దుబాయ్ సంస్థ ఎస్‌ఏఎఫ్ అనుబంధ కంపెనీకి 45 ఎకరాల మారిటైమ్ భూములు
రూ.వందల కోట్ల విలువైన భూములు 30 ఏళ్ల దీర్ఘకాలిక లీజుకు
గతేడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలోని కీలక మంత్రి దుబాయ్ పర్యటన
ఫిబ్రవరిలో ఢిల్లీ కేంద్రంగా ఎస్‌ఏఎఫ్ వన్ ఇండియా కంపెనీ ఏర్పాటు
వెంటనే ఏప్రిల్‌లో మారిటైమ్ భూముల సంతర్పణకు మార్గదర్శకాలు
45 ఎకరాలు కేటాయిస్తూ చంద్రబాబు సర్కారు శనివారం ఉత్తర్వులు
రూ.లక్ష మూల ధనంతో రూ.1,835 కోట్ల పెట్టుబడికి ప్రతిపాదనలు
విమాన ఇంధన తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడి
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో ముఖ్యులు కోరుకుంటే అత్యంత విలువైన భూములు ఎంత వేగంగా పరుల పరమవుతాయో చెప్పడానికి తాజా ఉదాహరణ ఇది. రాష్ట్రంలోని ఓ కీలక మంత్రి దుబాయ్ వెళ్లడం, ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో అక్కడి ఓ కంపెనీకి చెందిన ఇద్దరు డైరెక్టర్లుగా కేవలం లక్ష రూపాయల మూలధనంతో ఢిల్లీలో ఓ కంపెనీ అవతరించడం, వారు ఏప్రిల్‌లో వందల కోట్ల విలువైన కాకినాడలోని మారిటైమ్ బోర్డు భూములను కోరడం, రెండు నెలల్లోనే ఆ భూములను వారి పరం చేయడం.. అంతా శరవేగంగా జరిగిపోయాయి.
కాకినాడ వద్ద ప్రత్యేకంగా గుర్తించిన 45 ఎకరాల మారిటైమ్ బోర్డ్ భూమిని దుబాయ్‌కు చెందిన ఎస్‌ఏఎఫ్ అనుబంధ కంపెనీ సేఫ్ వన్ ఇండియా ఎస్పీ కాంపాక్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 30 ఏళ్ల దీర్ఘకాలిక లీజుకు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.1,835 కోట్లతో సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ప్రొడక్షన్ ఫెసిలిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. భూమి కేటాయించిన 15 నెలల్లో పనులు ప్రారంభించాలన్న షరతు విధించారు.
లక్ష రూపాయలతో కంపెనీ ఏర్పాటు
గతేడాది ఫిబ్రవరి నెలలో వ్యక్తిగత పర్యటన పేరుతో రాష్ట్రానికి చెందిన ఒక కీలక మంత్రి దుబాయ్ వెళ్లడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశం కావడం అందరికీ తెలిసిందే. అప్పటి దుబాయ్ పర్యటన ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. తీర ప్రాంతంలో వందల కోట్ల విలువైన మారిటైమ్ భూములను కొట్టేయడానికి ఈ పర్యటనలో, ఆ తర్వాత పెద్ద పథకమే వేసినట్లు అధికారవర్గాల కథనం. ఈ పథకంలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఢిల్లీ కేంద్రంగా కేవలం లక్ష రూపాయల మూలధనంతో ఇద్దరు డైరెక్టర్లతో సేఫ్ వన్ ఇండియా ఎస్పీ కాంపాక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట కంపెనీ ఏర్పాటు చేశారు.
ఈ కంపెనీ డైరెక్టర్లుగా వీణా దీపక్ మున్‌గన్‌హల్లి, అమేయా యశ్వంత్ జోషి వ్యవహరిస్తున్నారు. ఇందులో వీణా దీపక్‌కు ఏవియేషన్ ఫ్యూయల్ వ్యాపారంలో ఎటువంటి అనుభవం లేదు. ఆమె ఇప్పటి వరకు వివిధ బ్రాండ్ నేమ్స్‌తో సెలూన్స్, స్పా, ఫ్యాషన్ బిజినెస్ చేస్తున్నారు. వీళ్లు లక్ష రూపాయల మూలధనంతో ఏకంగా రూ.1,835 కోట్ల విలువైన పెట్టుబడులు పెడతామంటూ రాష్ట్రానికి ప్రతిపాదన పంపగానే ఫైళ్లు వేగంగా కదిలాయి. ముందుగా భూ కేటాయింపులకు అడ్డంకిగా ఉన్న ఏపీ మారిటైమ్ బోర్డు ల్యాండ్ అలాట్‌మెంట్ గైడ్‌లైన్స్ – 2026ను సవరించారు.
ఫిబ్రవరిలో కంపెనీ ఏర్పాటు కాగానే ఏప్రిల్‌లో కేటాయింపు నిబంధనలు సవరిస్తూ ఉత్తర్వులు రావడం.., శనివారం భూ కేటాయింపులు చేయడం జరిగిపోయాయి. సెలూన్స్, స్పా వ్యాపారంలో అనుభవం ఉన్న వాళ్లు ఏవియేషన్ ఇంధన తయారీ యూనిట్ ఏర్పాటంటూ ముందుకు రావడం.., ప్రభుత్వం వేగంగా స్పందించి భూములు ఇచ్చేయడం.. ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల స్కెచ్ ప్రకారమే జరిగాయని కీలక అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.


