YSRCP Plenary: జడి వానలోనూ అభిమాన ప్రవాహం | Sakshi
Sakshi News home page

YSRCP Plenary: జడి వానలోనూ అభిమాన ప్రవాహం

Published Sun, Jul 10 2022 5:22 AM

Huge Public Attend For YSRCP Plenary For CM Jagan - Sakshi

వైఎస్సార్‌ ప్రాంగణం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్‌ సీపీ ప్లీనరీ జరుగుతున్న ప్రాంతంలో జాతీయ రహదారి వెంట ఇరువైపులా దాదాపు 20 కి.మీ. మేర ఎటు చూసినా జన ప్రవాహం, బారులు తీరిన వాహనాలే కనిపించాయి. సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన కార్యకర్తలతో ప్లీనరీ ప్రాంగణం ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయింది. సీఎం జగన్‌ ప్రసంగాన్ని వినేందుకు 20 కి.మీ. మేర నడిచి ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్నట్లు నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం చంద్రాపల్లెకు చెందిన రంగయ్య ‘సాక్షి’కి తెలిపారు. ఆయన ఒక్కరే కాదు.. ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన వేలాది మంది కాలి నడకన వేదిక వద్దకు వచ్చారంటే జన ప్రవాహాన్ని ఊహించవచ్చు.

కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారిపై దక్షిణాన చిలకలూరిపేట నుంచి ఉత్తరాన విజయవాడ వరకూ కిలోమీటర్ల మేర ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. ప్లీనరీ తొలి రోజైన శుక్రవారం జరిగిన ప్రతినిధుల సభకు 1.50 లక్షల మంది వస్తారని వైఎస్సార్‌సీపీ అగ్రనేతలు అంచనా వేయగా దాదాపు రెట్టింపు స్థాయిలో తరలివచ్చారు. రెండో రోజైన శనివారం విస్తృత స్థాయి సమావేశానికి నాలుగు లక్షల మంది రావచ్చని భావించగా అంతకు మించి హాజరయ్యారు. అంచనాలకు మించి జనం పోటెత్తడంతో పోలీసులు నియంత్రించలేకపోయారు. రెండు రోజుల పాటు జరిగిన వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సందర్భంగా మొత్తం పది తీర్మానాలపై సమావేశాల్లో చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. వైఎస్సార్‌ సీపీ జీవిత కాల జాతీయ అధ్యక్షుడిగా వైఎస్‌ జగన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  

జనం మెచ్చిన పరిపాలన..: వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటింది. దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో ఎన్నికల హామీల్లో 95 శాతం తొలి ఏడాదే సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేశారు. నవరత్నాలు, సంక్షేమ పథకాల ద్వారా మూడేళ్లలో రూ.1.60 లక్షల కోట్లను నగదు బదిలీ రూపంలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. మంత్రివర్గం నుంచి నామినేటెడ్‌ పదవుల వరకూ సింహభాగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చి రాజ్యాధికారంలో వాటా కల్పించడం ద్వారా పాలకులుగా చేశారు. విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను ఇంటి గుమ్మం వద్దకే చేరవేసి అత్యంత పారదర్శకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటంతో ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారు. తాము కాలరెగరేసుకుని తిరిగేలా సీఎం జగన్‌ జనరంజకంగా పాలిస్తుండటంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉరిమే ఉత్సాహంతో ప్లీనరీ విస్తృత స్థాయి సమావేశానికి కదలి వచ్చారు. వందల కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఆటోలు, ద్విచక్రవాహనాలపై చేరుకోవడం గమనార్హం.  

ఉదయం 7 గంటలకే..: శుక్రవారం రాత్రి ఎన్టీఆర్‌ జిల్లా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. శనివారం ఉదయం 7 గంటల నుంచే చిరు జల్లులు ప్రారంభమయ్యాయి. కర్ణాటక సరిహద్దున ఉన్న శ్రీసత్యసాయి జిల్లా, ఒడిశా సరిహద్దున ఉన్న శ్రీకాకుళం వరకూ 26 జిల్లాల నుంచి కదలివచ్చిన శ్రేణులు ఉదయం 7 గంటలకే ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్నాయి. 11.30 గంటలకే ప్లీనరీ ప్రాంగణమంతా జనంతో కిక్కిరిసిపోయింది. చిరు జల్లులతో ప్రారంభమైన వాన ఉద్ధృతి అంతకంతకు పెరిగినా కదలలేదు. వాన ఉద్ధృతితో పోటీ పడుతూ  ఉప్పెనలా పోటెత్తారు. వర్షం జోరున కురుస్తుండటంతో సాయంత్రం 4 గంటలకు ప్రసంగించాల్సిన సీఎం వైఎస్‌ జగన్‌ మధ్యాహ్నం రెండు గంటలకే ప్రారంభించారు. 

ఉత్సాహపరుస్తూ దిశానిర్దేశం..: మహానేత వైఎస్సార్‌  2009 సెప్టెంబరు 2న హఠాన్మరణం చెందినప్పటి నుంచి 2019లో అధికారంలోకి వచ్చే వరకూ అవమానాలను సహిస్తూ.. కష్టాలను భరిస్తూ తన వెన్నంటి నిలిచిన కార్యకర్తలు, అభిమానులకు సెల్యూట్‌ చేస్తున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించగానే.. శ్రేణుల నుంచి విశేష స్పందన లభించింది. పార్టీ జీవిత కాల అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటన వెలువడిన అనంతరం శ్రేణుల హర్షధ్వానాల మధ్య సీఎం జగన్‌ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ ఎన్నికలతో పాటు తిరుపతి లోక్‌సభ, బద్వేలు, ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో రికార్డు మెజార్టీతో వైఎస్సార్‌సీపీని గెలిపించారని.. ఘోర పరాజయంతో సైకిల్‌ చక్రాలు ఊడిపోయాయని టీడీపీపై చెణుకులు విసిరినప్పుడు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈలలతో ప్రతిస్పందించారు. చక్రాలు లేని సైకిల్‌ను తొక్కలేక.. కొడుకుతో తొక్కించలేక చంద్రబాబు అరువుకు దత్తపుత్రుడిని తెచ్చుకున్నారన్న సెటైర్‌కు ఈలలు, కేకలతో ప్లీనరీ ప్రాంగణం ప్రతిధ్వనించింది.  

అర్జునులు మీరే..: ‘మన ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మంచిని జీర్ణించుకోలేక చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5లతో కూడిన దుష్ట చతుష్టయం దుష్ప్రచారం చేస్తోంది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఇంకా ఎక్కువ చేస్తుంది. గడప గడపకూ వెళ్లి ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరిస్తూ సోషల్‌ మీడియా ద్వారా తిప్పికొట్టాలి. చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా ఓటేసినట్లేనని ప్రజలను చైత్యన పరచండి’ అని శ్రేణులకు సీఎం జగన్‌ నిర్దేశించారు. ‘చంద్రబాబు కౌరవ సైన్యాన్ని ఓడించే యుద్ధంలో అర్జునుడి పాత్ర మీదే..’ అంటూ సీఎం జగన్‌ బాధ్యత అప్పగించగా.. తాము తీసుకుంటామని కార్యకర్తలు ప్రతిస్పందించారు. ‘వచ్చే ఎన్నికల్లో మనం 175కి 175 స్థానాలూ  గెలవాలి. అది అసాధ్యమేమీ కాదు సుసాధ్యమే. మనం చేస్తున్న మంచితో కుప్పం ప్రజలు కూడా ఆశీర్వదించారు. పంచాయతీ ఎన్నికల్లో, మండల పరిషత్, జెడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేశాం. అదే రీతిలో 175 స్థానాలు గెలవాలన్నదే మన లక్ష్యం’ అని సీఎం జగన్‌ లక్ష్యాన్ని నిర్దేశించారు. సీఎం జగన్‌ ప్రసంగం ముగిశాక కూడా చాలాసేపు శ్రేణులు ప్లీనరీ ప్రాంగణం నుంచి కదల్లేదు. జాతీయ గీతాలాపన అనంతరం  వెనుతిరిగాయి. 

గుండెల నిండా అభిమానం..
వైఎస్సార్‌సీపీ పట్ల కార్యకర్తల్లో ఎంత అభిమానం ఉందంటే ప్లీనరీ ముగిశాక పలువురు సీఎం జగన్‌ కటౌట్లను తమ వెంట భద్రంగా తీసుకెళ్లారు.  ఒకవైపు కార్యకర్తలు తిరుగు ప్రయాణం కాగా మరోవైపు చాలా వాహనాలు ఇంకా ప్లీనరీకి వస్తూనే ఉన్నాయి.  

Advertisement

తప్పక చదవండి

Advertisement