మంత్రి పేర్నిపై దాడి.. టీడీపీ కుట్రే?

Investigation TDP hand In Attack On Minister Perni Nani - Sakshi

పేర్నిపై దాడి కేసులో వెలుగుచూస్తున్న వాస్తవాలు!

కోపంతో దాడి అన్నది కేవలం టీడీపీ ప్రచారమే!

సాక్షి, అమరావతి : రాష్ట్ర రవాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని)పై జరిగిన దాడికి.. టీడీపీకి ఎటువంటి సంబంధం లేదని నిన్నటి వరకు బుకాయిస్తూ వస్తున్న నేతల్లో వణుకు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. తాపీ మేస్త్రిగా పనిచేస్తున్న బడుగు నాగేశ్వరరావు జీవన పరిస్థితి ప్రభుత్వ తీరుతో అతలాకుతం కావడం వల్లే ఆక్రోశంతో మంత్రిపై దాడికి యత్నించాడని టీడీపీ నేతలు ప్రచారం మొదలెట్టిన సంగతి విదితమే. అయితే పార్టీలకు అతీతంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని బలహీన వర్గాలకు అందజేస్తున్న సంక్షేమ ఫలాలను నాగేశ్వరరావు కుటుంబం సైతం అందుకోవడం గమనార్హం. టీడీపీ నేతలు పన్నిన కుట్రలో భాగంగానే  ఆపార్టీ సానుభూతిపరుడైన నాగేశ్వరరావు దాడికి యత్నించినట్లు ఆధారాలను చూస్తే స్పష్టమవుతోంది. నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు సైతం దాడిని ఖండిస్తున్నారు. దాడి చేసేంతటి అవసరం తన తమ్ముడికి ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదని, దీనిని కలలో కూడా ఊహించలేదని అతని సోదరి స్వయంగా చెప్పడం టీడీపీ కుట్రకు బలాన్ని చేకూరుస్తోంది. (నిందితుడి కాల్‌లిస్ట్‌ పరిశీలన)

సంక్షేమ ఫలాలు  అందాయి..  
టీడీపీ నేతలు చెబుతున్న దాంట్లో వాస్తవం లేదని తేలిపోయింది. బడుగు నాగేశ్వరరావు కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడమే ఇందుకు నిదర్శనం. రెండు నెలల కిందట ఆ కుటంబానికి రైస్‌కార్డు అందింది. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కార్డు.. పట్టణ పేదరిక నిర్మూలన పథకం కింద రూ. 10 వేలు.. నిందితుడి నాగేశ్వరరావు భార్య బడుగు అరుణకుమారి అందుకుంది. అలాగే వైఎస్సార్‌ బీమా కింద నాగేశ్వరరావుకి కార్డు దక్కింది. సాధారణ మరణానికి అయితే రూ. 2 లక్షలు, ఏదైనా ప్రమాదంలో మరణిస్తే రూ. 5 లక్షలు ఈ పథకం కింద ఆ కుటుంబానికి ప్రభుత్వం అందజేస్తుంది. అలాగే నిందితుడి సోదరి, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు ఉమాదేవి కూడా వైఎస్సార్‌ చేయూత కింద రూ. 18,500 లబ్ధి పొందడం విశేషం. ఇలా అన్ని రకాల ప్రభుత్వం నుంచి ఆ కుటుంబం లబ్ధి పొందిన విషయం తెలుసుకున్న టీడీపీ నేతలకు నోట్లో వెలక్కాయ పడిన పరిస్థితి నెలకొంది. అలాంటి కుటుంబానికి ప్రభుత్వంపై ఎందుకు ఆక్రోశం ఉంటుందనేది టీడీపీ నేతలకే తెలియాల్సి ఉంది.

దర్యాప్తు వేగవంతం..  
మంత్రి పేర్ని నానిపై దాడి ఘటన వెనుక కుట్రను ఛేదించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. డీఎస్పీ రమేష్‌రెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు వివిధ కోణాలలో విచారణ చేపట్టాయి. మంత్రి పేర్ని ముఖ్య అనుచరుడు మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ మోకా భాస్కర రావును ఐదు నెలల కిందట టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అనుచరుడు చింతా చిన్ని అతని అనుచరులు కలిసి దారుణంగా నడిరోడ్డుపై హత్య చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా నిందితుడు కావడంతో పోలీసు అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపగా.. ఇటీవలే మాజీ మంత్రి బెయిల్‌పై బయటకు వచ్చా రు. తాజాగా టీడీపీ సానుభూతిపరుడు నాగేశ్వరరావు మంత్రి పేర్నిపై పదునైన ఆయుధంతో దాడికి యత్నించడం వెనుక ఎవరి హస్తం ఉందో తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమవడంతో టీడీపీ నేతల్లో భయాందోళన          నెలకొన్నట్లు ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top