భర్త వేసిన స్కెచ్‌తో రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన కిలాడీ భార్య
ఇంటికి తాళం వేసి భార్య, ప్రియుడిని బంధించిన భర్త
‘ప్రియుడిని మాత్రం వదలను’ అంటూ తెగేసి చెప్పిన భార్య
ప్రియుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన వైనం
మదనపల్లె టౌన్: భర్త కష్టపడి పనికి వెళ్తే.. భార్య మాత్రం ప్రియుడితో ఇంట్లో రాసలీలలు సాగించింది. చివరికి అనుమానం వచ్చిన భర్త పక్కా స్కెచ్‌తో ఇద్దరినీ మంచంపైనే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, ఇంటికి తాళం వేసి పోలీసులకు పట్టించిన సంచలన ఘటన ఆదివారం మదనపల్లె మండలంలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. అన్నమయ్య జిల్లా కొత్తపల్లె పంచాయతీ పరిధిలోని ఓ కాలనీలో నివాసముంటున్న ఒక భవన నిర్మాణ కార్మికుడికి, అతడి భార్యకు కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో ఆమె ఒక డిష్ ఆఫీస్‌లో బిల్ కలెక్టర్‌గా పనిచేసే యువకుడితో వివాహేతర బంధం పెట్టుకుంది. భర్త ఇంట్లో లేని సమయం చూసి ప్రియుడిని నిత్యం ఇంటికి రప్పించుకునేది. ఆదివారం కూడా భర్త పనికి వెళ్లాడనుకుని భార్య తన ప్రియుడిని ఇంట్లోకి పిలిపించుకుని గుట్టుగా గదిలోకి దూరింది. అయితే, భార్య ప్రవర్తనపై మొదటి నుంచీ నిఘా పెట్టిన భర్త.. ఈసారి కాపు కాసి అకస్మాత్తుగా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. బెడ్‌రూమ్‌లో భార్య, ప్రియుడు ఏకాంతంగా ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యాడు. వెంటనే చాకచక్యంగా వ్యవహరించి, గది బయట నుంచి గడియ పెట్టి, ఇంటికి తాళం వేశాడు. ఆ తర్వాత మీడియాకు, తాలూకా పోలీసులకు సమాచారం అందించడంతో ఈ కిలాడీ భార్య లీలలు రచ్చకెక్కాయి.
పోలీసులు, స్థానికులు అక్కడికి చేరుకున్నాక విచారించగా.. ఆ భార్య ఏమాత్రం సిగ్గుపడకుండా, ‘కావాలంటే నా మొగుణ్ణి వదిలేస్తాను కానీ, నా ప్రియుడిని మాత్రం వదలను‘ అంటూ అందరి ముందూ తెగేసి చెప్పడంతో వివాదం మరింత ముదిరింది. దాంతో ఆగ్రహం తట్టుకోలేకపోయిన భర్త, స్థానికులు కలిసి భార్య కళ్ల ముందే ప్రియుడికి తల పగిలేలా దేహశుద్ధి చేశారు. అనంతరం ఇద్దరినీ తాలూకా పోలీసులకు అప్పగించారు. ఈ వింత వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.


