నేడు దేశవ్యాప్తంగా నీట్ యూజీ పరీక్ష
రాష్ట్రంలో 185 పరీక్ష కేంద్రాలు.. హాజరుకానున్న 65 వేల మంది
మే 3న జరిగిన నీట్ ప్రశ్నాపత్రం లీక్ కావడంతో సర్వత్రా ఉత్కంఠ
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర యూజీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ యూజీ)–2026 పునఃపరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేస్తారు. ఈ గడువుకు నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. కాగా, మే 3న నిర్వహించిన నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిన నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో పునఃపరీక్ష నిర్వహణ పట్ల తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సారైనా పరీక్షను సక్రమంగా నిర్వహిస్తారా? లేదా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉత్పన్నమవుతోంది.
కట్టుదిట్టమైన ఏర్పాట్లు
పెన్ను, పేపర్(ఆఫ్‌లైన్) విధానంలో దేశవ్యాప్తంగా 551, విదేశాల్లోని 14 నగరాల్లో నీట్ పునఃపరీక్షను నిర్వహిస్తున్నామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వెల్లడించింది. జాతీయ స్థాయిలో 22.79 లక్షల మంది విద్యార్థులు నీట్ రాయనున్నారు. మన రాష్ట్రంలోని 27 నగరాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసిన 185 కేంద్రాల్లో 65,790 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 1,500 మంది కేంద్ర, రాష్ట్ర పోలీస్ బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేశారు. శనివారం ఈ కేంద్రాలన్నింటిలో నీట్ మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. ఆదివారం ప్రశ్నాపత్రాలను పోలీస్ భద్రతతో కేంద్రాలకు తరలించనున్నారు. అదే విధంగా పరీక్ష కేంద్రాల వద్ద నిషే«ధాజ్ఙలు అమలు చేయనున్నారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తారు.
దివ్యాంగ విద్యార్థులకే అదనపు సమయం
అదనపు సమయం దివ్యాంగ విద్యార్థులకేనని శనివారం ఎన్టీఏ ప్రకటించింది. దివ్యాంగ విద్యార్థులు సాయంత్రం 6.20 గంటల వరకూ పరీక్ష రాసుకునే అవకాశాన్ని ఎన్టీఏ కల్పించింది. అయితే ఈ అదనపు సమయం కేటాయింపుపై విద్యార్థుల్లో గందరగోళం నెలకొందని, ఆ విషయంపై ఎన్టీఏ మరోమారు స్పష్టతనిచ్చింది. కొందరు సాధారణ విద్యార్థుల అడ్మిట్ కార్డుల్లో అదనపు సమయం కాలమ్ దగ్గర ‘వై’ అని ముద్రించి ఉండటంతో గందరగోళం నెలకొందని, ఆ కాలమ్ దగ్గర ‘వైఈఎస్’ అని ముద్రించిన దివ్యాంగ విద్యార్థులకు మాత్రమే అదనపు సమయం కేటాయింపు ఉంటుందని వెల్లడించింది. శనివారం రాత్రి ఏడు గంటల వరకూ కూడా కొందరు అభ్యర్థులు అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోలేదని, వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా వాట్సాప్‌కు అడ్మిట్ కార్డులు పంపామని ఎన్టీఏ తెలిపింది.
‘నీట్’కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయండి: సీఎస్
రాష్ట్రంలో ఆదివారం నిర్వహించనున్న నీట్ యూజీ–2026 రీ ఎగ్జామ్‌కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఆదేశించారు. సీఎస్ తన క్యాంపు కార్యాలయం నుంచి శనివారం నీట్ పరీక్ష ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరీక్ష నిర్వహణను పర్యవేక్షించాలని చెప్పారు. దివ్యాంగ విద్యార్థులకు పరీక్ష రాసేందుకు అదనంగా గంట సమయం ఉంటుందని, ఈ విషయాన్ని అధికారులు పరిగణనలోకి తీసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని ఫొటోస్టాట్ షాపులు, సైబర్ కేఫ్‌లు, కోచింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని, నిషేధ ఆజ్ఞలను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. సోషల్ మీడియాలో పేపర్ లీకేజీ వంటి వదంతులు సృష్టించేవారిపై నిఘా ఉంచి సకాలంలో తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
నిబంధనలు ఇవే..
డ్రెస్ కోడ్: విద్యార్థులు తేలికపాటి దుస్తులు ధరలించాలి. పూర్తి చేతులు(ఫుల్ స్లీవ్స్) చొక్కాలు, ఉన్ని దుస్తులు ధరించే విద్యార్థులు తనిఖీల కోసం పరీక్ష కేంద్రానికి నిర్ణీత సమయానికన్నా ముందే చేరుకోవాలి. సంప్రదాయ, మతపరమైన విశ్వాసాలకు సంబంధించిన వస్తువులను ధరించేవారు క్షుణ్ణంగా తనిఖీలు చేయడానికి వీలుగా కేంద్రంలో చాలా ముందుగానే రిపోర్ట్ చేయాలి. కేవలం స్లిప్పర్స్, ఎత్తు తక్కువ ఉన్న చెప్పులు మాత్రమే ధరించాలి.
పరీక్ష కేంద్రంలోకి అనుమతించేవి: అడ్మిట్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు (ఆధార్, పాన్, వంటి ధ్రువీకరణపత్రాలు), ట్రాన్స్‌పరెంట్ వాటర్ బాటిల్ మాత్రమే అనుమతిస్తారు.
నిషేధిత వస్తువులు: మొబైల్ ఫోన్‌లు, స్మార్ట్ వాచీలు, ఎల్రక్టానిక్ పరికరాలు, క్యాలిక్యులేటర్లు, ఇతర కాగితాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు.


