దండిగా దిగుబడులు
అరకొరగా ప్రభుత్వ మద్దతు ధర
కానరాని కొనుగోలు కేంద్రాలు
దోచుకుంటున్న దళారులు
నిరాశ చెందుతున్న రైతులు
పెరవలి: ప్రకృతి కరుణించినా.. ప్రభుత్వం వరమివ్వనంటోంది. దిగుబడి ఆశాజనకంగా ఉన్నా.. సర్కారు వారి ‘మద్దతు’ కరవవుతోంది. ఫలితంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి.. ఆరుగాలం కష్టపడిన మొక్కజొన్న రైతులు దిక్కు తోచని స్థితిని ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వ మద్దతు కరవు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం క్వింటాల్ మొక్కజొన్నకు రూ.2,600 వరకూ మద్దతు ధర చెల్లించింది. వాస్తవానికి గత ప్రభుత్వం ప్రతి ఏడాదీ మద్దతు ధరను పెంచుతూ వచ్చింది. దీంతో, ఈ పంట సాగు చేసిన రైతులు నష్టపోవడమనే ప్రశ్నే ఉండేది కాదు. ఎక్కడైనా ఒక ఏడాదికి మరో ఏడాదికి వివిధ పంటల మద్దతు ధరలను ప్రభుత్వాలు పెంచడం సర్వసాధారణం. కానీ, చంద్రబాబు ప్రభుత్వం దీనికి విరుద్ధంగా వ్యవహరించి, మొక్కజొన్న మద్దతు ధరను ఉంటే రూ.2,400కు తగ్గించేసింది. ఫలితంగా రైతులు క్వింటాల్‌కు రూ.200 నష్టపోతున్నారు. పైగా, ప్రభుత్వం ఎక్కడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు.
దీంతో, రైతులు ప్రభుత్వ మద్దతు ధర పొందలేని దుస్థితిని ఎదుర్కొంటున్నారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు దళారులకే పంటను అమ్ముకుంటున్నారు. ఇదే అదనుగా రైతులను వారు నిలువునా దోచుకుంటున్నారు. మద్దతు ధర రూ.2,400 కాగా, దళారులు మాత్రం నాణ్యతను బట్టి రూ.1,600 నుంచి రూ.1,800 మాత్రమే చెల్లిస్తున్నారు. అది కూడా సరకు తీసుకెళ్తే నెమ్ము ఉందంటూ ధరలో కోత పెడుతున్నారు. ఎకరం విస్తీర్ణంలో మొక్కజొన్న సాగుకు రూ.45 వేలు ఖర్చవుతోంది. ఎకరం తోటలో 35 నుంచి 40 క్వింటాళ్ల వరకూ దిగుబడి వస్తోంది.
మద్దతు ధర ప్రకారం చూస్తేనే ఖర్చులు, పెట్టుబడి పోను ఎకరానికి తమకు దక్కుతున్నది అంతంత మాత్రంగానే ఉంటోందని రైతులు వాపోతున్నారు. అటువంటిది దళారులకు అమ్ముకోవాల్సి రావడంతో మరింతగా నష్టపోతున్నామని గగ్గోలు పెడుతున్నారు. గతంలో తోటల వద్దకే వచ్చి వ్యాపారులు కొనుగోలు చేసేవారని, ఇప్పుడు సరకు ఎక్కువవడంతో చేర ఇవ్వబోమంటున్నారని, దీంతో అదనపు ఖర్చు అవుతోందని వాపోతున్నారు.
16,713 ఎకరాల్లో సాగు
ఐదేళ్ల కిందట తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కేవలం 6 వేల ఎకరాల్లో.. అదీ లంక భూముల్లో మాత్రమే రైతులు మొక్కజొన్న సాగు చేసేవారు. అటువంటిది గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మంచి గిట్టుబాటు ధర ఇచ్చి ప్రోత్సహించడంతో లాభాలు కళ్లజూసిన రైతులు సాధారణ పంట పొలాల్లో కూడా ఈ పంట సాగు ఆరంభించారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 10,400 మంది రైతులు 16,713 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. రాజమహేంద్రవరం అర్బన్ మినహా దాదాపు ప్రతి మండలంలోనూ ఈ పంటను రైతులు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది పంటపై తెగుళ్లు పెద్దగా లేవు. వాతావరణం కూడా అనుకూలించింది. దీంతో, ఎన్నడూ లేని విధంగా దిగుబడి దండిగా వచ్చింది.
మిగులుతున్నది తక్కువే..
వాతావరణం అనుకూలించడంతో ఈ ఏడాది మొక్కజొన్న దిగుబడి బాగుంది. ఎకరానికి 35 నుంచి 40 క్వింటాళ్ల వరకూ దిగుబడి వచ్చింది. కానీ, గిట్టుబాటు ధర లేకపోవడంతో ఖర్చులు పోను కేవలం రూ.18 వేలు మాత్రమే మిగులుతోంది. – మిద్దే వీరాంజనేయులు, రైతు, కానూరు అగ్రహారం, పెరవలి మండలం
ఖర్చు ఎక్కువ.. లాభం తక్కువ
పంట బాగానే పండింది. కానీ, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కంటే ప్రస్తుత ప్రభుత్వం గిట్టుబాటు ధరను రూ.200 తగ్గించింది. సరకు కొనుగోలుకు ఎవ్వరూ రావడం లేదు. చేర ఇస్తున్నాం. దీని వలన అదనపు ఖర్చు అవుతోంది. లాభం తగ్గుతోంది. – జన్ని వెంకటేశ్వర్లు, రైతు, కానూరు.


