నిచ్చెనలాగి.. కూలీలతో కలిసి విత్తనాలు నాటిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే

మంగళగిరి (గుంటూరు): ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) వ్యవసాయ సీజన్ వస్తే రైతుగా పొలంలో పనులు చేస్తుంటారు. ఎమ్మెల్యే ఆర్కేకు వ్యవసాయం అంటే ఎంతో మక్కువ. రాజకీయాలలో, ప్రజాసేవలో నియోజకవర్గ అభివృద్ధిలో ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూనే తనకెంతో మక్కువైన వ్యవసాయ పనులను రాజీపడకుండా చేస్తుంటారు.
అందులో భాగంగా గురువారం ఫిరంగిపురం మండలం వేమవరం గ్రామంలోని తన పొలంలో కూలీలతో కలిసి వ్యవసాయ పనులు చేశారు. కలుపు ఏరి పొలంలో నాట్లు వేయడానికి మెరకపల్లాలను చదును చేయడానికి నిచ్చెనలాగారు. అనంతరం నారుమడికి విత్తనాలు చల్లి, కంది నాటారు. వ్యవసాయ కూలీలతో కలిసి పొలంలోనే వారితోపాటు భోజనం చేసి వ్యవసాయ పనులలో నిమగ్నమయ్యారు.