బాబోయ్‌.. పులి! | Sakshi
Sakshi News home page

బాబోయ్‌.. పులి!

Published Fri, May 5 2023 9:59 AM

Movement of two tigers In The Durgi Mandal Of Palnadu District - Sakshi

సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా నల్లమల అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న మండలాల్లో పులులు సంచరిస్తున్నాయని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దుర్గి మండలం గజాపురం అటవీ ప్రాంతంలో వారం కిందట ఓ ఆవును అడవి జంతువులు వేటాడి చంపాయి. ఆవుపై దాడి చేసిన విధానం, ఆ ప్రదేశంలో ఉన్న పాద ముద్రల ఆధారంగా రెండు పులులు దాడి చేసినట్టు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. పల్నాడు జిల్లా అడవులకు ఆనుకుని ఉన్న నల్లమల టైగర్‌ జోన్‌ నుంచి ఆ రెండు పులులు దారి తప్పి వచ్చాయని వారు అనుమానిస్తున్నారు. అప్పటి నుంచి ఆ ప్రాంత ప్రజల్లో గుబులు మొదలైంది. ఏ సమయంలో పులులు దాడులు చేస్తాయోనని ముఖ్యంగా పశువుల కాపరులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. సాయంత్రం అయితే ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు.

ఆహారం దొరక్క వచ్చాయా!?
శ్రీశైలం, నాగార్జున సాగర్‌ పరిసర ప్రాంతాల మధ్య ఉన్న నల్లమల అభయారణ్యంలో పులుల సంతతి గత రెండు మూడేళ్లుగా బాగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం వాటి సంఖ్య 73 దాకా ఉందని అటవీశాఖ అధికారిక లెక్కల ప్రకారం చెబుతున్నా.. అనధికారికంగా మరో పది పులులు ఉండొచ్చని భావిస్తున్నారు. టైగర్‌ జోన్‌లో ఆహారం లభించక వేట కోసమో, నీటి లభ్యత తగ్గడం వల్లనో పులులు పల్నాడు జిల్లా వైపు వచ్చి ఉంటాయంటున్నారు.

ఈ పులులు దుర్గి, కారంపూడి, బొల్లాపల్లి మండల పరిధిలోని నల్లమల అటవీ సమీప ప్రాంతాల్లో సంచరించే అవకాశం ఉందని, ఆ ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా, దారి తప్పి వచ్చిన రెండు పులులను తిరిగి అభయారణ్యంలోకి సురక్షితంగా పంపేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అటవీ, వేట నిరోధక దళాలు, వనమిత్రల సాయంతో పులుల జాడ తెలుసుకుని, వాటి మార్గాలను టైగర్‌ జోన్‌ వైపు మళ్లించే యత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. ముఖ్యంగా అభయారణ్యంలో నుంచి  నీటి కోసం పులులు వచ్చే అవకాశం ఉండటంతో మంచి నీటి కుంటలు ఏర్పాటు చేసి నీటిని నింపుతున్నారు. రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు పొలాల చుట్టూ వేసే విద్యుత్‌ కంచెల బారిన పడి మరణించకుండా ఉండేందుకు ఆయా ప్రాంతాల్లో రాత్రి పూట విద్యుత్‌ను నిలుపుదల చేయాలని విద్యుత్‌ శాఖను కోరారు. 

అప్రమత్తంగా ఉండండి..దుర్గి మండల పరిసరా­ల్లో రెండు పులులు సంచరిస్తున్నట్టు గుర్తించాం. ప్రస్తుతం పులులకు ఎ­టు­వంటి ఆపద రాకుండా సురక్షితంగా తిరిగి అభయారణ్యంలోకి పంపడం,  ప్రజలను అప్రమత్తం చేసి వాటికి దూరంగా ఉంచడం మా కర్తవ్యం. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు అటవీ సమీప ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే గుంపులుగానే వెళ్లాలి.  
– రామచంద్రరావు, పల్నాడు జిల్లా అటవీశాఖ అధికారి.

రెండు పులులను చూశా..  
నాలుగు రోజుల కింద­ట అర్ధరాత్రి పూట పొ­లానికి వచ్చిన సమ­యంలో రెండు పులు­లను చూశాను. ఒకటి పెద్దది, రెండోది చిన్నది. పొలంలోని గుంతల్లో నీటిని తాగి వెళ్లాయి. ఇటీవల మా పొలం సమీపంలోనే ఆవును చంపి లాక్కె­ళ్లాయి. రాత్రి పూట పొలానికి రావాలంటే భయంగా ఉంది.
– గోవింద, పులిని చూసిన ప్రత్యక్ష సాక్షి, గజాపురం, దుర్గి మండలం.

Advertisement
 
Advertisement