జీఎస్‌ఎల్‌వీ మార్క్3–ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతం

సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): ఎల్‌వీఎం3–ఎం3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. అంతరిక్ష ప్రయోగాల్లో తిరుగులేని శక్తిగా భారత్ అవతరించింది. జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశామని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. వాణిజ్య ప్రయోగాలకు ఇస్రో ముందంజలో ఉందన్నారు.
తిరుపతి జిల్లా సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్(షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఆదివారం ఎల్‌వీఎం3–ఎం3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇందుకోసం ఇస్రో అధికారులు శనివారం ఉదయం 8.30 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించారు. 24.30 గంటల కౌంట్‌డౌన్ అనంతరం ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రయోగం షురూ అయింది.
కౌంట్‌డౌన్ ప్రక్రియలో భాగంగా శనివారం ఉదయం నుంచే రెండో దశలో 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టారు. ఆదివారం ఉదయానికి రాకెట్‌లోని అన్ని వ్యవస్థలను అప్రమత్తం చేసి ప్రయోగాన్ని నిర్వహించారు. ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ శుక్రవారం రాత్రి షార్‌కు చేరుకుని ప్రయోగంపై సమీక్షించారు. ఆయన ఆధ్వర్యంలోనే శనివారం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.
ఈ ప్రయోగం ద్వారా యూకేకు చెందిన నెట్‌వర్క్ యాక్సెస్ అసోసియేట్ లిమిటెడ్ కంపెనీ, భారత్‌కు చెందిన భారతి ఎంటర్‌ప్రైజెస్ సంయుక్తంగా వన్‌వెబ్ ఇండియా–2 పేరుతో రూపొందించిన 5,805 కిలోల బరువు కలిగిన 36 ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్‌లో 87.4 డిగ్రీల వంపులో వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ప్రయోగాన్ని 19.7 నిమిషాల్లో పూర్తి చేయనున్నారు. నాలుగేసి ఉపగ్రహాల చొప్పున.. 9 విడతలుగా కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. పూర్తి స్థాయి వాణిజ్యపరంగా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ కలిసి వన్‌వెబ్ పేరుతో చేస్తున్న రెండో ప్రయోగమిది.
देखें | 36 उपग्रहों को ले जाने वाला LVM3-M3 वनवेब इंडिया-2 मिशन श्रीहरिकोटा के स्पेसपोर्ट से लॉन्च किया गया। @isro #ISRO #LVM3M3/#Oneweb India-2 Mission - https://t.co/pqnE7LbXBy pic.twitter.com/9w2yK7e8gA
— Doordarshan National दूरदर्शन नेशनल (@DDNational) March 26, 2023
మరిన్ని వార్తలు :