కుప్పంలోనూ యూరియా కష్టాలు.. రాష్ట్రవ్యాప్తంగా భగ్గుమన్న అన్నదాతలు | Farmers Protest For Urea: Andhra pradesh | Sakshi
Sakshi News home page

కుప్పంలోనూ యూరియా కష్టాలు.. రాష్ట్రవ్యాప్తంగా భగ్గుమన్న అన్నదాతలు

Sep 2 2025 6:03 AM | Updated on Sep 2 2025 6:14 AM

Farmers Protest For Urea: Andhra pradesh

చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోని గుడుపల్లెలో యూరియా కోసం బారులుదీరిన రైతులు

రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో రైతులు సోమవారం ఆందోళన చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరు, తూర్పుగోదావరి జిల్లా, సీతానగరం మండలంలోని వంగలపూడి, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలంలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. అలాగే కర్నూలులో ఉల్లి రైతులు తమకు మద్దతు ధర ఇవ్వాలని మంత్రి భరత్‌ను నిలదీశారు. విజయవాడలో కౌలు రైతులు తమకు రుణాలు మంజూరు చేయాలని ఎస్‌ఎల్‌బీసీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.  – సాక్షి నెట్‌వర్క్‌  

యూరియా కోసం తిప్పలు... తప్పని పడిగాపులు
పుంగనూరు/సీతానగరం/గుడుపల్లె: ఎరువులు, విత్తనాలను ప్రభుత్వం సరైన సమయంలో అందించకపోవడంతో రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. కొన్ని జిల్లాల్లో రైతులు ఉదయమే ఎరువుల పంపిణీ కేంద్రాలవద్ద క్యూలో చెప్పులు ఉంచి, ఆనక వచ్చి యూరియా తీసుకెళుతున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో యూరియా వచి్చందని తెలియడంతో రైతులు మార్కెట్‌ యార్డు, శుభారాం డిగ్రీ కళాశాల వద్ద గల ప్రైవేటు షాపుల వద్దకు సోమవారం ఉదయం 6 గంటలకు చేరుకున్నారు.

10 గంటలు గడిచినా నిర్వాహకులు యూరియా ఇవ్వలేదు. 10గంటల అనంతరం తమకు ఇష్టమైన వారికే పంపిణీ చేయడంతో రైతులు ఒక్కసారిగా గుమిగూడారు. ఆ సమయంలో పలువురు కిందపడ్డారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు వచ్చి వారిని నియంత్రించారు.  

10వేల మందికి 720 బస్తాలా? 
పుంగనూరు మండలంలోని 23 పంచాయతీల్లో సుమారు పదివేల మంది రైతులు ఉన్నారు. వీరికి ప్రభుత్వం కేవలం 720 బస్తాల యూరియా మాత్ర­మే సరఫరా చేయడంతో మిగతా రైతుల పరిస్థితేంటని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్‌ఎస్‌కేల్లో కాకుండా, రైతులను పట్టణానికి పిలిపించడం, ప్రైవేటు వ్యక్తుల ద్వారా పంపిణీ చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. దీనిపై ఏడీ శివకుమార్‌ స్పందించారు. అందరికీ యూరియా పంపిణీ చేస్తామని చెప్పారు. 

క్యూలో చెప్పులు 
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని వంగలపూడి సొసైటీ వద్ద మునుపెన్నడూ లేని విధంగా యూరియా కోసం రైతులు చెప్పులను క్యూలో ఉంచారు. సొసైటీకి ఆదివారం 10 టన్నుల యూరియా వచి్చందని సమాచారం తెలుసుకున్న రైతులు సోమవారం ఉదయం 5 గంటలకు పీఏసీఎస్‌కు చేరుకుని తమ చెప్పులను క్యూలో ఉంచి, తిరిగి ఇళ్లకు వెళ్లారు. అనంతరం ఉదయం 10 గంటలకు సొసైటీ సిబ్బంది రాగానే క్యూలో నిలబడ్డారు. పీఏసీఎస్‌ సీఈవో పంతం సూర్యనారాయణ రైతుకు ఒక యూరియా బస్తా చొప్పున అందించారు. 200మంది రైతులు యూరియా లేకుండానే ఇంటిముఖం పట్టారు.  

చిత్తూరులో రైతుల ఆందోళన 
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం, గుడుపల్లె మండలం కేంద్రంలో సోమవారం యూరియా కో­సం రైతు ఆందోళనకు దిగారు. నెల రోజులుగా సర­ఫరా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డా­రు. ఈక్రమంలో సో­మవారం గుడుపల్లెకు ఒక లో­డు యూరియా రావడంతో వందలాది రైతులు  ఓ ప్రైవేట్‌ దుకాణం వద్ద బారు­లు తీరారు. ఒక రైతు­కు ఒక కట్టమాత్రమే ఇస్తుండటంతో తీవ్ర ఆందోళ­న వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా క్యూలో తోపులా­టలు చోటుచేసుకున్నా­యి. ఇది గొడవలకు దారితీయడంతో పోలీసులు వచ్చి సర్దుబాటు చేశా­రు. చాలా మంది రైతులకు సాయంత్రమైనా యూ­రియా అందకపోవడంతో తిరుముఖం పట్టారు.

మంత్రి ఎదుట ఉల్లి రైతుల కన్నీరుమున్నీరు
రూ.1200 ఏ మాత్రం గిట్టుబాటు కాదంటున్న రైతులు
కర్నూలు(అగ్రికల్చర్‌): ‘ఉల్లి సాగు కోసం రూ.లక్ష వరకూ పెట్టుబడి పెట్టా. తీరా పంటను మార్కెట్‌కు తీసుకొస్తే అధికారులు క్వింటా రూ.1,200కి కొంటున్నారుక్రిభుత్వమే ఇంత తక్కువ ధర ఇస్తే ఎలా బతికేది. ఈ ధర మాకు గిట్టుబాటు కాదు. భారీ ఎత్తున నష్టపోవాల్సి వస్తోంది’ అంటూ ఓ ఉల్లి రైతు మంత్రి ఎదుట కన్నీటిపర్యంతమయ్యాడు.

కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఉల్లికి ప్రభుత్వం ప్రకటించిన రూ.1,200 ధరతో మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోళ్లను మంత్రి టీజీ భరత్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రిని కలిసిన పలువురు ఉల్లి రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు సోమవారం 39 క్వింటాళ్ల ఉల్లిగడ్డలు వచ్చాయి. అన్ని లాట్లకు వ్యాపారులు టెండర్‌ వేశారు. మార్క్‌ఫెడ్‌ ఒక్కలాట్‌ మినహా 38 లాట్లకు రూ.1,200 ధర కోట్‌ చేసింది. ఇందులో ఒక లాట్‌కు రూ.1,329 ధర లభించింది. మరో లాట్‌కు రూ.517 ధర లభించింది. 

మిగిలిన లాట్లు మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేసింది. రూ.517 ధర లభించిన లాట్‌కు రీ టెండరు వేసి మార్క్‌ఫెడ్‌ ద్వారా రూ.1,200కు కొనిపించారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన రూ.1,200 ధర ఎంత మాత్రం గిట్టుబాటు కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రూ.80వేలు నష్టపోయా 
ఎకరాలో ఉల్లి సాగు చేశా. దిగుబడులు పెంచాలనే లక్ష్యంతో రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టా. ఆగస్టు­లో కురిసిన అధిక వర్షాలు నిలువునా ముంచాయి. 100 ప్యాకెట్ల ఉల్లి పొలంలోనే కుళ్లిపోయింది. కేవలం 34 ప్యాకెట్లు (18 క్వింటాళ్లు) మాత్రమే మిగిలింది. ఈ పంటను సోమవారం మార్కెట్‌ యార్డుకు తీసుకెళితే, మా­ర్క్‌­ఫెడ్‌ అధికారులు క్వింటా రూ.­1200కి కొన్నారు. ఈ ధరతో రూ.80 వేల వరకు నష్టం వచ్చింది.  – ఎ.పెద్దయ్య, ఉల్లి రైతు, పి.కోటకొండ గ్రామం,  కర్నూలు జిల్లా  

తూర్పుగోదావరి జిల్లా వంగలపూడి పీఏసీఎస్‌ వద్ద రైతులు క్యూలో ఉంచిన చెప్పులు 

కౌలు రైతులకు హామీ లేని రుణాలివ్వాలి
రైతు సంఘాల డిమాండ్‌
సాక్షి, అమరావతి: కౌలు రైతులకు ఎలాంటి హామీ లేకుండా స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రూ.2 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలివ్వాలని ఏపీ రైతు, కౌలు రైతు సంఘాలు డిమాండ్‌ చేశాయి. విజయవాడ­లోని రాష్ట్రస్థాయి బ్యాంకర్స్‌ కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) కార్యాల­యం ఎదుట రుణాల కోసం కౌలు రైతుల రాయ­బారం పేరిట సోమవారం ఆందోళన జరిగింది. రైతు సంఘాల నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలోని సాగు భూమి­లో 70 శాతం కౌలు రైతులే సాగు చేస్తు­న్నార­ని.. పెట్టుబడి దొరక్క వారంతా ఇబ్బందులు పడు­తున్నారని చెప్పారు.

కనీసం అన్నదాత సుఖీ­భవ సా­యం కూడా కౌలు రైతులకు ఇవ్వడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వడ్డీ రాయితీలు కౌ­లు రైతులకు అందడం లేదన్నారు. ఆందోళన అనంతరం ఎస్‌ఎల్‌బీసీ మేనేజర్‌కు వినతి­పత్రం అందజే­శారు. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం పంట రుణాలు ఇస్తామని, సీసీఆర్సీ కార్డుల్లేని ఈ క్రాప్‌ నమో­దు ప్రాతిపదికన జేఎల్‌జీ గ్రూపుల ద్వా­రా రూ.2 లక్షలకు త­క్కు­వ లేకుండా పంట రుణా­లి­చ్చేందుకు కృషి చేస్తామని ఎస్‌ఎల్‌బీసీ మేనేజర్‌ హా­మీ ఇచ్చారు. ఏపీ రైతు సంఘం అధ్యక్షుడు వై.రా­ధా­కృష్ణ, కార్య­దర్శి కె.ప్రభాకరరెడ్డి, ఏపీ కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement