AP: 87 మంది హోంగార్డులు తొలగింపు.. ఏ ఒక్కర్నీ వదలం 

Jobs in Chittoor Police Department with fake documents - Sakshi

నకిలీ పత్రాలతో చిత్తూరు పోలీసుశాఖలో ఉద్యోగాలు

నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో భారీగా చేరికలు 

దాదాపు రూ.5 కోట్ల వరకు వసూళ్లు 

అప్పటి జిల్లా తెలుగు తమ్ముళ్ల ప్రోద్బలంతో నియామకాలు 

అధికారులు, తమ్ముళ్ల అరెస్టుకు సమాలోచనలు 

సాక్షి, చిత్తూరు: అందరి తప్పొప్పుల్ని సరిదిద్దే పోలీసు శాఖలోకే తప్పుడు పత్రాలతో ప్రవేశిస్తే.. ఇలా దాదాపు ఎనిమిదేళ్లుగా నెలనెలా జీతాలు తీసుకుంటూ విధులు నిర్వర్తిస్తే.. అవును, చిత్తూరు పోలీసు జిల్లాలో అక్షరాలా ఇదే జరిగింది. ఇందుకు ప్రధాన బాధ్యులు టీడీపీ నేతలు.. వారి మాటను కాదనలేకపోయిన అప్పటి పోలీసు ఉన్నతాధికారులు. ఈ ఘటనలో 87 మంది హోంగార్డులను తొలగిస్తూ శనివారం అనంతపురం రేంజ్‌ డీఐజీ రవిప్రకాష్‌ ఉత్తర్వులు జారీచేశారు. చిత్తూరు జిల్లా పోలీసు శాఖను కుదిపేస్తున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలివీ.. 

బయటపడింది ఇలా.. 
హోంగార్డుల్లో రెండు కేటగిరీలు ఉంటాయి. ఒకటి పోలీసు శాఖలోని స్టేషన్లలో పనిచేయడం. వీళ్లకు ప్రభుత్వం నుంచే వేతనాలు అందుతాయి. రెండోది.. ఆన్‌–పేమెంట్‌. అగి్నమాపక, టీటీడీ, ఆరీ్టసీ, రవాణాశాఖ, ఎఫ్‌సీఐ లాంటి సంస్థల్లో విధులు నిర్వర్తిస్తుంటారు. వీళ్లకు ఆయా శాఖల నుంచి ప్రతీనెలా వేతనాలు అందుతాయి. ఈ సంస్థల్లో పనిలేనప్పుడు వీరిని పోలీసుశాఖకు అప్పగిస్తారు. ఆ సమయంలో వాళ్లకు వేతనాలు చెల్లించరు. పని ఉంటేనే వేతనాలు చెల్లిస్తారు. ఇటీవల ఇలాంటి హోంగార్డులకు డ్యూటీలు కేటాయించేటపుడు చిత్తూరు ఆర్‌ఐ మురళీధర్‌ ఉండాల్సిన వాళ్లకంటే కొందరు ఎక్కువగా ఉండటంతో విషయాన్ని ఎస్పీ రిషాంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

అలాగే, మూణ్ణెల్ల క్రితం వన్‌టౌన్‌లో ఆర్‌ఐ మురళీధర్‌ ఈ విషయమై ఫిర్యాదు చేయగా, కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. తొలుత మణికంఠ అనే హోంగార్డును విచారించగా.. చిత్తూరుకు చెందిన టీడీపీ నేతల ఆదేశాలతో తాను, యువరాజ్, జయకుమార్, కిరణ్‌ తదితరులు ఒక్కో పోస్టుకు రూ.3 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు డబ్బులు వసూలుచేసి, అప్పటి అధికారులకు లంచంగా ఇచ్చి హోంగార్డు ఉద్యోగాలు పొందినట్లు అంగీకరించాడు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తునకు ఆదేశించిన ఎస్పీ మరిన్ని వివరాలు రాబట్టారు.  

చదవండి: (కర్నూలులో రాష్ట్రస్థాయి క్యాన్సర్‌ ఆస్పత్రి)

అరెస్టులకు న్యాయపరమైన సలహాలు 
హోంగార్డులకు డ్యూటీలు కేటాయించేపుడు పాస్‌పోర్టు, డీఓ (డ్యూటీ ఆర్డర్‌)ను అధికారులు ఇస్తుంటారు. ఇలా ఇచ్చేటపుడు నిజమైన హోంగార్డును పుత్తూరు అగి్నమాపక శాఖలో విధులు కేటాయిస్తున్నట్లు టైపుచేసి, ఇతనితో పాటు అదనంగా మరో ఐదుగురు నకిలీ హోంగార్డుల పేర్లను టైపుచేసి డీఓ ఇస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంటారు. ఇలా ఏకంగా 87 మందిని పలు సంస్థల్లో నియమించేశారు. ఇందులో కీలకపాత్ర పోషించింది టీడీపీ హయాంలో చినబాబుకు కుడిభుజంగా మెలగిన చిత్తూరు జిల్లా పార్టీ నేతగా తెలుస్తోంది. ఇతను ఆడమన్నట్లు ఆడిన అప్పటి చిత్తూరు పోలీసు బాసు, ఓ ప్రత్యేక డీఎస్పీ సైతం ఈ కుంభకోణంలో చిక్కుకున్నారు.

మరోవైపు.. చిత్తూరు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, పలమనేరుకు చెందిన టీడీపీ ముఖ్య నేతలు కొందరు దాదాపు రూ.5 కోట్ల వరకు వసూలుచేసిన మొత్తంలో కొంత ఉన్నతాధికారులకు ఇచ్చి మిగిలిన సొమ్ము చిన్నబాబుకు అందజేశారని పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అప్పటి ఐపీఎస్‌ అధికారి, డీఎస్పీలు, ఆర్‌ఐలతో పాటు టీడీపీ నేతలను అరెస్టుచేయడానికి పోలీసులు న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం.  

తమ్ముళ్లలో వణుకు.. 
నిజానికి.. పోలీసుశాఖలో అంతర్లీనమైన హోంగార్డులు విధుల్లోకి చేరాలంటే నోటిఫికేషన్, శారీరక దేహదారుఢ్య పరీక్షలు, తుదిగా రాత పరీక్షల్లో ప్రతిభ చూపించడం తప్పనిసరి. అయితే, ఇవేమీ లేకుండా 2014–2019 మధ్య కాలంలో చిత్తూరు జిల్లా పోలీసుశాఖలోకి దాదాపు 87 మంది హోంగార్డులు చేరిపోయారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ నకిలీ హోమ్‌గార్డులు నెలనెలా వేతనాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే హోంగార్డుల తొలగింపు విషయం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో చిత్తూరుకు చెందిన తెలుగు తమ్ముళ్లు వణికిపోతున్నారు.  

ఏ ఒక్కర్నీ వదలం 
ఇది చాలా పెద్ద నేరం. అసలు ఎలాంటి పరీక్షలు, శిక్షణ లేకుండా పోలీసుశాఖలో చేరిపోవడం అంటే తమాషా కాదు. ప్రాథమికంగా 87 మంది హోంగార్డులను డీఐజీ తొలగించారు. దీనిపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఉద్దేశ్యపూర్వకంగా తప్పు అని తేలితే ఆ హోంగార్డులను సైతం అరెస్టుచేస్తాం. ఈ కుట్రలో పాలు పంచుకున్న వాళ్లు ఎంతటివారైనా వదిలే ప్రసక్తేలేదు. 
– వై. రిషాంత్‌రెడ్డి, ఎస్పీ, చిత్తూరు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top