
వైఎస్ జగన్‌కు వినతిపత్రం ఇస్తున్న కరేడు రైతులు
ఏటా రెండు పంటలు పండే భూములు ఎలా ఇవ్వాలి?
పచ్చటి సారవంతమైన భూములు ఇస్తే మా గతి ఏమిటి?
ఇచ్చే ప్రసక్తే లేదని చెబుతుంటే కూటమి ప్రభుత్వం బలవంతం చేస్తోంది
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌తో మొర పెట్టుకున్న కరేడు రైతులు
అన్నదాతల ఆందోళనలకు వైఎస్సార్‌సీపీ మద్దతిస్తుందని జగన్ భరోసా
మా ప్రభుత్వంలో చేవూరులో ఇండోసోల్‌కు భూముల కేటాయింపు
ఆ కంపెనీతోనే రూ.500 కోట్లు రైతులకు పరిహారంగా ఇప్పించాం
ఆ భూములను వారికి ఇవ్వకుండా ఇప్పుడు మరో చోటుకు వెళ్లమనడం సరికాదు
బీపీసీఎల్‌కు కేటాయించడానికి ప్రభుత్వ భూములున్నాయి
అలా చేయడం లేదంటే ఇండోసోల్‌కు పొమ్మని పొగబెట్టడమే
మాజీ సీఎం వైఎస్ జగన్ హామీపై ధన్యవాదాలు తెలిపిన రైతులు
నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం
సాక్షి, అమరావతి: ‘పచ్చని పంటలు పండే ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడు భూములను కూటమి ప్రభుత్వం బలవంతంగా సేకరించాలనుకుంటోంది. సారవంతమైన భూములు ఇచ్చేస్తే మాగతి ఏం కావాలి? మా ప్రాణాలైనా ఇస్తాం కానీ, సెంటు భూమి కూడా ఇవ్వబోమని తేల్చి చెప్పాం. ప్రభుత్వం వినిపించుకోక పోగా, మాపై ఒత్తిడి తెస్తోంది. దీంతో కొద్ది రోజులుగా మేము ఆందోళన చేపట్టాం. అయినా ప్రభుత్వ పెద్దల వైఖరిలో మార్పు రాలేదు’ అని కరేడు ప్రాంత రైతులు మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌తో తమ గోడు వెళ్లబోసుకున్నారు.
కూటమి సర్కారుకు మీరే గట్టిగా బుద్ధి చెప్పాలంటూ మంగళవారం కరేడు ప్రాంత రైతులు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌కు వినతిపత్రమిచ్చారు. వారి కష్టాన్ని ఓపికగా విన్న వైఎస్ జగన్.. ప్రభుత్వం బలవంతంగా రైతుల వద్ద నుంచి భూములు తీసుకోవడం తగదన్నారు. ఆ ప్రయత్నాన్ని తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అన్నదాతకు వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని, రైతుల తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఇండోసోల్ సొంత ఖర్చుతో ప్రభుత్వం సేకరించిన భూములను వారికి ఇవ్వకుండా, మరోచోటుకు వెళ్లమనడం పరిశ్రమలను తరిమేసే కుట్రేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారి డబ్బుతో వారికి కేటాయించిన భూములవి
‘గతంలో తమ ప్రభుత్వ హయాంలో రామాయపట్నం పోర్టుకు సంబంధించి ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా భూసేకరణ చేసి నిర్వాసితులకు న్యాయం చేశాం. పోర్టుకు ఆనుకుని ఇండోసోల్ కంపెనీ అనుబంధ పరిశ్రమ గుడ్లూరు మండలం చేవూరు, రావూరులో భూములు ఇచ్చేందుకు రైతులను ఒప్పించాం. ఇందుకోసం ఇండోసోల్ కంపెనీతోనే సుమారు రూ.500 కోట్లు రైతులకు పరిహారంగా ఇప్పించాం. ఆ భూముల్లో ఆ కంపెనీ ఏర్పాటవుతున్న దశలో కూటమి ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది. వారి డబ్బుతో వారికి కేటాయించిన భూములను వారికి ఇవ్వకుండా కరేడుకు వెళ్లిపొమ్మంది. కరేడులో సారవంతమైన, ఏటా రెండు పంటలు పండే భూములు ఇవ్వాలని రైతులపై ఒత్తిడి తెస్తోంది.
రైతులకు ఆ భూములు ఇవ్వడం ఏమాత్రం ఇష్టం లేకపోయినా ఇవ్వాల్సిందేనని బలవంతం చేస్తోంది. ఇది ఎంత మాత్రం సరికాదు. ఇండోసోల్‌కు కేటాయించిన భూములను బీపీసీఎల్‌కు ఇచ్చి, ఇండోసోల్‌కు పొగ పెట్టి పొమ్మంటోంది. బీపీసీఎల్‌కు ఇవ్వాలనుకుంటే ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ భూములు సరిపడా ఉన్నాయి. అలా చేయకుండా రైతులకు ఏమాత్రం ఇష్టం లేని భూములు కేటాయిస్తున్నామని చెప్పి ప్రభుత్వం వివాదం రాజేసింది. ఇది ముమ్మాటికీ కుట్రే. సారవంతమైన భూములు కోల్పోతామని కరేడు రైతులు ఎంతగానో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వారికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది. ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంది’ అని బాధిత రైతులకు వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. జగన్ హామీతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ను ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, వైఎస్సార్‌సీపీ కందుకూరు సమన్వయకర్త బుర్రా మధుసూదన్ యాదవ్‌లు కలిశారు. అనంతరం వారంతా కేంద్ర కార్యాలయం మీడియా పాయింట్‌లో మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

జగన్ పోరాడుదామన్నారు..
మేమంతా జగన్‌ను కలిసి సమస్యను వివరించాం. జగన్ మాకు అభయమిచ్చారు. భవిష్యత్‌లో తన అవసరం ఎప్పుడు ఉంటే అప్పుడు రైతుల తరఫున వచ్చి పోరాడతానని జగన్ భరోసా ఇచ్చారు. పచ్చని పంటలు పండే భూములను మేం వదులుకోం. ప్రభుత్వం మా నుంచి ఇంచు భూమి కూడా తీసుకోలేదు. – మిరియం శ్రీనివాసులు, రైతు, కరేడు గ్రామం
సమస్యను జగన్‌కు చెప్పాం
కరేడు రైతుల సమస్యలన్నీ వైఎస్ జగన్‌కు వివరించాం. మాకు ఇష్టం లేకుండా మా భూములను తీసుకుంటామనడం దుర్మార్గం. బాగా పంటలు పండే భూములను ఇవ్వాలని బలవంతం చేయడం తగదు. జగన్ సార్ మాకు అండగా ఉంటామన్నారు. మా రైతుల తరఫున జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. – శ్రీనివాసమూర్తి, రైతు, కరేడు గ్రామం
విలువైన భూములన్నీ కబళించే ప్రయత్నం
కరేడు రైతులు వైఎస్ జగన్‌ను కలిసి అన్నీ వివరించారు. ఇండోసోల్‌కు కేటాయించిన భూముల్లో బీపీసీఎల్ కంపెనీని తీసుకురావడాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు. సింగరాయకొండ నుంచి కావలి వరకు జాతీయ రహదారి పక్కన 30 కిలోమీటర్ల పొడవునా సముద్ర తీరంలో భూములన్నీ ప్రభుత్వం కబళించే ప్రయత్నం చేస్తుంది. ఈ కుట్రను వైఎస్సార్‌సీపీ త్వరలో బయటపెడుతుంది. – తూమాటి మాధవరావు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ
సారవంతమైన భూములు రైతులకే చెందాలి
కరేడులో ఈ భూముల గురించి రైతులు పోరాడుతున్నారు. రైతులు వైఎస్ జగన్‌ను కలిసి వారి గోడు చెప్పుకున్నారు. మా ప్రభుత్వంలో ఇండోసోల్‌కి మేం కేటాయించిన భూములు ఇవ్వకుండా, వారిని కరేడుకు వెళ్లిపొమ్మన్నారు. దీనిని మేం వ్యతిరేకిస్తాం అని జగన్ చెప్పారు. సారవంతమైన భూములు రైతులకే చెందాలని, ఇలాంటి భూములు ఇవ్వకూడదన్నారు. సాగుకు నిరుపయోగం అయిన భూములు ఇస్తే ఎలాంటి అభ్యంతరం లేదని జగన్ చెప్పారు. – బుర్రా మధుసూదన్ యాదవ్, కందుకూరు వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్