పిన్నిని ముక్కలుగా నరికి..! | Vijayawada Old Women Incident | Sakshi
Sakshi News home page

పిన్నిని ముక్కలుగా నరికి..!

Oct 6 2025 2:39 AM | Updated on Oct 6 2025 2:39 AM

Vijayawada Old Women Incident

గోనె సంచుల్లో కట్టి మురికి కాల్వల్లో పడేసిన అక్క కొడుకు

మైనర్‌ కొడుకుతో కలిసి దారుణానికి ఒడిగట్టిన నిందితుడు

విజయవాడలో దారుణం

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): స్వయాన అక్క కొడుకే ఆమె పాలిట రాక్షసుడిగా మారాడు. తన భార్య పుట్టింటికి వెళ్లిపోవడానికి పిన్నే కారణమని భావించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. వృద్ధురాలని కూడా చూడకుండా తన మైనర్‌ కొడుకుతో కలిసి ముక్కలుముక్కలుగా నరికి గోనె సంచుల్లో చుట్టి వేర్వేరు కాలువల్లో పడవేశాడు. సభ్యసమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే ఈ ఘటన ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ భవానీపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. భవానీపురం ఊర్మిళానగర్‌లో విజయలక్ష్మి(60) ఒంటరిగా నివసిస్తోంది.

ఆమె ఇంటికి కొద్ది దూరంలో ఆమె అక్క కుమారుడు వంకదార హనుమాన్‌జీ సుబ్రహ్మణ్యం కుటుంబం నివసిస్తోంది. కొద్ది రోజులుగా సుబ్రహ్మణ్యం, అతని భార్య మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యం భార్య అతడిని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. దీనికి కారణం పిన్ని విజయలక్ష్మి చెప్పుడు మాటలేనని సుబ్రహ్మణ్యం భావించాడు. ఆమెపై పగ పెంచుకొని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం కొద్ది రోజులుగా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. సుబ్రహ్మణ్యం గత బుధవారం విజయలక్ష్మి ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి మాయమాటలతో తన ఇంటికి ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చాడు.

ఆ తరువాత ఆమెపై ఒక్కసారిగా కత్తితో దాడికి దిగాడు. ఆమెపై దాడి చేయటానికి సుబ్రహ్మణ్యం మైనర్‌ కుమారుడు సహకరించాడు. విజయలక్ష్మిని ముక్కలుగా చేసి ఆమె శరీర భాగాలను వేరు చేశారు. వాటిని వేర్వేరు గోనెసంచుల్లో మూటకట్టి ఊర్మిళానగర్, గొల్లపూడి తదితర ప్రాంతాల్లో మురుగుకాలువల్లో పడేశాడు. అయితే విజయలక్ష్మి కనపడటం లేదని భవానీపురం పోలీసులకు ఫిర్యాదు అందింది. శనివారం గొల్లపూడి పంటకాలువ రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తి శరీర భాగాలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

దీంతో అవి విజయలక్ష్మి శరీరభాగాలుగా పోలీసులు గుర్తించారు. అనంతరం పోలీసుల విచారణలో సుబ్రహ్మణ్యమే ఈ హత్యకు కారణమని నిర్ధారించారు. ఘటన తర్వాత నంద్యాల పరారైన సుబ్రహ్మణ్యం, అతనికి సహకరించిన కుమారుడిని నగరానికి తీసుకొచ్చి విచారణ చేస్తున్నట్లు సమాచారం. విజయలక్ష్మి శరీర భాగాలు పూర్తిగా లభించకపోవటంతో విచారణ కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement