విశాఖపట్నం టూ ఢిల్లీ టూర్‌.. ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలు ఇవే

IRCTC Tourism Announces a 10 Day Tour From Visakhapatnam To New delhi - Sakshi

సాక్షి,విశాఖపట్నం: పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే వారికోసం ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఆర్‌సీటీసీ) ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు డిప్యూటీ జనరల్‌మేనేజర్‌ డీఎస్‌జీపీ కిశోర్‌ తెలిపారు. విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ లోని వీఐపీ లాంజ్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరులసమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా యాత్రలకు సంబంధింన బ్రోచర్‌ను ఆవిష్కరించారు.ఐఆర్‌సీటీసీ ఇప్పటికే పలు పుణ్యక్షేత్రాలు, ఉత్తర భారతయాత్రలను విజయవంతంగా పూర్తిచేసిందని ఆయన తెలిపారు. రానున్న రెండు నెలల్లో రెండు ప్రత్యేక రైళ్లునడుపుతున్నట్టు ఆయన చెప్పారు. మొత్తం 13 కోచ్‌ల రైళ్లను కేవలం ఈ యాత్రల కోసమే నడుపుతున్నట్లు, రైలుమొత్తం 1300 ఉన్నప్పటికీ కోవిడ్‌ నేపథ్యంలో కేవలం సగం ఆక్యుపెన్సీతో మాత్రమే ఈ రైళ్లు నడుపుతామన్నారు.

ప్రయాణికులకు ప్రతి రోజూ కోవిడ్‌ కిట్లు అందజేస్తామన్నారు. ఈ రైళ్లలో బయటవారికి ఏ విధమైనఅనుమతి లేకుండా ఈ టూర్‌ ప్యాకేజిలో ఉన్న వారికి ప్రత్యేక ఐడీ కార్డులు ఇచ్చి వారిని మాత్రమే రైళ్లలోకి అనుమతిస్తామని తెలిపారు. ఇటువంటి తీర్థయాత్రలను వెళ్లాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుందని, దీనికి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా తక్కువ చార్జీలతోనే సందర్శించే అవకాశం కల్పిస్తుందని సిబ్బంది తెలిపారు. ఈసమావేశంలో స్టేషన్‌ మేనేజర్‌ సురేష్‌,   స్టేషన్‌  డైరెక్టర్‌ రాజగోపాల్‌,  ఐఆర్‌సీటీసీ ఏరియా మేనేజర్‌ చంద్రమోహన్‌ ,సిబ్బంది పాల్గొన్నారు. ఈ యాత్రల గురించి మరింత సమాచారం కోసం విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ లో గేట్‌ నం.1 వద్ద గల ఐఆర్‌సీటీసీ కార్యాలయంలో స్వయంగా గానీ లేదా 82879 32318 / 82879 32281 / 7670908300 / 0891 2500695 నంబర్లలో గానీ సంప్రదించాలని కోరారు.

ఉత్తర భారత యాత్ర
ఈ యాత్ర మొత్తం 10 రాత్రుళ్లు 11 పగళ్లు ఉంటుంది. ఈ యాత్రలో ఆగ్రా, వైష్ణోదేవి, స్వర్ణదేవాలయం, వాఘాసరిహద్దు, మానస దేవి మందిరం, గంగా ఆర్తి, ఎర్రకోట,
అక్షర్‌ధామ్‌ టెంపుల్‌, కుతుబ్‌మీనార్, లోటస్‌ టెంపుల్‌,ఇండియా గేట్‌ వంటి ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈటూర్‌ ఆగస్టు 27 నుంచి ప్రారంభమై సెప్టెంబర్‌ 6వతేదీన ముగుస్తుంది. ఈ టూర్‌లో ప్రయాణించాలనుకునేవారు విజయవాడ లేదా గుంటూరులో రైలెక్కాల్సి ఉంటుంది. స్లీపర్‌క్లాస్‌–10,400/–, థర్డ్‌ ఏసీ–17,330/–(ఒక్కొక్కరికి) జీఎస్టీతో కలిపి ఈ టూర్‌ చార్జీలు ఉంటాయి.

మహాలయ పిండదాన్‌ తర్పణ్‌
ఈ యాత్ర మొత్తం 6 రాత్రులు, 7 పగళ్లు ఉంటుంది. ఈయాత్రలో వారణాసి, ప్రయాగరాజ్‌, గయ వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. ఈ టూర్‌ సెప్టెంబర్‌ 25
నుంచి ప్రారంభమై అక్టోబరు 1వ తేదీతో ముగుస్తుంది.ఈ టూర్‌లో చేరాలనుకునేవారు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, బ్రహ్మపూర్‌లలో రైలెక్కవచ్చు. ఈ
టూర్‌లో స్లీపర్‌క్లాస్‌–6620/–, థర్డ్‌ ఏసీ–11,030/–(ఒకొక్కరికి) జీఎస్టీతో కలిపి చార్జీలు నిర్ణయించారు.

ఈ స్పెషల్‌ రైళ్లలో ప్రయాణించాలనుకునేవారికి రైలెక్కినది మొదలు దిగే వరకు అన్ని ఐఆర్‌సీటీసీ చూసుకుంటుంది. స్లీపర్‌క్లాస్‌ వారికి హాల్స్‌, ధర్మశాలలు, డార్మెటరీలలోవసతి కల్పిస్తారు. థర్డ్‌ ఏసీ  వారికి డబులు, లేదా త్రిబుల్‌ షేరింగ్‌ హోటల్లో రూంలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. టీ, కాఫీ, బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం,సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం, సైట్‌ సీయింగ్‌ అన్నిప్యాకేజీలు పైన నిర్ణయింన ధరలలోనే ఉంటాయన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top