ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వైఎస్సార్‌

Kottu Satyanarayana comments on YSR - Sakshi

ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ

వేంపల్లె/ఇడుపులపాయ/ఒంటిమిట్ట: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుడు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ప్రశంసించారు. శనివారం ఆయన వైఎస్సార్‌ జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయకు కుటుంబ సభ్యులతో కలిసి చేరుకున్నారు. ముందుగా గండి వీరాంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్దకు చేరుకుని దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ దివంగత వైఎస్సార్‌ అనుచరునిగా తనను గుర్తిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనకు కేబినేట్‌లో మంత్రి పదవి కల్పించడంతో పాటు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించారన్నారు. గండి క్షేత్రంలో వీరాంజనేయస్వామి 100 అడుగుల విగ్రహం ఏర్పాటుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడి చర్యలు తీసుకుంటానని తెలిపారు.

అనంతరం ఒంటిమిట్టకు చేరుకున్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని పలు ప్రధాన ఆలయాలను తొలిదశలో మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పనకు ఎంపిక చేసినట్లు తెలిపారు. అన్యాక్రాంతమైన, కబ్జాకు గురైన దేవదాయ శాఖ భూములను సంరక్షిస్తామని చెప్పారు. దేవదాయ శాఖలో టీటీడీ తరహా ఆన్‌లైన్‌ పద్ధతిని పాటించేలా ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. గండి వీరాంజనేయస్వామి దేవస్థాన చైర్మన్‌ పి.రాఘవేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top