
విజయవాడ: శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రికి భారీగా భక్తులు పోటెత్తారు. భక్తులతో క్యూ లైన్లు కిటకిటలాడుతున్నాయి. వీఐపీ టైమ్ స్లాట్‌లో సిఫార్సు లేఖలతో భారీగా వీఐపీ భక్తులు తరలి రావడంతో వారిని నియంత్రించలేక పోలీసులు చేతులెత్తేశారు.
దుర్గ గుడిపై వైభవంగా జరుగుతున్న నవరాత్రులలో భాగంగా గురువారం అమ్మవారు కాత్యాయనీ అవతారంలో దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనానికి భక్తులకు నాలుగు గంటల సమయం పడుతోంది. విశేషంగా తరలివస్తున్న మహిళా భక్తులను పోలీసులను కట్టడి చేయలేకపోతున్నారు. విచక్షణ మరిచి పోలీసులు ప్రవర్తిస్తున్నానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహిళా భక్తులను పట్టుకుని, పోలీసులు ముందుకు నెట్టివేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
ఒక సమయంలో పోలీసులతో సేవా కమిటీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. తమ వారిని దర్శనాలకు పంపించాలంటూ పోలీసులతో సేవా కమిటీ సభ్యులు గొడవపెట్టుకున్నారు. ఇదిలావుండగా దుర్గగుడి ఘాట్ రోడ్డు ఎంట్రన్స్ వద్ద డ్యూటీ ముగించుకుని బైక్ పై వెళ్తున్న కానిస్టేబుల్ ను ముందుకు వెళ్ళమని ఏసీపీ తోసేసిన ఉదంతం చోబుచేసుకుంది. ఈ సమయంలో బైక్ అదుపుతప్పి కానిస్టేబుల్ కిందపడిపోయాడు. ఏమాత్రం కనికరం లేకుండా ఏసీపీ ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారింది.