చురుగ్గా ‘వైద్య’ పోస్టుల భర్తీ

Medical Posts Recruitment Process Actively Going In AP - Sakshi

జిల్లా స్థాయిలో 4,300, రాష్ట్రస్థాయిలో 1,554 పోస్టులకు రిక్రూట్‌మెంట్‌

సాక్షి, అమరావతి: ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించేందుకు గాను వైద్య ఆరోగ్య శాఖలో మానవ వనరులను బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు దూసుకువెళ్తోంది. ఖాళీల భర్తీతో పాటు అవసరమైన కొత్త పోస్టుల మంజూరుకు సీఎం వైఎస్‌ జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో.. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో 5,854 పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే నోటిఫికేషన్‌లు ఇచ్చింది. ఇందులో 1,554 రాష్ట్ర స్థాయి రిక్రూట్‌మెంట్‌ పోస్టులుండగా.. 4,300 జిల్లా స్థాయి రిక్రూట్‌మెంట్‌ పోస్టులున్నాయి.

రాష్ట్రస్థాయికి సంబంధించి ప్రజా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం విభాగంలో 590 పోస్టులకు, వైద్య విద్యలో 68 పోస్టులకు, ఏపీ వైద్య విధానపరిషత్‌లో 896 పోస్టులకు దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 1,554 పోస్టులకు గాను 9,557 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇవి పరిశీలన దశలో ఉన్నాయి. ఈ నెలాఖరుకల్లా కొన్ని పోస్టులకు, వచ్చే నెలాఖరుకు మిగిలిన పోస్టులకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించి నియామకాలు చేపట్టనున్నారు. 

1,317 పోస్టులకు 21,176 దరఖాస్తులు..
ఇక జిల్లా స్థాయిలో ప్రజా ఆరోగ్య విభాగానికి సంబంధించిన 1,317 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వగా.. ఏకంగా 21,176 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెలాఖరుకల్లా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి నియామకాలు చేపట్టనున్నారు. వైద్య విద్య విభాగానికి సంబంధించి జిల్లా స్థాయిలో 2,010 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. వీటికి దరఖాస్తుల స్వీకరణ గడువు బుధవారంతో ముగిసింది.

వచ్చిన దరఖాస్తులను వచ్చే నెల 10 నాటికి పరిశీలించి.. నియామకాలు చేపడతారు. అలాగే ఏపీ వైద్య విధాన పరిషత్‌కు సంబంధించి జిల్లా స్థాయిలో 973 పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యింది. వచ్చిన దరఖాస్తులను వచ్చే నెల 14 నాటికి పరిశీలించి.. నియామకాలు పూర్తి చేయనున్నారు. సీఎం ఆదేశాల మేరకు గతంలోనే ఆరోగ్య శాఖలో 9,700 పోస్టులను భర్తీ చేశారు. వీటికి అదనంగా ఇప్పుడు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ జరుగుతోంది.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top