టీడీపీ ఎమ్మెల్యే గంటా చేరిక వార్తలపై స్పందించిన మంత్రి అమర్నాథ్‌

Minister Amarnath reacted on TDP MLA Ganta Srinivas Party change - Sakshi

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌ సీపీలోకి ఎవరైనా రావొచ్చని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సుపరిపాలన, పార్టీ సిద్ధాంతాలు నచ్చిన వారిని ఆహ్వానిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. అయితే పార్టీలో పదవులో, మరొకటో ఆశించి చేరవద్దని హితవు పలికారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు త్వరలో వైఎస్సార్‌ సీపీలో చేరబోతున్నారని వస్తున్న వార్తలపై మంత్రి స్పందించారు.

శనివారం జేడ్పీ సమావేశం ముగిశాక తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు. లోకేష్‌ పాదయాత్ర ఎందుకు చేయాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డిలు చేసిన పాదయాత్రలకు అర్థం ఉందన్నారు. అప్పట్లో రాష్ట్రంలో అవినీతి పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని, ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాలు తెలుసుకోవాలని వారు పాదయాత్ర చేశారని గుర్తు చేశారు.

జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్ల తర్వాత కూడా ప్రజాప్రతినిధులు గ్రామాలకు వెళ్లి తలెత్తుకు తిరుగుతున్నారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఎంతో సంతృప్తిగా ఉన్న ప్రజలు తమను సాదరంగా ఆహా్వనిస్తున్నారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పే ధైర్యం ఆ పార్టీ నాయకులకు లేదని విమర్శించారు.

లోకేష్‌ 4 వేల కిలోమీటర్లు కాదు.. 40 వేల కిలోమీటర్లు పాక్కుంటూ పాదయాత్ర చేసినా టీడీపీని అధికారంలోకి తీసుకురాలేరన్నారు. మూడు రాజధానులపై అసెంబ్లీలో మళ్లీ బిల్లు ప్రవేశపెడతామని, త్వరలోనే సీఎం వైఎస్‌ జగన్‌ విశాఖ నుంచి పరిపాలన సాగిస్తారని అమర్‌నాథ్‌ చెప్పారు.  
     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top