విశాఖ నుంచి తొలిసారిగా అంతర్జాతీయ క్రూయిజ్‌ సేవలు | International cruise services from Visakhapatnam for the first time | Sakshi
Sakshi News home page

విశాఖ నుంచి తొలిసారిగా అంతర్జాతీయ క్రూయిజ్‌ సేవలు

Apr 20 2026 4:51 AM | Updated on Apr 20 2026 4:51 AM

International cruise services from Visakhapatnam for the first time

జూలై 15న విశాఖ నుంచి సర్వీసులు ప్రారంభించనున్న కార్డిలియో క్రూయిజ్‌ 

విశాఖ నుంచి చెన్నై, థాయ్‌లాండ్, మలేషియా మీదుగా సింగపూర్‌కు సర్వీసులు 

మొత్తం 14 రోజులపాటు సముద్ర విహారానికి అవకాశం 

సాక్షి, విశాఖపట్నం : విహార ప్రపంచానికి విశాఖ నగరం మరోసారి ముస్తాబవుతోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నం పోర్టు అథారిటీలో అందుబాటులోకి వచ్చిన క్రూయిజ్‌ టెర్మినల్‌ నుంచి అంతర్జాతీయ విహార యాత్రకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పలుమార్లు దేశీయంగా సర్వీసులు నడవగా తొలిసారిగా అంతర్జాతీయ సర్వీసులకు కార్డిలియో విహార నౌక గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిoది. ఈ ఏడాది జూలై 15న విశాఖపట్నం నుంచి సర్వీసు ప్రారంభం కానుందని ఏపీ టూరిజం ఫోరం ప్రతినిధులు వెల్లడించారు. 

మొత్తం 14 రోజులపాటు సాగే ఈ విహార యాత్ర విశాఖ నుంచి మొదలై చెన్నై మీదుగా థాయ్‌లాండ్‌లోని ఫుకెట్, మలేషియాలోని లంకావి,  కౌలాలంపూర్‌ పట్టణాలను సందర్శిస్తూ చివరకు సింగపూర్‌ చేరుకోనుందని తెలిపారు. ఈ యాత్రలో భాగంగా ప్రయాణికులు సముద్రం మధ్యలో మూడు రోజులపాటు విహరిస్తూ నౌకలోని విలాసవంతమైన సౌకర్యాలు, వినోద కార్యక్రమాలు, రుచికరమైన భోజనాలు రుచి చూడవచ్చని తెలిపారు. ముఖ్యంగా ఫుకెట్‌లో రెండు రోజులపాటు బస చేసే అవకాశం ఉండటంతో పర్యాటకులు అక్కడి అందమైన తీరాలను, థాయ్‌లాండ్‌ దేశ సంస్కృతి సంప్రదాయాలను ఆస్వాదించవచ్చని వెల్లడించారు. 

ఈ యాత్రకు వెళ్లే పర్యాటకులు పాస్‌పోర్ట్‌ కనీసం ఆరు నెలల కాలపరిమితి కలిగి ఉండేలా చూసుకోవాలని టూరిజం ఫోరం ప్రతినిధులు సూచించారు. థాయ్‌లాండ్, మలేషియా దేశాలకు చేరుకున్నాక అనుమతులు లభిస్తాయని, సింగపూర్‌ సందర్శనకు మాత్రం ముందే అనుమతి పత్రాలు తీసుకోవాలని పర్యాటక శాఖ అధికారులు స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement