Bear Facts In Telugu: పిల్లల జోలికొస్తే చంపేంత ప్రేమ.. ఎలుగుబంట్ల గురించి షాకింగ్‌ నిజాలు

Interesting Facts About Bears - Sakshi

ఆత్మకూరు రూరల్‌(నంద్యాల జిల్లా): ఎలుగుబంట్లు తన పిల్లలతో ఉన్నప్పుడు ఎవరైనా ఎదురైతే ఇక ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. ఆ సమయంలో పులినైనా ఎదిరించి దాడికి తెగబడతాయి. పిల్లలపై వాటి వాత్సల్యం అలాంటిది.  కంగారుల్లాగా తన సంతానాన్ని నిత్యం కంటికిరెప్పలా చూసుకుంటూ వెంట పెట్టుకుని తిరిగే ఈ భల్లూకాలు అంతరించిపోతున్న జీవుల్లో ఉండటం విచారకరం.
చదవండి: శిథిలావస్థలో ఉన్న ఇంటిని తవ్వుతుండగా...బయటపడ్డ నిధి

ఎలుగు బంట్లలో పలు రకాల జాతులున్నప్పటికీ స్లాత్‌బేర్‌గా పిలువబడే తెల్లమూతి నల్ల ఎలుగు బంటి భారత ఉపఖండమంతా జీవిస్తున్న మాంసాహార క్షీరదం. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా జీవించ గలిగే ఎలుగుబంటి నల్లమల కీకారణ్యంలోనూ , అనంతపురం జిల్లాలోని బోడి కొండల్లోనూ ఉన్నాయి. అయినప్పటికీ వాటి సంఖ్య క్రమంగా తగ్గిపోతుండటం జంతు ప్రేమికులను కలవరపెడుతోంది.

తన పిల్లలపై అపారమైన ప్రేమ
తన పిల్లలను రక్షించుకునేందుకు  ఎదురు పడిన జీవిని చంపేంత ప్రమాదకారి ఎలుగుబంటి. ఏ వన్యప్రాణి అయినా పిల్లలతో ఉన్నప్పుడు ప్రమాదకరంగా మారుతుంది. కానీ ఎలుగుబంటికి  ఆవేశపాళ్లు చాలా ఎక్కువ. ఈ రౌద్రమంతా  తనకు తన పిల్లల మీద ఉండే అపారమైన ప్రేమ, జాగురూకత. దీంతో అది పిల్లలతో సంచరించేటప్పుడు  జంతువైనా, మనిషి అయినా ఎదురైతే ఎలాంటి శషభిషలు లేకుండా దాడికి పూనుకుంటుంది. ఈ దాడి ప్రాణాంతకంగా ఉంటుంది. అడవుల్లో విధులు నిర్వహించే అటవీ సిబ్బంది కూడా ఎలుగుబంటి దాడి నుంచి తమను తాము కాపాడుకోవడానికి నిరంతర జాగురూకత పాటించాల్సి ఉంటుంది.

నిత్యం వీపున మోస్తూ.. 
భల్లూకం తన పిల్లలను అత్యంత జాగ్రత్తతో పెంచుతుంది. నిత్యం తన వీపుపై మోస్తూ తిరగడం ఎలుగుబంటి ప్రత్యేక లక్షణం. ఇది ఇతర వన్యప్రాణుల్లో అంతగా కనిపించదు. కోతులు మాత్రమే పిల్ల కోతులను పొట్టకు కరిపించుకు మోస్తుంటాయి.

పులినైనా ఎదిరించే ధైర్యం
పిల్లలతో ఉండే ఎలుగు బంటి వాటి రక్షణ కోసం ఎంతకైనా తెగిస్తుందంటారు నల్లమల సమీప గ్రామాల ప్రజలు. చాలా సందర్భాలో అవి పెద్దపులులతో పోరాటానికి దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.  పెద్దపులితో పోల్చుకుంటే  వాటి బలం చాలా తక్కువ. కానీ పిల్లల కోసం  శక్తికి మించి తలపడుతుంటాయి.  వాటి పదునైన గోళ్ల ధాటికి పెద్దపులులు కూడా భయపడతాయని వారు చెబుతారు.

మాంసాహారే కాని అల్పాహారి 
ఎలుగుబంటి పేరుకు కార్నివోర్స్‌ (మాంసాహార జంతువు )ల లిస్ట్‌లో ఉంటుంది. కానీ, అది తినే ఆహారం చూస్తే  అల్పాహారమనుకోకుండా ఉండలేం. ఎలుగు బంటి పుట్టలను తవ్వి చీమలు, చెదలను తింటుంది. అలాగే వివిధ ఫలాలను కూడా ఇది భుజిస్తుంది. రేగు పళ్లను ఇష్టంగా తింటుంది.

చెట్లు ఎక్కడంలో నేర్పరి 
భల్లూకాలు చెట్లు ఎక్కడంలో చిరుత పులులలాగే మంచి నేర్పరులు.  ఇవి ఎక్కువగా   పండ్లను ఆహారంగా స్వీకరిస్తాయి. వాటి కోసం చెట్లను ఎక్కుతుంటాయి. ఎత్తులో ఉండే వెలగ పండ్లను, చిటిమిటి, టుంకి పండ్లను తన  నేర్పరితనంతో ఎలుగు బంట్లు సులభంగా సంపాదించుకుంటాయి. అలాగే తేనె పట్టులను కూడా ఇవి  ఆహారంగా తీసుకుంటాయి.

భల్లూకం నుంచి ఇలా తప్పించుకోవచ్చు 
కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఎలుగుబంట్లు దాడికి తెగబడుతాయి.వెంట పిల్లలున్నప్పుడు, ఆహార సేకరణ సమయంలో అంతరాయం కలిగిస్తే అవి రెచ్చిపోతాయి. అడవుల్లో సంచరించే వ్యక్తులు పరిసరాలను జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు కదలాలి.  పుట్టల వద్ద ఎలుగు బంట్లు కనిపిస్తే పెద్దగా అరుస్తూ కేకలు వేయడం ద్వారా వాటిని బెదర గొట్టవచ్చు.  అలాగే చేతిలో తమ పొడవుకు మించిన చేతికర్రను వెంట తీసుకెళ్లాలి. ఎలుగుబంటి పరుగు వేగం కూడా తక్కువే కాబట్టి దూరంగా పరుగెత్తి ప్రాణాలు కాపాడుకునేందుకు వీలుంటుంది.

ఎలుగుబంటి రక్షిత జీవి 
ఎలుగుబంటి రక్షిత జంతువుగా ప్రభుత్వం గుర్తించింది. ఇది అంతరించిపోయే దశలో ఉన్నందువలన దీనిని వేటాడడంగానీ, ప్రమాదం కలిగించడంకానీ చట్టబద్ధంగా నేరం. ఎలుగుబంట్లు సాధారణ పరిస్థితుల్లో ఎవరికి హాని చేయవు. కొద్దిజాగ్రత్తలు తీసుకుంటే వాటి నుంచి ఇబ్బందులు ఎదురుకాకుండా తప్పించుకోవచ్చు.  
–శ్రీనివాసరెడ్డి, ఎఫ్‌డిపీటీ, ఎన్‌ఎస్‌పీఆర్‌ 

మనిషిని చూస్తే గట్టిగా అరుస్తాయి
అడవిలో పులితో కూడా ప్రమాదం లేదు కానీ ఎలుగుబంటి చూస్తేనే చాలు మాకు వణుకుపుడుతుంది. మనిషిని చూస్తే అవి పెద్దగా అరుస్తూ మీదపడి తీవ్రంగా గాయపరుస్తాయి. మా గ్రామానికి చెందిన చాలా మంది వాటి దాడిలో గాయపడ్డారు. ఓ ఇద్దరు మరణించారు కూడా. వీరికి అటవీశాఖ నుంచి పరిహారం లభిస్తుండడం కొంత మేలు కలుగుతుంది.
– ఎల్లయ్య, రైతు, నల్లకాల్వ  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top