
కలెక్టర్ కార్యాలయం ముందు పెట్రోలు బాటిల్‌తో రిటైర్డు వీఆర్‌ఓ కరిముల్లా
పీజీఆర్‌ఎస్‌లో సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ ఆత్మహత్యలకు యత్నాలు
ఏడాదిన్నరగా రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదని పెట్రోలు సీసాతో కలెక్టరేట్‌కు వచ్చిన రిటైర్డ్ వీఆర్‌ఓ
నా భార్య, పిల్లలు, నేను ఏం తిని బతకాలని నరసరావుపేటలో ఆవేదన
తిరుపతిలో విష గుళికలు మింగి జేసీ ఎదుటే కుప్పకూలిన వివాహిత
ఎన్నిసార్లు తిరిగినా కుటుంబ సమస్య పరిష్కరించడంలేదని గగ్గోలు
నరసరావుపేట/తిరుపతి అర్బన్: టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా సమస్యలు పరిష్కారం కాకపోతుండడంతో పలువురు అర్జీదారులు తరచూ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా సోమవారం తన రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ చెల్లించడంలేదని ఓ రిటైర్డ్ వీఆర్వో పెట్రోలు సీసాతో కలెక్టరేట్‌కు రాగా.. తన కుటుంబ సమస్య పరిష్కరించడంలేదంటూ తిరుపతిలో ఓ వివాహిత విష గుళికలు మింగి జేసీ ఎదుట కుప్పకూలిపోయింది. వివరాలివీ..
రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కోసం..
తనకు రావాల్సిన రిటైర్‌మెంట్ బెనిఫిట్స్‌ను రెవెన్యూ అధికారులు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని, తన భార్య, పిల్లలు, తాను ఏం తిని బతకాలని రిటైర్డు వీఆర్‌ఓ షేక్ కరిముల్లా ఆవేదన వ్యక్తంచేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) సమావేశానికి ఆయన పెట్రోల్ బాటిల్‌తో వచ్చారు. అయితే, పోలీసులు ఇది గమనించి కరీముల్లాను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు.. బాధితుడు పలువురు మీడియా ప్రతినిధుల సమక్షంలో పెట్రోల్ బాటిల్‌ను చూపిస్తూ.. ఇంతకంటే తనకు గత్యంతరం కన్పించటంలేదని వాపోయారు.
రొంపిచర్ల మండలం సంతగుడిపాడుకు చెందిన తాను 30 ఏళ్ల పాటు రెవెన్యూ విభాగంలో పనిచేసి గతేడాది ఉద్యోగ విరమణ చేశానన్నారు. ఇప్పటివరకు రావాల్సిన జీతం, పింఛన్ ఇతర సదుపాయాలు తనకు సెటిల్ చేయలేదని, దీనికోసం ఇప్పటికే అనేకమార్లు పీజీఆర్‌ఎస్‌లో అర్జీలు అందజేశానని.. కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా ఫలితం కన్పించటంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. విషయం తెలుసుకున్న డీఆర్‌ఓ ఏకా మురళి బయటకొచి్చ.. కరీముల్లా ఉద్యోగ విరమణ చేసిన సమయంలో ఉన్న తహసీల్దార్ ఇతని సెటిల్‌మెంట్ ఫైల్‌పై సంతకం చేయకుండానే బదిలీపై వెళ్లారని, దానిని పరిశీలించి త్వరలో సెటిల్ చేస్తామని చెప్పారు.
విష గుళికలు మింగిన వివాహిత..
తిరుపతి కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఓ వివాహిత తన సమస్యను జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్‌కు చెప్పుకుంటుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తన భర్తతో వివాదాలున్న నేపథ్యంలో అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోవడంతో ఆమె
విష గుళికలు మింగినట్లు తెలిసింది.
తిరుపతి అన్నమయ్య సర్కిల్ సమీపంలోని యాదవ్‌కాలనీకి చెందిన ఈమె తన సమస్య గురించి ఎవరూ పట్టించుకోవడంలేదని జేసీ సమక్షంలో ఆవేదన వ్యక్తంచేస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో అక్కడే ఉన్న డీఎంహెచ్‌వో బాలకృష్ణనాయక్ ఆమెను హుటాహుటిన రూయా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు తెలిపారు. అయితే, బాధితుల అర్జీలు పరిష్కారం కాకపోవడంతోనే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని అర్జీదారులు ఆరోపిస్తున్నారు.