆథరైజేషన్‌ (ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో ఉన్న జబ్బుల పరిధిలోకి వచ్చేవి అయితే) చేసి పంపించాలి. ఉదా..  జనరల్‌ సర్జరీ, అపెండిసైటిస్, పీడియాట్రిక్‌ సర్జరీ వంటివి.

మిస్‌–సి లక్షణాలు ఇవే..
ఇది కోవిడ్‌ సమయంలో వచ్చే వ్యాధి. ఇది 18 ఏళ్ల లోపు వారికి ఎక్కువగా వస్తుంది. దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే..
► 24 గంటలపాటు లేదా అంతకంటే ఎక్కువ సమయం బాగా జ్వరం రావడం
► చిన్నారుల్లో వాంతుల లక్షణాలు ఎక్కువగా ఉండటం. వాంతులతో పాటు కొంతమందిలో విరేచనాలు రావడం
► విపరీతమైన కడుపునొప్పి
► చర్మం మీద దద్దుర్లు వంటివి రావడంతో పాటు అలసట ఉండటం
► సాధారణంగా కంటే శ్వాస ఎక్కువగా తీసుకోవడం.. లేదా ఒక్కోసారి అందుకు తీవ్ర ఇబ్బందులు తలెత్తడం
► కళ్లు ఎర్రగా మారి, తలనొప్పి ఉంటుంది
► పెదాలతో పాటు నాలుక కూడా ఎర్రగా మారి కొద్దిగా వాపు వస్తుంది. శరీరం, పెదాలు, గోళ్లు నీలిరంగులోకి మారొచ్చు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top